అనగనగా.. దేశభక్తి!

అనగనగా అని కథ మొదలు పెట్టడం ఆలస్యం.. ‘ఊ’కొడుతూ పిల్లలంతా చుట్టూ చేరిపోయేవారు. ఇవి కాలక్షేపం ఒక్కటే కాదు. మంచీ చెడూ చెప్పే అవకాశం! మన పూర్వీకుల త్యాగాలను బోధించే మార్గం కూడా! మొబైళ్లు, టీవీలకు అతుక్కుపోతోన్న ఈ తరానికి మన సంస్కృతి, సంప్రదాయాలతోపాటు వారి త్యాగాలనూ చెప్పాలనుకున్నారు సరళ, మోనిక.

Published : 15 Aug 2023 12:22 IST

అనగనగా అని కథ మొదలు పెట్టడం ఆలస్యం.. ‘ఊ’కొడుతూ పిల్లలంతా చుట్టూ చేరిపోయేవారు. ఇవి కాలక్షేపం ఒక్కటే కాదు. మంచీ చెడూ చెప్పే అవకాశం! మన పూర్వీకుల త్యాగాలను బోధించే మార్గం కూడా! మొబైళ్లు, టీవీలకు అతుక్కుపోతోన్న ఈ తరానికి మన సంస్కృతి, సంప్రదాయాలతోపాటు వారి త్యాగాలనూ చెప్పాలనుకున్నారు సరళ, మోనిక. కథలనే అందుకు మార్గం చేసుకున్నారు.


చిరునామా వెతుక్కుంటూ వెళ్లి

ఐదుకళ్ల రాజమ్మ.. రాంపిల్ల నర్సమ్మ.. చింతచెరువు హంపమ్మ వీళ్లంతా ఎవరనుకుంటున్నారా? స్వాతంత్య్ర సంగ్రామంలో పోరాడినవారు. చరిత్రలో కనుమరుగువుతోన్న వీరి గాథలను సేకరించి, కథల రూపంలో అందిస్తున్నారు సోమిశెట్టి సరళ.

‘స్వాతంత్య్ర సాధనలో గ్రామీణ స్థాయిలో పాటుపడిన వారెందరో! జెండాను మోసిన వీరే లేకపోతే పోరాటం, విజయాలెక్కడివి? కానీ మనలో ఎవరికైనా వీరి గురించి తెలుసా? వీళ్ల కథలను ఈ తరానికి తెలియజేసే అవకాశం నాకొచ్చింది. మాది సత్యసాయి జిల్లా ధర్మవరం. సంగీతంలో పీజీ డిప్లొమా చేశాను. నాన్న రామయ్య కానిస్టేబుల్‌. అమ్మ శారదమ్మ. నాన్నకు సంగీతమంటే ప్రాణం. ఆయన ప్రోత్సాహంతోనే జానపద గాయనినయ్యా. దేశవిదేశాల్లోనూ పాడా. అంతరించిపోతున్న జానపదాలకు పూర్వవైభవం తేవాలని 2011లో కేంద్రం ఒక ఫెలోషిప్‌ను ప్రవేశపెట్టింది. దానికి ఎంపికయ్యా. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో మరుగున పడిన కళలు, కళాకారులు, పాటలను ప్రస్తావిస్తూ నేనిచ్చిన నివేదిక మెప్పించడమే కాదు.. మినిస్ట్రీ ఆఫ్‌ కల్చరల్‌లో సభ్యత్వాన్నీ తెచ్చిపెట్టింది. ‘ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌’ సందర్భంగా కల్చరల్‌ విభాగంలో నమోదైన కళాకారులందరికీ పిలుపొచ్చింది. ‘డిజిటల్‌ డిస్ట్రిక్ట్‌ రిపోజెటరీ’ ప్రాజెక్టులో భాగంగా స్వాతంత్య్ర పోరాటంలో పాత్ర పోషించిన స్థానిక నాయకులు, పురాతన కట్టడాలు, నదులు, అంతరించిన కళలను గుర్తించాలన్నారు. ఆసక్తి అనిపించింది. ఆంధ్ర, తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాలూ తిరిగాను. ట్రెజరీలు, కలెక్టర్‌ ఆఫీసులు, పుస్తకాలు.. ఇలా స్థానిక సమరయోధుల గురించి వెతకని చోటు లేదు. వారసులైనా దొరుకుతారని కష్టపడి చిరునామా వెతుక్కొని వెళితే.. ఇప్పుడిక్కడ లేరనేవారు. ఎలాగైతేనేం 330 కథనాలను సేకరిస్తే 94 ‘ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌’ వెబ్‌సైట్లో ప్రచురితమయ్యాయి. డీడీఆర్‌ ప్రాజెక్టు వారు అమృత రత్న బిరుదునిచ్చి, బ్రాండ్‌ అంబాసిడర్‌నీ చేశారు. అన్ని రాష్ట్రాల నుంచి ఎక్కువ కథలు ప్రచురితమైన వ్యక్తిగా ప్రథమస్థానంలో నిలిచా’.


