మనసుతో కథలు చెప్తోంది....

తాతయ్య అమ్మమ్మల జీవిత ప్రయాణం, ఒడుదొడుకుల్ని ఎదుర్కొని విజయం సాధించిన యువకుని కథ, క్యాన్సర్‌ నుంచి కోలుకున్న ఓ యువతి గాథ.. ఇలా తరచి చూస్తే ప్రతి ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో మలుపు. అవన్నీ విన్నప్పుడూ, చూసినప్పుడు మనకేమనిపిస్తుంది.. గుండెలు బరువెక్కుతాయి.. స్ఫూర్తి రగిలిస్తాయి కదా! అలాంటి భావనే భోపాల్‌కు చెందిన ‘ద్రిష్టి సక్సేన’కు రోడ్డు పక్కన ఛాయ్‌ అమ్ముకునే మహిళతో మాట్లాడినప్పుడు కలిగింది.

Updated : 12 May 2023 12:51 IST

తాతయ్య అమ్మమ్మల జీవిత ప్రయాణం, ఒడుదొడుకుల్ని ఎదుర్కొని విజయం సాధించిన యువకుని కథ, క్యాన్సర్‌ నుంచి కోలుకున్న ఓ యువతి గాథ.. ఇలా తరచి చూస్తే ప్రతి ఒక్కొరి జీవితంలో ఒక్కో మలుపు. అవన్నీ విన్నప్పుడూ, చూసినప్పుడు మనకేమనిపిస్తుంది.. గుండెలు బరువెక్కుతాయి.. స్ఫూర్తి రగిలిస్తాయి కదా! అలాంటి భావనే భోపాల్‌కు చెందిన ‘ద్రిష్టి సక్సేన’కు రోడ్డు పక్కన ఛాయ్‌ అమ్ముకునే మహిళతో మాట్లాడినప్పుడు కలిగింది..ఇటువంటి వారి జీవిత కథలను ఒకే వేదికపైకి ఎందుకు తేకూడదూ అనుకుంది.. ‘పీపుల్‌ ఆఫ్‌ ఇండియా’ అనే ఆన్‌లైన్‌ వేదికను ఏర్పాటుచేసి వందల మంది గాథలను చిన్న కథల రూపంలో తెలియజేస్తోంది. తన ప్రయాణాన్ని మనమూ తెలుసుకుందామా!

నుషుల హృదయాలను తట్టిలేపే శక్తి కథలకు ఉంటుందని నమ్మే ద్రిష్టి చాలామందిని వ్యక్తిగతంగా ఇంటర్వ్యూ చేసేది. వారి జీవితాల్లోని సన్నివేశాలను హృద్యంగా మలిచి చిన్న వీడియోల రూపంలో తన ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లో షేర్‌ చేసేది. ‘2008లో విష్ణుతో నాకు పెళ్లయింది. మాకు ఇద్దరు పిల్లలు. ఒకరికి తొమ్మిదేళ్లు, మరొకరికి ఐదేళ్లు. 2021లో కరోనాతో ఆయన చనిపోయారు. కళ్ల ముందే తన ఆరోగ్యం క్షీణిస్తుండటాన్ని చూశాను. నాన్న తిరిగివస్తాడని అనుకునే పసితనం నా పిల్లలది. అన్నం తినేటప్పుడు మొదటి ముద్ద నాన్నముద్దే కావాలి వాళ్లకు. అనేక భావోద్వేగాలు. జీవితంపై ఆశని కోల్పోయా. ఒకానొక దశలో చనిపోదామనుకున్నా కూడా. కానీ పిల్లల కోసం బతకాలనుకున్నా. ఎన్నో కష్టాలనుభవించి జీవితంలో నిలదొక్కుకున్న వారి జీవితాలను తెలుసుకున్నా. నేనెందుకు వాళ్లలా ఉండలేను అనుకున్నా. విష్ణుతో గడిపిన క్షణాలను గుర్తుచేసుకుంటూ బతుకుతున్నా. నాన్న లేరన్న విషయాన్ని పిల్లలు కూడా ఇప్పుడిప్పుడే అవగాహన చేసుకుంటున్నారు.

