ప్రధానే వచ్చి మెచ్చుకున్నారు!

హైపర్‌లూప్‌.. ప్రస్తుతానికి మనదేశంలో పెద్దగా వినిపించని పేరు. కానీ 2026 కల్లా మన రవాణా వ్యవస్థలో పెనుమార్పులని తీసుకొచ్చే సునామి. అమెరికాలాంటి అగ్రరాజ్యాలతో పోటీపడుతూ మనదేశంలోనూ హైపర్‌లూప్‌ నిర్మాణం కోసం పరిశోధనలు సాగుతున్న క్రమంలో... తెలుగమ్మాయి మేధా కొమ్మాజోస్యుల వాటిలో కీలకపాత్ర పోషిస్తోంది.

Updated : 25 May 2023 08:12 IST

హైపర్‌లూప్‌.. ప్రస్తుతానికి మనదేశంలో పెద్దగా వినిపించని పేరు. కానీ 2026 కల్లా మన రవాణా వ్యవస్థలో పెనుమార్పులని తీసుకొచ్చే సునామి. అమెరికాలాంటి అగ్రరాజ్యాలతో పోటీపడుతూ మనదేశంలోనూ హైపర్‌లూప్‌ నిర్మాణం కోసం పరిశోధనలు సాగుతున్న క్రమంలో... తెలుగమ్మాయి మేధా కొమ్మాజోస్యుల వాటిలో కీలకపాత్ర పోషిస్తోంది. ఈ అద్భుత సాంకేతిక ప్రయోగం గురించి వసుంధరతో ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకుందామె...

పొడవాటి ఖాళీ ట్యూబ్‌లో ఒక గోళీ వదిలారనుకోండి. అందులో గోళీ చాలా వేగంగా దొర్లుతుంది కదా! హైపర్‌లూప్‌ సాంకేతిక పరిజ్ఞానం కూడా అలాంటిదే. దీంట్లో కూడా టన్నెల్‌, పాడ్‌ ఉంటాయి. ఈ పాడ్‌లోనే మనం ప్రయాణిస్తాం. సుమారు గంటకు 1000- 1200కి.మీ వేగంతో. విమాన వేగంతో. తక్కువ ఖర్చులో అత్యంత వేగంగా దూసుకుపోవడమే ఈ రవాణా వ్యవస్థ ప్రత్యేకత. అయితే ఇది చెప్పినంత సులభం కాదు. అగ్రదేశాల్లోనే ఇంకా అందుబాటులోకి రాలేదు. అలాంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో నాయకత్వ హోదాలో ఉన్నందుకు తెలుగమ్మాయిగా గర్వపడుతున్నా.

తొలి అవకాశం అందుకున్నా...

మాది హైదరాబాద్‌. నాన్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. యూఎస్‌, ముంబయి, హైదరాబాద్‌ల్లో నా చదువు సాగింది. 2020లో ఐఐటీ మద్రాస్‌లో సీటు సాధించా. ఆటోమోటివ్‌ ఇంజినీరింగ్‌ మూడో ఏడాది చదువుతున్నా. కార్లు, ఇతర వాహనాల్లో ఆధునాతన సాంకేతికత తీసుకురావాలన్నది చిన్ననాటి కల. అందుకే హైపర్‌లూప్‌ ఆలోచన నన్ను ఎక్కువగా ఆకట్టుకుంది. ఇప్పటికే దీనికోసం ‘ఆవిష్కార్‌’ పేరుతో ఓ విద్యార్థి పరిశోధక బృందం పనిచేస్తోంది. నా పనితీరు, ఆలోచనలు నచ్చడంతో దానికి టీమ్‌ లీడర్‌ని చేశారు. మొత్తం ముగ్గురు లీడర్లుంటారు. కానీ ఒక అమ్మాయికి ఈ అవకాశం దక్కడం ఇదే తొలిసారి. ప్రయాణికులు కూర్చునే ‘పాడ్‌’ని రూపొందించడానికి ఒక లీడర్‌, వాక్యూమ్‌ ట్యూబ్‌తో పాటు ఇతర మౌలిక వసతుల కల్పనకు మరో లీడర్‌ ఉన్నారు. ఈ మొత్తం సాంకేతికతను ఎలా సౌకర్యవంతంగా తయారుచేయాలి, వాణిజ్యపరంగా ఎలా మలచాలి.. ఇందుకోసం ఇతర కంపెనీలు, ప్రభుత్వాలతో సంప్రదింపుల బాధ్యతలను నేను చూస్తున్నా.

