పిచ్చిగీతలూ కళాఖండాలే అన్నారు!
ముంబయిలోని గ్రాఫిక్ స్టుడియోల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా ఒక్కరూ అవకాశం ఇవ్వలేదు. ఇది మగవాళ్ల రంగమన్నారు. నీ వయసు సరిపోదన్నారు! ఇరవైఏళ్ల క్రితం మాట ఇది.
ముంబయిలోని గ్రాఫిక్ స్టుడియోల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా ఒక్కరూ అవకాశం ఇవ్వలేదు. ఇది మగవాళ్ల రంగమన్నారు. నీ వయసు సరిపోదన్నారు! ఇరవైఏళ్ల క్రితం మాట ఇది. కట్ చేస్తే.. ఆమె చేసిన సినిమాలు ఆస్కార్‌కూ నామినేట్ అయ్యాయి.. ఇప్పడామె అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన యానిమేటర్. చారువీ అగర్వాల్.. ఆమె విజయ కథనం ఇది..
గ్రాఫిక్ పనితనం లేకుండా ఒక భారీ బడ్జెట్ సినిమాని ఊహించగలమా? అద్భుతమైన ప్రపంచాన్ని మన కళ్లముందు ఆవిష్కరించే ఈ కళకు మూలం సృజనాత్మకత. చారువికి ఈ నైపుణ్యం చిన్నతనంలోనే అబ్బింది. తండ్రి సివిల్ ఏవియేషన్ ఉద్యోగి. ఆయన ప్రోత్సాహంతోనే చిత్రకళపై పట్టుసాధించింది. ‘చిన్నప్పుడు గోడలమీద పిచ్చి గీతలుగీస్తూ ఉంటే నాన్న ముచ్చటపడేవారు. అవి కూడా కళాఖండాలే అన్నట్టు పొగిడేవారు. అమ్మా నాన్నలిద్దరూ కలిసి బొమ్మలు వేసేవారు. దాంతో నాక్కూడా ఆ కళపై ఇష్టం పెరిగింది. నాన్న ఉద్యోగరీత్యా చండీగఢ్, కశ్మీర్, గువాహటి వంటి ప్రాంతాలు తిరిగినప్పుడు అక్కడ సంస్కృతి, కళలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. నాన్నకి నేను ఆర్కిటెక్ట్ అవ్వాలని కోరిక. అయినా నేను దిల్లీ విశ్వవిద్యాలయంలో ఫైన్‌ఆర్ట్స్ డిగ్రీలో చేస్తానంటే కాదనలేదు. తర్వాత కంప్యూటర్ యానిమేషన్‌లో మాస్టర్స్‌కి కెనడా వెళ్లా. షెరిడన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ అడ్వాన్స్‌డ్ లెర్నింగ్‌లో కోర్సు పూర్తిచేశా. అవకాశాల కోసం ముంబయి వస్తే.. ఎక్కడకి వెళ్లినా నిరాశే. ఇది మగవాళ్ల రంగం కావడం, నాది చిన్న వయసు కావడంతో అవకాశాలు ఇవ్వలేదు. చివరికి అవకాశం దక్కినా రాత్రుళ్లు పని చేయాల్సివచ్చేది. సమావేశాల్లో అయితే అంతమంది మగవాళ్లలో నన్ను వింతగా చూసేవారు. ఇబ్బందిగా ఉండేది’ అనే చారువీ ప్రస్తుతం అంతర్జాతీయ యానిమేటర్‌గా తన ప్రత్యేకత చాటుకుంటున్నారు.
సొంత స్టుడియోతో..
చిత్రకళలో వివిధ మాధ్యమాలని లోతుగా అర్థంచేసుకున్న అనుభవంతో సొంతంగా యానిమేషన్ స్టుడియోనే పెట్టారు చారువీ. ‘సమస్యను చూసి భయపడకుండా.. వాటిని స్వీకరించడం నేర్చుకున్నా. విమర్శలు పట్టించుకోవడం మానేశా. ఎవరో ఇచ్చే అవకాశాల కోసం ఎదురుచూడకుండా 2009లో గుడ్‌గావ్‌లో యానిమేషన్ అండ్ డిజైన్ స్టూడియో ‘చారువీ డిజైన్ ల్యాబ్స్’ ప్రారంభించా. మొదట చిన్నచిన్న ప్రాజెక్టులే వచ్చాయి. రెండు మూడేళ్లకి మావర్క్ నచ్చడంతో పెద్ద ప్రాజెక్టులు వచ్చాయి. మా ప్రాజెక్టుల్లో హనుమాన్ చాలీసా ప్రతిష్ఠాత్మకమైంది.
ఏడు భాషల్లో యానిమేటెడ్ సిరీస్‌ను రూపొందించాం. చాలీసాకి దృశ్యరూపం ఇవ్వడం అంత తేలికకాదు. ఇంతవరకూ ఎవరూ చేయలేదు కూడా. దాన్నే సవాల్‌గా తీసుకుని చేశా. ఈ సిరీస్ ఆస్కార్‌కు నామినేట్ అయింది. ఎడిన్‌బర్గ్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లోనూ ప్రదర్శించారు. అత్యధికంగా 23 లక్షలమంది వీక్షించిన తొలి సిరీస్‌గానూ పేరుతెచ్చుకుంది. ఈ విజయానికి గుర్తుగా దిల్లీసిటీ వాక్‌లో హనుమాన్ ఎగ్జిబిషన్ పెట్టా. 26,500ల లోహపు గంటలు అమర్చి 25 అడుగుల ఎత్తు హనుమాన్ శిల్పాన్ని చేశా. మరో మంచి ప్రాజెక్ట్ గౌతమబుద్ధుని జీవితంపై 230 నిమిషాల యానిమేటెడ్ సినిమా. 3డీ, మోషన్ గ్రాఫిక్స్, రియల్ ఫొటోగ్రఫీ, డ్రోన్ షాట్స్ వంటివెన్నో ఇందులో కనిపిస్తాయి. అలా అంతర్జాతీయస్థాయి సినిమాలకూ డిజిటల్ ఆర్ట్‌వర్క్స్, 3డీ, 2డీ యానిమేషన్ వంటి సదుపాయాలు అందిస్తున్నా. టీవీ కమర్షియల్స్, గేమ్ డిజైన్స్‌నీ రూపొందిస్తున్నా’ అనే చారువీ ప్రతిభకి మెచ్చి న్యూయార్క్‌లో ‘ఇన్‌క్రెడిబుల్ ఇండియా ఎట్ 60’ ఫెస్టివల్‌లో ప్రపంచం గర్వించదగ్గ యానిమేటర్‌గా గుర్తించి సత్కరించారు. అద్భుతమైన చిత్రకళతో లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో రెండుసార్లు చోటు దక్కించుకున్నారు. ‘ఎవరేమన్నా ఆగిపోవద్దు. మీరుచేయాలనుకున్నది చేయండి. చేస్తూనే ఉండండి. గుర్తింపు అదే వస్తుంది’ అంటారు చారువీ.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.