తెలుగింటి బొమ్మలు!
తెలుగుతనం ఉట్టిపడే బొమ్మలవి.. చిట్టి చిట్టి నగలు.. ముచ్చటైన దుస్తుల్లో భలేగా మనసు దోచేస్తాయి. పెళ్లి, బారసాల.. ఓణీల వేడుక, షష్టిపూర్తి.. ఇలా వేడుకేదైనా వీళ్ల బొమ్మలు ఉండాల్సిందే.
తెలుగుతనం ఉట్టిపడే బొమ్మలవి.. చిట్టి చిట్టి నగలు.. ముచ్చటైన దుస్తుల్లో భలేగా మనసు దోచేస్తాయి. పెళ్లి, బారసాల.. ఓణీల వేడుక, షష్టిపూర్తి.. ఇలా వేడుకేదైనా వీళ్ల బొమ్మలు ఉండాల్సిందే. దివ్య తేజస్వీ, చంద్రముఖీ పల్లవి వీటి తయారీవైపు ఎందుకు వచ్చారో తెలుసుకుందాం..
విదేశాలకూ పంపిస్తున్నా..
మాది ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా. నాన్న అయోధ్య మోహన్‌రావు, అమ్మ లలిత. నాకో చెల్లి. మాది వ్యవసాయ కుటుంబం. ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సీ బీఈడీ చేశా. హైదరాబాద్‌లో లెక్చరర్‌గా పని చేసేదాన్ని. మావారు రవిప్రసాద్ ఐటీ ఉద్యోగి. మాకో పాప. కొవిడ్ సమయంలో ఆఫీసులు, స్కూళ్లు మూతబడినప్పుడు కాస్త తీరిక చిక్కింది. మా పాప చున్నీని చీరలా చుట్టుకుంటే బొమ్మలా అనిపించింది. చిన్నప్పుడు మా అమ్మ నాకు చేసిచ్చిన బొమ్మలు గుర్తుకొచ్చాయి. అలాంటి వాటికోసం గూగుల్‌లో వెతికితే.. అన్నీ పాశ్చాత్య తరహా బొమ్మలే ఉన్నాయి. తెలుగు సంప్రదాయం ఉట్టిపడేది ఒక్కటీ కనిపించలేదు. దాంతో నేనే తయారుచేయాలనుకున్నా. మా ఇంటి అద్దె రూ. ఏడువేలు. ఒక నెల ఇవ్వకుండా ఆపి.. దాన్నే పెట్టుబడిగా పెట్టా. చేతికి గోరింటాకు, బుజ్జి ఆభరణాలతో సంప్రదాయం ఉట్టిపడే బొమ్మలని తయారుచేశా. వాటిని చూసి ఒకరు 20 బొమ్మలు ఆర్డర్ ఇచ్చారు. వాటి తయారీ వీడియోలని ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో పెడితే ఆర్డర్లు పెరిగాయి. మొదట్లో పెళ్లిళ్లకీ, తర్వాత బారసాల, షష్టిపూర్తి వేడుకలూ, సీమంతం, ఓణీ¨లు, అన్నప్రాశనలకీ తగ్గట్టుగా కావాలని అడిగేవారు. కొంతమంది నాట్యకారిణులు కూడా నాట్య భంగిమల్లో ఉండే బొమ్మలని కోరేవారు. అలా కూచిపూడి, భరతనాట్యం చేస్తున్న బొమ్మలనీ తయారు చేసిచ్చా. తర్వాత అమ్మ, చెల్లీ సాయంగా వచ్చారు. ‘లలితా డాల్స్’ అన్న అమ్మ పేరుతో వ్యాపారాన్ని విస్తరించా. ప్రస్తుతం నా దగ్గర ఐదుగురు అమ్మాయిలు పనిచేస్తున్నారు. వేడుకలకి మాత్రమే పరిమితం కాకుండా రామాయణ, భాగవతాల్లోని ఘట్టాలనూ బొమ్మలుగా మలుస్తున్నా. యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలకూ మా బొమ్మలు ఎగుమతి చేస్తున్నాం. మనసులో ఏదైనా చేయాలనిపిస్తే దేనికీ భయపడకుండా మొదలుపెట్టాలి. అదే నా విజయ రహస్యం.
నగలు చేయడం కష్టమే...
మాది హైదరాబాద్. నాన్న వేణుగోపాల్. అమ్మ లక్ష్మీదేవి. ఇద్దరు అన్నయ్యలు. అమ్మ చీరలపై అద్భుతమైన డిజైన్లు వేసేది. అది చూసి నేనూ నేర్చుకున్నా. భరతనాట్యం, కూచిపూడి అభ్యసించా. ఇప్పటివరకు 200 నృత్య ప్రదర్శనలూ ఇచ్చా. మావారు శ్రీధర్, వ్యాపారి. పెళ్లి తర్వాతా నన్ను చదువుకొమ్మని ప్రోత్సహించారు. మాకు ఇద్దరు అబ్బాయిలు. వాళ్లని స్కూల్లో దింపి, కాలేజీకి వెళ్లేదాన్ని. ఎంఏ ఇంగ్లీష్ చేసి, 17 ఏళ్ల పాటు టీచర్‌గా పనిచేశా. మావారికి యాక్సిడెంట్ అవ్వడంతో నేను ఇంటికే పరిమితం అవ్వాల్సి వచ్చింది. ఆ సమయంలో ఖాళీగా ఉండలేక బార్బీ బొమ్మలని అందంగా సంప్రదాయ లుక్‌లోకి మార్చేదాన్ని. అది చూసి మా చుట్టాలమ్మాయి ముచ్చటపడింది. ఆ క్రమంలోనే డిజైనింగ్ మీద పట్టు ఉండటంతో ఓ చిన్న బొటిక్ ప్రారంభించా. తర్వాతర్వాత ఆ బొటిక్‌ని బొమ్మల తయారీకే పూర్తిగా కేటాయించా. సామాజిక మాధ్యమాల్లో నేను చేసిన బొమ్మలని చూసిన చాలామంది మాకూ కావాలని ఆర్డర్లు ఇచ్చేవారు. ఆర్డరు తీసుకొనే ముందు వాళ్ల అలవాట్లు, అభిరుచులు, నగలు, హెయిర్ స్టైల్ వంటివి తెలుసుకుని అచ్చంగా వాళ్లని ప్రతిబింబించేలా చేయడం నా ప్రత్యేకత. దాంతో ఆ బొమ్మలకి ఆదరణ పెరిగింది.
ఉపాసన, జేడీ లక్ష్మీనారాయణ వంటి వారికి కానుకలుగా అందించా. బొమ్మల్లో తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా తయారుచేయడం అంత తేలికేమీ కాదు. చిన్నచిన్న ఆభరణాలు చేయడం చాలా కష్టం. రూ.1000తో మొదలైన నా వ్యాపారం ఇప్పుడు నెలకు రూ.60వేల వరకూ ఆదాయాన్నిస్తోంది. ఏదైనా చేయాలనుకొన్నప్పుడు ధైర్యంగా ముందడుగువేయండి. అదే మిమ్మల్ని విజయతీరాలకు చేరుస్తుంది.
- అదపాక సాయి, ఈనాడు జర్నలిజం స్కూల్
వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.