జీవితంలో ముందుకు సాగుతున్నాం.’ ఇదంతా పూర్వ అనే యువతి జీవిత ప్రయాణం... ‘నాకు పదకొండేళ్లప్పుడు బోన్‌ క్యాన్సర్‌ సోకింది. ఏడాదికంటే ఎక్కువ రోజులు బతకనని వైద్యులు అమ్మతో చెప్పారు. తరువాత ఆ క్యాన్సర్‌ నా తుంటి ఎముకకి సోకింది. నా కాలు వెంటనే తీసెయ్యాలని డాక్టర్లు చెప్పారు. అమ్మకు అది ఏమాత్రం ఇష్టం లేదు. బతికున్న కొంతకాలం నేను బాధ పడటం ఆమె చూడలేదు. నాకు ఆపరేషన్‌ చేయాలని వైద్యులు నిర్ణయించుకున్నారు. తర్వాత కర్రలతో నడవటం మొదలుపెట్టాను. నన్ను నేను అంగీకరించుకోటానికి చాలా సమయం పట్టింది. 5 సార్లు కీమోథెరపీ చేయించుకున్నా. దేవుని దయ వల్ల క్యాన్సర్‌ మహమ్మారి నుంచి బతికిబయటపడ్డా. తర్వాత పదహారేళ్లపాటు ఎటువంటి క్యాన్సర్‌ లక్షణాలు లేకుండా బతికా. తిరిగి 28 ఏళ్లప్పుడు నా రొమ్ముభాగంలో ఓ గడ్డను గుర్తించా. రొమ్ము క్యాన్సర్‌గా వైద్యులు తేల్చారు. స్కానింగ్‌ తర్వాత అది ఉదర భాగానికీ సోకిందని నిర్థారించారు వైద్యులు. మళ్లీ 8సార్లు కీమోథెరపీ  చేయించుకున్నా. వాసనను కోల్పోయా. నాకే ఎందుకు ఇదంతా అని భగవంతుణ్ని ఎప్పుడూ ప్రశ్నిస్తా. మా అమ్మ నాకు ధైర్యాన్నిచ్చేది. ఇప్పటికీ ట్రీట్‌మెంట్‌ తీసుకుంటూనే ఉన్నా. నాకు ప్రపంచాన్ని చుట్టి రావాలని కోరిక. నచ్చిన ప్రదేశాలన్నీ చూస్తుంటా. మా అమ్మని సంతోషంగా ఉంచాలనుకుంటా. ఇప్పుడు చిన్న వ్యాపారం చేస్తున్నా. జీవితంలో మిగిలున్న ఒక్క రోజుని కూడా నేను వృథా చేసుకోవాలనుకోవటం లేదు.’ అనేది మరో వీడియోలో యాస్మిన్‌ గ్లోరియా అనే అమ్మాయి జీవితం. ఇవి ‘పీపుల్‌ ఆఫ్‌ ఇండియా’ లో గుండెల్ని పిండేసే కొన్ని జీవిత కథలు మాత్రమే. నిజ జీవిత ప్రయాణాలనే వీడియోలుగా మలుస్తోన్న ద్రిష్టి, ఇప్పటికి 12 వందల మంది స్ఫూర్తిదాయక కథలను పోస్ట్‌ చేసింది. సుమారు 2 వేల మందిని ఇంటర్వ్యూ చేసింది. ద్రిష్టి మానస పుత్రికైన ‘పీపుల్‌ ఆఫ్‌ ఇండియా’కు ఇప్పటికే 7లక్షల ఫాలోయర్లు ఉన్నారు. నెలకు 22 మిలియన్ల వీక్షణలూ సొంతం చేసుకుని దేశంలోనే అత్యంత వేగంగా ప్రజాదరణ పొందుతోన్న ‘స్టోరీ టెల్లింగ్‌ ప్లాట్‌ఫామ్‌’ గా ఎదిగింది. భవిష్యత్తులో దీన్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేయాలనుకుంటున్నారీమె. ఇంజినీరింగ్‌ చదివిన ఈమె ప్రస్తుతం పీహెచ్‌డీ చేస్తోంది. ఆంత్రప్రెన్యూర్‌గా శ్రమిస్తోన్న ఆమె టెడ్‌ఎక్స్‌ స్పీకర్‌గానూ అనేక మంది ప్రశంసలు అందుకుంటున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్