115 కేజీల బరువే... అంతర్జాతీయ క్రీడాకారిణిని చేసింది!
పెళ్లై పిల్లలు పుట్టాక.. అధిక బరువు, వెన్నునొప్పి వంటివి వేధిస్తుంటే సహజమేలెమ్మని సరిపెట్టుకుంటాం. ఆరోగ్య సమస్యలు ఇంకా ఎక్కువైతే కెరియర్ వదులుకునేందుకూ సిద్ధమవుతాం. మండవ రాధిక కూడా 115 కేజీల బరువుతో అలాగే సతమతమయ్యారు. కానీ ఫిట్‌నెస్‌తో రాజీపడలేదు.
పెళ్లై పిల్లలు పుట్టాక.. అధిక బరువు, వెన్నునొప్పి వంటివి వేధిస్తుంటే సహజమేలెమ్మని సరిపెట్టుకుంటాం. ఆరోగ్య సమస్యలు ఇంకా ఎక్కువైతే కెరియర్ వదులుకునేందుకూ సిద్ధమవుతాం. మండవ రాధిక కూడా 115 కేజీల బరువుతో అలాగే సతమతమయ్యారు. కానీ ఫిట్‌నెస్‌తో రాజీపడలేదు. ఈత నేర్చుకుని అంతర్జాతీయ స్థాయిలో రాణించి.. కోచ్‌గా 8000 మంది విద్యార్థులని తీర్చిదిద్దారు. మహిళల్లో స్ఫూర్తినింపే తన కథని మనతో పంచుకున్నారు..
మాది పశ్చిమ గోదావరి జిల్లాలోని పశివేదల. అమ్మ బేబీ, నాన్న జయరామ్. చిన్నతనం నుంచీ ఆటలంటే ఆసక్తి నాకు. తొమ్మిదో తరగతి చదివే రోజుల్లోనే షాట్‌పుట్‌లో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యా. కానీ పొట్టి గౌనులు వేసుకోవడం, పొరుగు ఊళ్లకి ఒంటరిగా పంపించడం నచ్చక ఇంట్లో ‘ఆడపిల్లలకు ఇవన్నీ ఎందుకు?’ అంటూ ఆపేశారు. తర్వాత ఆటలపై ప్రేమున్నా వదులుకున్నా. రాజమండ్రిలోని కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా కళాశాలలో ఇంటర్ చదివా. డిగ్రీ మొదటి ఏడాదిలోనే గుంటూరుకు చెందిన శ్రీనివాస్‌తో వివాహమైంది. ఆయన వ్యాపారి. మాకో పాప శ్రీతనయ. 2004లో పాప చదువుకోసమని విజయవాడ వచ్చాం. ఆ తర్వాత అనారోగ్యంతో 115 కేజీల వరకూ బరువు పెరిగా. దాంతో మోకాళ్ల నొప్పులు, వెన్నునొప్పితో బాగా ఇబ్బంది పడేదాన్ని. అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసే మా ఆడపడుచు ఉమ ఉద్యోగరీత్యా బెంగళూరు వచ్చింది. నా అవస్థ చూసి తనే నన్ను వైద్యుల దగ్గరకు తీసుకెళ్లింది. డాక్టర్ సూచనల మేరకు బెంగళూరులోనే వేసవి శిక్షణ శిబిరంలో ఈత మొదలుపెట్టా. కోచ్ విజయలక్ష్మి ప్రోత్సాహంతో విజయవాడ వచ్చాక కూడా ఆ సాధన కొనసాగించా. నెమ్మదిగా మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభించింది. అలాగని ఈతని వదలేయకుండా నైపుణ్యాలు నేర్చుకుంటూ పోటీల్లోనూ పాల్గొన్నా.
రాష్ట్రస్థాయిలో రాణించి..
కోచ్‌తోపాటు అత్తింటి సహకారం కూడా దొరకడంతో తొలిసారిగా సికింద్రాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ ఈత కొలనులో రాష్ట్ర స్థాయి మాస్టర్స్ ఈత పోటీల్లో పాల్గొన్నా. రెండు పసిడి, రజత పతకాలు గెలుచుకున్నా. ఈ గెలుపు నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. అదే ఏడాది ముంబయిలో జరిగిన జాతీయ మాస్టర్స్ స్విమ్మింగ్ పోటీల్లోనూ రాష్ట్ర జట్టుకు ప్రాతినిథ్యం వహించా. ఆ తర్వాత కొద్దిగా విరామం తీసుకున్నా. 2011లో బెంగళూరులో జాతీయ స్థాయిలో పాల్గొన్నా. 100మీ.ల బ్యాక్ స్ట్రోక్‌లో రజతం, 200మీ.ల మెడ్లీ రిలేలో కాంస్య పతకాలు సొంతం చేసుకున్నా. ఆ తర్వాత వెనుతిరిగి చూడలేదు. 2017లో గోవాలో జరిగిన సముద్ర ఈత పోటీల్లోనూ పాల్గొన్నా. 2018, 2019లో నిర్వహించిన కృష్ణా రివర్ క్రాసింగ్ పోటీల్లోనూ 40-44 వయసు కేటగిరీలో తలపడి పతకాలు గెలుచుకున్నా. ఆ ఆత్మవిశ్వాసం అంతర్జాతీయ పోటీలకు వెళ్లేలా చేసింది. కజికిస్థాన్‌లోని ఆల్మాటిలో జరిగిన ‘ఇండో-కజక్ ఇంటర్నేషనల్ మీట్’లో తలపడి నాలుగు పసిడి పతకాలు గెలిచా. ఆ తర్వాత దుబాయ్‌లో.. ‘ఇండో-దుబయ్ ఇంటర్నేషనల్ మీట్’లో మూడు పసిడి పతకాలు కైవసం చేసుకున్నా. ఇప్పటివరకూ జాతీయ స్థాయిలో.. 21 పతకాలు, అంతర్జాతీయ స్థాయిలో తొమ్మిది పతకాలు నా ఖాతాలో వేసుకున్నా. నేను పోటీలకు వెళ్లినప్పుడు పాపను అత్తయ్య రమాదేవి చూసుకునేవారు. వాళ్ల సహకారంతోనే ఇవన్నీ సాధించా.
వేలమంది పిల్లలకి..
నేను నేర్చుకుంటూనే చిన్నారులకు, మహిళలకు ఈతలో శిక్షణనిస్తున్నా. ఇప్పటి వరకూ ఎనిమిది వేలమందికి ఇచ్చా. మహిళలకు స్విమ్మింగ్ నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే చాలు. వయసుతో సంబంధం లేదు. వెన్ను, మెడ, మోకాలి నొప్పులకు ఇది చక్కని పరిస్కారం.
-తాతినేని పూర్ణిమాశ్రీనివాసరావు, విజయవాడ
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.