ఆ అవగాహనతో అంతర్జాతీయ గుర్తింపు!

అంతరిక్షంలోకీ రాకపోకలు సాగిస్తున్నాం. ఆ రహస్యాలను అన్వేషిస్తున్నాం. కానీ అమ్మాయి జీవితంలో అత్యంత సహజమైన నెలసరిని మాత్రం ఇంకా తప్పుగానే భావిస్తున్నాం. దీని కారణంగా నష్టపోతున్న ఆడవాళ్లెందరో. ఆ పరిస్థితినే మార్చాలనుకుంది డియాన్‌ డీ మెనెజెస్‌.

Updated : 03 Jun 2023 04:50 IST

అంతరిక్షంలోకీ రాకపోకలు సాగిస్తున్నాం. ఆ రహస్యాలను అన్వేషిస్తున్నాం. కానీ అమ్మాయి జీవితంలో అత్యంత సహజమైన నెలసరిని మాత్రం ఇంకా తప్పుగానే భావిస్తున్నాం. దీని కారణంగా నష్టపోతున్న ఆడవాళ్లెందరో. ఆ పరిస్థితినే మార్చాలనుకుంది డియాన్‌ డీ మెనెజెస్‌. ఆమె ప్రయత్నం అంతర్జాతీయ గుర్తింపు తేవడమే కాదు.. లక్షల మందిలో మార్పు రావడానికీ కారణమైంది.

ఫీసులో బిజీగా గడిపేస్తోంది డియాన్‌. ఇంతలో పీరియడ్‌. సమయానికి ప్యాడ్‌ లేదు. సహోద్యోగులను అడుగుదామంటే ఇబ్బందిగా తోచింది. దీంతో దగ్గర్లోని షాపులో తెచ్చుకుంది. అప్పుడే ‘ఇంత సహజమైన విషయాన్ని చదువుకున్న నేనే ఇంత ఇబ్బందిగా భావిస్తే మిగతావారి సంగతేంట’ని ఆలోచించింది. గూగుల్‌లో వెదికితే నెలసరి ప్రారంభంకాగానే చదువుకు దూరమవుతోన్న వారు లక్షల్లోనే ఉన్నారని తెలిసి ఆశ్చర్యపోయింది. దానికి ఆమె తెచ్చిన పరిష్కారమే ‘రెడ్‌ ఈజ్‌ ద న్యూ గ్రీన్‌’.

ఈమెది ముంబయి. బీఎస్‌సీ పూర్తిచేసి, రిసెర్చ్‌ అనలిస్ట్‌గా కోరుకున్న సంస్థలో ఉద్యోగంలో చేరింది. 2016లో తన ఎన్‌జీఓని స్థాపించడానికి ముందు నెలసరి చుట్టూ ఉన్న సమస్యల్ని పరిశోధించింది. అసురక్షిత విధానాలు అనుసరించడం, ప్యాడ్‌లు కొనే స్థోమత లేకపోవడం, అశుభ్రత కారణంగా వచ్చే అనారోగ్యాలు.. వంటివన్నీ ఆమె దృష్టికి వచ్చాయి. అప్పుడు ఆమె మనసులో ‘అవగాహన, అందుబాటులోకి తేవడం’ అనే రెండు అంశాలు మెదిలాయి. దీంతో ముందు మురికివాడల వాళ్లకి మెన్‌స్ట్రువల్‌ ఉత్పత్తులు అందించడం మొదలుపెట్టింది. తర్వాత ముంబయి పాఠశాలలు, స్కూళ్లలో అవగాహన కార్యక్రమాలు మొదలుపెట్టింది.

‘కార్పొరేట్‌ సంస్థలు సాధారణంగా సాయం చేస్తాయి. కానీ దీనికి ఏవీ ముందుకు రాలేదు. విద్యా సంస్థలూ దీనిపై మాట్లాడటానికి ఏముందనే వారు. అయినా నేను పట్టు వదల్లేదు. స్కూళ్లలో శానిటరీ ప్యాడ్‌ వెండింగ్‌ మెషిన్‌లు, ఇన్సినరేటర్లు ఏర్పాటు చేసి.. వాటి ఉపయోగంతోపాటు అవగాహననీ జోడిస్తూ వచ్చా’అనే డియాన్‌ ఇతర ఎన్‌జీఓలు, యూనిసెఫ్‌తో కలిసి పనిచేసింది. ఉద్యోగాన్ని వదిలి స్నేహితులు, వలంటీర్లతో దీన్నే పూర్తి స్థాయిలో కొనసాగించింది. రాష్ట్ర ప్రభుత్వాలతోనూ కలిసి పనిచేసింది. ఈమె సేవలకు గుర్తింపుగా ఇంగ్లాండ్‌ రాణి నుంచి 2018లో ‘యంగ్‌ లీడర్‌’ పురస్కారం,  2019లో ఫోర్బ్స్‌ జాబితాల్లో నిలిచింది. కొవిడ్‌ సమయంలోనూ తన సేవలను ఆపలేదు. ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌పై పీజీ చేస్తున్న డియాన్‌ టెడెక్స్‌ స్పీకర్‌ కూడా. ఆఫ్రికా వంటి పేదదేశాలతోపాటు ప్రపంచ వ్యాప్తంగా నెలసరి ఆరోగ్యంపై చేపడుతున్న కార్యక్రమాలపై పరిశోధనా చేస్తోంది. ‘మా సంస్థను మెన్‌స్ట్రువల్‌ హబ్‌గా తీర్చిదిద్దనున్నా. నెలసరి అపోహలు తొలగి, మాలాంటి ఎన్‌జీఓల అవసరమూ రాని పరిస్థితి ఏర్పడాలన్నది నా కోరికంటోంది డియాన్‌. ఇప్పటివరకూ లక్షమందికి పైగా జీవితాల్లో మార్పునకు కారణమైన ఈమె ప్రయాణం స్ఫూర్తిమంతమేగా మరి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్