Doctor sowmya maddipati: ఆ నొప్పిపైనే నా పరిశోధనలు
అర్ధశతాబ్దంపైగా చరిత్ర ఉన్న ప్రతిష్ఠాత్మక సంస్థ అది! 110 దేశాల ప్రముఖ వైద్య నిపుణులు అందులో సభ్యులు. గైనిక్‌పరంగా కొత్త చికిత్సలు, సాంకేతికత వంటివాటిపై ఏటా నిర్వహించే కాన్ఫరెన్స్‌లో చర్చలు జరుగుతాయి.
అర్ధశతాబ్దంపైగా చరిత్ర ఉన్న ప్రతిష్ఠాత్మక సంస్థ అది! 110 దేశాల ప్రముఖ వైద్య నిపుణులు అందులో సభ్యులు. గైనిక్‌పరంగా కొత్త చికిత్సలు, సాంకేతికత వంటివాటిపై ఏటా నిర్వహించే కాన్ఫరెన్స్‌లో చర్చలు జరుగుతాయి. అలాంటిచోట తన పరిశోధనలను వివరించి మన్ననలు పొందారు డాక్టర్ సౌమ్య మద్దిపాటి! ఆ అవకాశం అందుకున్న పిన్న వయస్కురాలామె. ఆవిడను వసుంధర పలకరించింది.
నేర్చుకోవడం నిరంతర ప్రక్రియని నమ్ముతాన్నేను. అందుకే ఎక్కడ వర్క్‌షాప్‌లు, కాన్ఫరెన్స్‌లు జరిగినా హాజరవుతుంటా. మాది రాజమండ్రి. హైదరాబాద్‌లో స్థిరపడ్డాం. నాన్న విఠల్ వ్యాపారి. అమ్మ వరలక్ష్మి. విద్యాభ్యాసమంతా విజయవాడలోనే! ఎంబీబీఎస్, పీజీ.. బెంగళూరులో చేశా. చిన్నప్పట్నుంచీ నాకు డాక్టర్ అవ్వాలని కల. అమ్మానాన్నలదీ అదే కోరిక. దీంతో మొదట్నుంచీ నా లక్ష్యంపై స్పష్టతతో ఉన్నా. పీజీలో అబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ చదివా. ప్రస్తుతం హైదరాబాద్‌లోని అపోలో క్రెడిల్‌లో పని చేస్తున్నా.
యవ్వనంలోకి అడుగు పెట్టినప్పట్నుంచీ అమ్మాయిలో ఎన్నో మార్పులు. అమ్మగా మారే క్రమంలో ఇంకెన్నో సమస్యలను దాటాలి. ఆ ప్రక్రియను తేలిక చేయాలన్న ఉద్దేశంతో ప్రారంభమైందే అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ గైనకాలజిక్ లాప్రోస్కోపిస్ట్స్ (ఏఏజీఎల్). ప్రపంచ వ్యాప్తంగా 110 దేశాల గైనిక్ వైద్యనిపుణులు ఇందులో సభ్యులు. ఈ రంగంలోని నూతన పద్ధతులు, చికిత్సలు, సాంకేతికత మొదలైనవాటిపై ఏటా కాన్ఫరెన్సులు నిర్వహిస్తుంటారు. గైనకాలజిస్ట్‌గా వాటి గురించి తెలుసుకోవచ్చని నేనూ దీనిలో చేరా. నాకు డా.విమీ బింద్రా, డా.రూమా సిన్హా అని ఇద్దరు మెంటర్లు. వృత్తిపరంగా నడిపించడమే కాదు.. సందేహాలొచ్చినా తీరుస్తుంటారు. ఏఏజీఎల్‌లో చేరికా వీళ్ల సలహానే. ఈసారి ఏఏజీఎల్ స్కాట్లాండ్‌లో ‘వరల్డ్ ఎండోమెట్రియోసిస్ కాంగ్రెస్’ పేరుతో కాన్ఫరెన్స్ నిర్వహించింది. సభ్యుల్లో కొత్త పరిశోధనలు చేసిన వారెవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. పలు