ఇంటికే ప్రకటనలు తెచ్చా.. ఫోర్బ్స్‌ను మెప్పించా!
ఫోర్బ్స్ జాబితాలో చోటు.. ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు. దానిలో స్థానం సంపాదించుకుంది చప్పిడి గాయత్రి. కుటుంబ వ్యాపారంలో వారసురాలిగా కొనసాగొచ్చు.
ఫోర్బ్స్ జాబితాలో చోటు.. ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు. దానిలో స్థానం సంపాదించుకుంది చప్పిడి గాయత్రి. కుటుంబ వ్యాపారంలో వారసురాలిగా కొనసాగొచ్చు. కానీ దానిలో తన గొప్పతనం ఏమీ లేదని కొత్త రంగంలోకి అడుగుపెట్టింది. విజయాన్ని సాధించి ఈ ఘనత దక్కించుకుంది. ఆమెను వసుంధర పలకరించింది..
నాకు ఊహ తెలిసినప్పటి నుంచీ వ్యాపారవేత్త అవ్వాలనే! మాది ఉమ్మడి కుటుంబం. అసలు కడప, హైదరాబాద్‌లో స్థిరపడ్డాం. అమ్మానాన్న చప్పిడి సౌజన్య, రవీంద్రారెడ్డిలది కన్‌స్ట్రక్షన్ వ్యాపారం. నేను చదువయ్యాక కుటుంబ వ్యాపారంలోకి రావాలన్నది వాళ్ల కోరిక. అందుకే మార్కులపై కాదు కొత్త విషయాలు నేర్చుకోవడంపైనే ఎక్కువ దృష్టి పెట్టేదాన్ని. కోయంబత్తూరులో ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ చేశా. రూ.12లక్షల ప్యాకేజీతో ఉద్యోగమొచ్చింది. అమ్మానాన్న ‘కష్టనష్టాలు తెలుస్తాయి.. కొన్నిరోజులు ఉద్యోగం చేయ’మన్నారు. నేనేమో మాస్టర్స్ చేయడానికి విదేశాలకెళ్లా. అదయ్యాక కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ చదివా. ఇంజినీరింగ్‌లో అభిలాష్‌తో పరిచయమైంది. పీజీనీ కలిసే చదివాం. తనదీ వ్యాపార కుటుంబమే. తనకీ నాలానే సొంతంగా ప్రయత్నించాలని కోరిక. అప్పుడే బ్యాంకింగ్, చదువు, ఫుడ్ డెలివరీ అన్నింట్లోనూ టెక్నాలజీ వచ్చింది. అడ్వర్టైజింగ్‌కి మాత్రం ఫ్లెక్సీలు, బోర్డింగులపైనే ఎందుకు ఆధారపడాలన్న ఆలోచనొచ్చింది. దేశంలో డిజిటల్ అడ్వర్టైజింగ్ పరిచయం చేద్దామనుకుని.. అధ్యయనం కోసం చైనా, కొరియా వెళ్లాం. స్పష్టత వచ్చాక ఇంట్లో విషయం చెప్పి, పెట్టుబడికి సాయమడిగా. ‘ప్రయత్నించండి.. కానీ తేడావస్తే మాత్రం మేం చెప్పిందే చేయాల’న్నారు. అలా 2019లో అభిలాష్‌తో కలిసి ‘బెల్‌ప్లస్ మీడియా’ హైదరాబాద్‌లో ప్రారంభించాం.
ఇద్దరితో మొదలై..
