చావుకి కాదు.. చదువాగుతుందని భయపడింది!

దేశం కాని దేశానికి ప్రయాణం.. అక్కడి భాష రాదు.. కడుపు నిండా తిండి దొరుకుతుందా అన్నదీ అనుమానమే! అయినా అమ్మానాన్నలతో కలిసి దేశం దాటిందామె.

Updated : 13 Jul 2023 07:56 IST

దేశం కాని దేశానికి ప్రయాణం.. అక్కడి భాష రాదు.. కడుపు నిండా తిండి దొరుకుతుందా అన్నదీ అనుమానమే! అయినా అమ్మానాన్నలతో కలిసి దేశం దాటిందామె. ఒకపూట భోజనం దొరక్కపోయినా తట్టుకోవచ్చు. ప్రతి క్షణం నిఘా, ఆంక్షల మధ్య బతికే బతుకు కన్నా అస్పష్టమైన భవిష్యత్తే నయమనుకుంది. అఫ్గనిస్థాన్‌ నుంచి భారత్‌కి వలసొచ్చి.. ఎంతోమంది శరణార్థులకు మార్గదర్శిగా నిలుస్తోంది.. ముర్సల్‌ మొహమ్మదీ. ఆమె కథ ఇది!

‘యుద్ధంలో తగిలిన గాయాలు కొన్నేళ్లకు మానిపోతాయి. కానీ అది నింపే భయం.. లైంగిక, శారీరక దాడులు ఆడవాళ్లపై చూపే ప్రభావం.. ఊపిరి ఉన్నంత వరకూ వాళ్లని వదలదు. మానవ హక్కులు అన్నపదాలూ వారికి వర్తించవు. సంపద పోతే తిరిగి సృష్టించుకోవచ్చు. కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందాలంటే దశాబ్దాలు చాలవు. అందుకే భయంతో కాదు.. తన పిల్లలు ధైర్యంగా బతకాలనుకునేది అమ్మ. తనకి చదువుకోవాలన్న కోరిక తీరలేదు. అందుకే పోరాడి మరీ మమ్మల్ని బడికి పంపేది. నాకు నాలుగేళ్లు వచ్చేసరికి అఫ్గానిస్థాన్‌లో అమ్మాయిలకీ చదువుకునే హక్కు వచ్చింది. అలా అక్కా, నేను బడికెళ్లగలిగాం’ అని గుర్తుచేసుకుంటుంది ముర్సల్‌.

అలా దాటాం..

2021లో అఫ్గాన్‌ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. కానీ అంతకు ముందే ఆ ఛాయలు కనిపించడం ప్రారంభమైందక్కడ. ‘నేను చదువుకుంటున్నా. ఇంతలో పెద్ద శబ్దం. ఎక్కడో బాంబు దాడి. తీరా అది అక్కా, అన్న ఇంటర్న్‌షిప్‌కి వెళ్లిన ప్రదేశమని తెలిశాక అమ్మ కుప్పకూలిపోయింది. నేనేమో టీనేజర్‌ని.. ఏం చేయాలో తెలియలేదు. నాన్న వచ్చాక అందరం అక్కడికి పరుగెత్తుకెళ్లాం. తీవ్రగాయాలతో ఇద్దరూ ఆసుపత్రిలో ఉన్నారు. యుద్ధం బయటకు కనిపిస్తోంది కానీ.. నిరంతరం బెదిరింపులు. నిత్యం నాన్నో, అన్నయ్యో తోడున్నారు కాబట్టే బయట కాలుపెట్టగలిగాం. చదువు కొనసాగించాలన్న పట్టుదలతో చావు అంచుల వరకూ ఎన్నిసార్లు వెళ్లుంటామో. పరిస్థితి దిగజారుతోంటే అక్కడిక ఉండకూడదని నాన్న నిశ్చయించా’రంటుంది ముర్సల్‌.

అప్పుడూ అదే బెంగ!

2017లో శరణార్థులుగా వీళ్ల కుటుంబం భారత్‌లో అడుగుపెట్టింది. ఇక్కడ కుదురుకోవడానికీ ఎన్నో కష్టాలు పడ్డారు. ‘చివరికో శరణార్థ శిబిరానికి చేరింది. భాష రాదు. ఇక చదువెలా అన్న బెంగే నాకు. చనిపోతానేమోనని కాదు.. చదువెక్కడ ఆపాల్సి వస్తుందోనన్న భయంతో దేశం దాటా మరి. కొన్ని రోజులకు వివిధ భాషలను నేర్పించడం మొదలుపెట్టారు. ఆనందంగా నేర్చుకున్నా. అప్పుడే విశ్వవిద్యాలయంలో చేరిన నాలాంటి శరణార్థితో పరిచయం ఏర్పడింది. తన సాయంతో దిల్లీ యూనివర్సిటీలో చేరా’నని ఆనందంగా చెప్పే ముర్సల్‌కి అదీ అంత తేలిగ్గా జరగలేదు. ఎన్నో తిరస్కరణలొచ్చాయి. అయినా పట్టుదలతో శరణార్థి శిబిరంలో యూత్‌ క్లబ్‌కి లీడర్‌ అయ్యింది. వాళ్ల తరఫున విద్య కోసం పోరాడింది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంది. చివరికి విశ్వ విద్యాలయంలో ప్రవేశం పొందింది. విజువల్‌ కమ్యూనికేషన్స్‌లో పట్టా పొందిన తనకి ఫొటోగ్రఫీపై మక్కువెక్కువ. విజువల్‌ స్టోరీ టెల్లింగ్‌లో శిక్షణ పొంది తన ఆలోచనలను ఫొటోల రూపంలో పంచుకుంటుంది. అఫ్గాన్‌లో అమ్మాయిల జీవితాలపై తను చేసిన ఫొటో ప్రాజెక్టును ‘హోమ్‌ అండ్‌ బిలాంగింగ్‌’ పేరుతో యూఎన్‌హెచ్‌సీఆర్‌ ఈ ఏడాది పుస్తకంగా తీసుకొచ్చింది. గ్లోబల్‌ పీస్‌ ఫొటో అవార్డునూ గెలుచుకుంది. పలు ఫొటోగ్రఫీ పోటీల్లో పాల్గొని స్కాలర్‌షిప్‌లు, బహుమతులనీ అందుకుంది. ఐరాస యువ అడ్వకేట్‌గా మారింది. అలా భారత్‌ నుంచి ఎంపిక చేసిన ఆరుగురిలో ముర్సల్‌ ఒకరు. తన విజువల్‌ స్టోరీలతో విద్య, లింగ సమానత్వంపై అవగాహన కల్పించడమే లక్ష్యమనే పాతికేళ్ల ముర్సల్‌.. తన కథ కొందరిలోనైనా స్ఫూర్తి నింపితే చాలంటుంది. ఇంకా.. అఫ్గాన్‌ సహా ఎందరు శరణార్థుల తరఫున పోరాడినా భారత్‌ అనగానే ‘మాతృదేశ’మనే గుర్తొస్తుందంటోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్