దశల వడపోతలుంటాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు వంద ఎంపికైతే అందులో నాదొకటి. అంగవైకల్యం తెలుసు కదా.. అలానే గర్భాశయమూ కొందరిలో సరిగా ఏర్పడదు. దానిపైనా, మహిళల్లో ఎక్కువగా కనిపిస్తున్న ఎండోమెట్రియోసిస్‌పైనా ఈ 4 రోజుల కార్యక్రమంలో ప్రెజెంటేషన్ ఇచ్చా. ఆ ఘనత దక్కించుకున్న పిన్న వయస్కురాలినని తెలిశాక చాలా సంతోషమేసింది. ఇటలీలోని రోమ్‌లో జరిగిన యూనివర్సల్ గైనకాలాజికల్ కాన్ఫరెన్స్‌లోనూ ప్రసంగించే అవకాశమూ దక్కింది. దేశదేశాల నిపుణులను కలిసి.. వారి చికిత్సా పద్ధతులు, సర్జరీ విధానాలు, ఏఐ వినియోగం వంటివెన్నో నేర్చుకున్నా.
తొలిసర్జరీని మర్చిపోలేను. ఒక తల్లికి ఆరోగ్యవంతమైన బిడ్డను అందివ్వడం గొప్ప అనుభూతి. దాన్ని మరింత సులువు చేయాలనే రోబోటిక్ సర్జరీ సర్టిఫికేషన్లు చేయాలనుకుంటున్నా. గొప్ప గైనిక్ సర్జన్ అవ్వాలన్నది నా లక్ష్యం. పరిశోధనా వ్యాసాలు రాస్తుంటా. ఈ మధ్యే నాకు పెళ్లైంది. మా వారు కృష్ణకాంత్.. వ్యాపారి. అర్ధరాత్రి, అపరాత్రీ ఆసుపత్రికి వెళ్లాల్సిన పరిస్థితి. మావారు, అత్తమామలు అర్థం చేసుకొని, అండగా నిలుస్తున్నారు. తోడు నిలిచే కుటుంబం, కొంత ప్లానింగ్‌తో ఇల్లు, కెరియర్ సమన్వయం చేసుకుంటున్నా. రంగమేదైనా కొత్త పోకడలు తెలుసుకొని, నేర్చుకుంటూ సాగితే ఉన్నతంగా సాగొచ్చనేది నా అభిప్రాయం.
కాస్త.. జాగ్రత్త!
నెలసరి నొప్పి కొందరిలో సాధారణంగా, మరి కొందరిలో భరించలేనంతగా ఉంటుంది. తట్టుకోలేక మందులూ వాడుతుంటారు. ఏదేమైనా ఇది సాధారణమే అన్న భావన. కానీ అది ఎండోమెట్రియోసిస్ అవొచ్చు. పీరియడ్ సమయంలో కొంత లోపలే మిగిలి పోవడం.. సర్జరీ జరిగిన ప్రాంతంలో దానంతటదే చర్మం మందంగా పెరిగిపోవడం.. ఇలా కొన్ని కారణాల వల్ల గర్భసంచిలోని పొర కొందరికి బయట పెరుగుతుంది. దీనివల్ల నెలసరి సమస్యలు, పిల్లలు కలగకపోవడం లాంటి అనేక ఇబ్బందులు. 14-50 ఏళ్ల ఆడవాళ్లెవరిలోనైనా ఇది కనిపించొచ్చు. కొన్నేళ్లుగా ఈ కేసులు పెరుగుతున్నాయి. దీనికి కచ్చితమైన కారణాలూ చెప్పలేం. ప్రపంచవ్యాప్తంగా దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి. సమస్య తీవ్రమైనా కొందరిలో లక్షణాలూ ఉండట్లేదు. అందుకే ఏడాదికోసారి మహిళలు కచ్చితంగా పరీక్షలు చేయించుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.