రోజంతా ఎక్కడ తిరిగినా ఎవరైనా చేరాల్సింది ఇంటికే! అవే మా టార్గెట్ పాయింట్లు. ఒక నగల దుకాణముంది. దాని కస్టమర్లు చుట్టుపక్కల 10కి.మీ. మేర మాత్రమే ఉంటారనుకుందాం. ఎక్కడో ఫ్లెక్సీలు పెడితే గృహిణులు వాటిని చూడలేకపోవచ్చు. అసలు అటువైపు వెళ్లకపోవచ్చు. సోషల్ మీడియా పేజీనీ ఎంతమంది చూస్తారు? ఆడీ కార్ల సంస్థ లక్ష్యం ధనిక వర్గాలవాళ్లే. ఊరంతా పోస్టర్లు పెట్టడం వల్ల లాభమేంటి? కొనగలిగే వాళ్లుండే ప్రాంతాల వరకూ యాడ్ ఇస్తే చాలు. అలాంటి వాళ్లకి మా సేవలు సాయపడతాయి. కస్టమర్ కోరిన ప్రాంతంలో యాడ్ వేస్తుంటాం. ఇదీ అంత సులువేమీ కాలేదు. చైనా వెళ్లి మా సాఫ్ట్‌వేర్‌కు తగ్గట్టుగా స్క్రీన్లను చేయించుకున్నాం. మొదట్లో అపార్ట్‌మెంట్ల వాళ్లూ అనుమతివ్వలేదు. ఇబ్బందికరమైనవి వేయం, ప్రతి స్క్రీన్‌కీ అద్దె చెల్లిస్తాం. సగం తెర యాడ్‌లకీ.. మిగతాదాన్ని సొసైటీ నోటీసు బోర్డులా వాడుకునేలా ఇస్తామన్నాక అంగీకరించారు. 50 పెట్టడానికి నెలపట్టింది. మాట్లాడటం దగ్గర్నుంచి, స్క్రీన్లు మోసుకెళ్లడం వరకూ మేమే చేశాం. మొదటి యాడ్ రావడానికి నెలరోజులు పట్టింది. క్లౌడ్ సాఫ్ట్‌వేర్ కాబట్టి, ఒకేదాన్ని ఎన్నిరకాలుగానైనా మార్చేయొచ్చు. దీంతో కొత్తదనం కూడా. నచ్చి సంస్థలన్నీ వరుసకట్టాయి. ఆడీ, యాపిల్, అపోలో, యశోద, మలబార్, తనిష్క్, వోల్వో, థార్, ఫోక్స్‌వ్యాగన్, జొమాటో, దుబాయ్ ఎక్స్‌పో.. లాంటివెన్నో కస్టమర్లయ్యాయి. ఇద్దరితో మొదలైన ప్రయాణం.. 94మంది ఉద్యోగులు, చెన్నై, బెంగళూరు, ముంబయి, దిల్లీ, కోయంబత్తూరుల్లో శాఖల వరకు చేరింది.
మెంటార్‌గా..
రూ.3కోట్లతో ప్రారంభిస్తే టర్నోవర్ రూ.8కోట్లకు పైమాటే! తొలిదశ ఫండింగ్ అందుకున్నాం. రూ.100కోట్లతో రెండో రౌండ్ పెట్టుబడికీ వెళ్తున్నాం. విదేశాలకీ తీసుకెళ్లే ప్లాన్‌లో ఉన్నాం. నిలదొక్కుకున్నా అనిపించాక ఈ ఏడాదే అభిలాష్‌ని వివాహం చేసుకున్నా. వ్యాపారవేత్తగా ఎదిగి, ఫోర్బ్స్ జాబితాకెక్కాలని కోరిక. వాళ్లే మమ్మల్ని గుర్తించి, నామినేట్ చేయడం, ఫోర్బ్స్ ఆసియా 30 అండర్ 30 జాబితాలో స్థానం కల్పించడం గొప్ప అనుభూతి. ఇప్పుడు నాకు 27ఏళ్లు. బెల్‌ప్లస్‌ను లక్ష స్క్రీన్లకు చేర్చాలి. 35 ఏళ్లొచ్చేనాటికి సీరియల్ ఆంత్రప్రెన్యూర్ అవ్వాలని లక్ష్యం. ప్రారంభంలో పర్మిషన్లు, పెట్టుబడి విషయాల్లో చాలా ఇబ్బందిపడ్డాం. అందుకే కొత్తస్టార్టప్‌లకు మెంటారింగ్ చేస్తున్నా. అమ్మాయి ఏంచేయాలన్నా ‘నీకెందుకు కష్ట’మనేస్తారు. మీకు మీమీద నమ్మకం ఉందా.. ముందుకే వెళ్లండి. నాకంటూ ఓ గుర్తింపు ఉండాలనుకొని నచ్చింది చేస్తూ సాగిపోండి.. గెలుపు ఖాయం. నేను అనుసరించింది అదే!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.