అయ్యే పనికాదన్నారు..

మా బృందంలో 50 మంది ఉన్నాం. ఈ ప్రాజెక్టుని వాస్తవ రూపంలోకి తీసుకురావడానికి పగలూ, రాత్రి కష్టపడుతున్నాం. ఓ చిన్న పాడ్‌ను తయారుచేసి 30మీ ట్రాక్‌పై ట్రయల్స్‌ చేసి విజయం సాధించాం. దీన్ని మరింత వృద్ధి చేసేందుకు చాలా సంస్థల్ని సంప్రదించాం. మనదేశంలో దీన్ని తీసుకురావడం అసాధ్యం అన్నారు చాలామంది. మా సాంకేతికత పరిజ్ఞానంపై నమ్మకంతో కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాం. స్వదేశీ హైపర్‌లూప్‌లో దమ్ముందని నిరూపించేందుకు మాకు ఆర్నెల్లు పట్టింది. కేంద్ర రైల్వేమంత్రి అశ్వనీ వైష్ణవ్‌ మా క్యాంపస్‌కు వచ్చి ఈ ప్రాజెక్టు కోసం రూ.8.34 కోట్లు ప్రకటించారు. భారతీయ రైల్వే, భారత్‌ బెంజ్‌, ఎల్‌అండ్‌టీ, టీఐఐ లాంటి దిగ్గజ కంపెనీలతో కలిసి పనిచేస్తున్నాం. ఇదో గొప్ప విజయం మాకు. ఐదో ప్రొటోటైప్‌ పాడ్‌ను తయారుచేశాం. దీన్ని 400మీ పొడవైన వాక్యూమ్‌ట్యూబ్‌లో ప్రయోగించబోతున్నాం. ఇందులోనూ విజయం సాధిస్తే ఇక నిజమైన ప్రాజెక్టు ట్రయల్స్‌కు వెళ్లడమే.

నగరాల్ని కలిపేలా...

లూప్‌ సామర్థ్యాన్ని పెంచేందుకు ఎలక్ట్రో మాగ్నటిక్‌ సాంకేతికత, బ్రేకింగ్‌ మెకానిజం, వాక్యూమ్‌ ట్యూబ్‌ అంతా మా బృందం సొంతంగా చేసుకున్నవే. మా సత్తాను నిరూపించుకునేందుకు అంతర్జాతీయ పోటీల్లోనూ పాల్గొన్నాం. 2021లో యూరోపియన్‌ హైపర్‌లూప్‌ వీక్‌లో మోస్ట్‌ స్కేలబుల్‌ డిజైన్‌ అవార్డు దక్కింది మాకు. 2022 నెదర్లాండ్స్‌లో జరిగిన పోటీల్లో గ్లోబల్‌ టాప్‌- 5లో స్థానం సాధించాం. ఈ పోటీలతో ప్రపంచస్థాయి కంపెనీలు, వారి ఆలోచనలు తెలుసుకోగలిగాం. త్వరలో చెన్నై, బెంగళూరు మధ్య అరగంట ప్రయాణం సాధ్యం చేయాలనే లక్ష్యంతో ఉన్నాం. ఇలా దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్ని కలిపేలా హైపర్‌లూప్‌ తేవాలనేది ప్రభుత్వ ఆలోచన. మా కృషిని చూసి ప్రధాని మోదీ చెన్నై వచ్చి మమ్మల్ని మెచ్చుకున్నారు. మీమీద దేశం ఎన్నో ఆశలు పెట్టుకుందని అన్నారు. ఆడపిల్లగా టీమ్‌ను లీడ్‌ చేస్తున్నందుకు నన్నెంతో గౌరవించారాయన. ఆ క్షణాలు మర్చిపోలేను. నాతో పాటు మరో 7గురు అమ్మాయిలున్నారు బృందంలో. ఈ తరహా పరిశోధనల్లో అమ్మాయిలకు మంచి అవకాశాలున్నాయి. ఎంత కష్టపడితే అన్ని అవకాశాలు.

- హిదాయతుల్లాహ్‌.బి, ఈనాడు, చెన్నై

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్