విదేశాల్లో దేశీ పాఠాలు!

ఉన్నత చదువు, ఉద్యోగం.. ఈ కారణాలతో విదేశాల్లో స్థిరపడే వారెందరో! ఈ క్రమంలో మన సంస్కృతి, సంప్రదాయాలను మరిచిపోతున్నారు. ఈ విషయం మోనికని బాధించింది. అందుకే వారికి బోధించే బాధ్యతను ఈమె తీసుకున్నారు.

మోనికా అయ్యర్‌ది ముంబయి. తల్లిదండ్రుల ఉద్యోగరీత్యా దేశవిదేశాలు తిరిగారు. ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడ భారతీయ కమ్యూనిటీల్లో భాగమవడంతో భిన్న సంస్కృతులను తెలుసుకునే అవకాశం దక్కిందామెకు. ఎంకాం పూర్తయ్యాక మహారాష్ట్రలో కాలేజీ లెక్చరర్‌గా చేరారు. చదువొక్కటే సరిపోదని నమ్మే ఆమె దేశభక్తినీ బోధించేవారు, విద్యార్థులను సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనేలా చేసేవారు. పెళ్లయ్యాక భర్తతో కలిసి అమెరికా వెళ్లిపోయారు. భారతీయ సంప్రదాయాలు, ఆచారాలు ఇష్టపడే తను అక్కడ ఇమడలేకపోయారు. ఇంట్లోనే ఉంటే అనాసక్తి పెరిగిపోతుందని ఎంబీఏ పూర్తిచేసి, బ్యాంకర్‌ అయ్యారు. బ్యాంకుకి వచ్చే వినియోగదారులతో మాట్లాడే క్రమంలో భారత కమ్యూనిటీ గురించి తెలిసింది. దానిలో చేరి పండగలు, వేడుకలకు హాజరవుతుండేవారు. అనుకోకుండా ఒకసారో జానపద పాటకు కొరియోగ్రఫీ చేశారు. ఆ ప్రదర్శన చూసిన వారంతా ‘చాలా బాగా చేశారు, ఇలాంటి జానపదాలను మరచిపోతున్నాం అంటోంటే.. నిజమే నా పిల్లలకూ ఇవి తెలియవు. నా దేశం, అక్కడి జీవనవిధానాల గురించి వారికి నేనే చెప్పాలి అనుకున్నా’ అంటారామె. తన పిల్లలేకాదు తోటివారికీ తెలియజెప్పే బాధ్యత తీసుకున్నారు. కమ్యూనిటీలో వాలంటీర్‌గా ప్రతి వేడుకలోనూ భారత సంస్కృతి, సంప్రదాయాలతోపాటు స్వాతంత్య్ర సమరయోధుల జీవిత గాథలను నృత్యాలు, పాటలు, నాటకాల ద్వారా తెలియజేసేవారు. ఇప్పుడామె అసోసియేషన్‌ అధ్యక్షురాలు. ఒకప్పుడు లాభాపేక్షతో పనిచేసే సంస్థని, ఎన్జీఓగా మార్చారు. ఖాళీ సమయాల్లో తాను వేసిన పెయింటింగ్స్‌తో ఆర్ట్‌ ఎగ్జిబిషన్లు నిర్వహించి, వచ్చే మొత్తాన్ని సంస్థ అభివృద్ధికి వినియోగిస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని