పట్టుపట్టారు.. సాధించారు!

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ఫలితాలు వెలువడ్డాయి అనగానే.. అందరికీ ఆతృతే టాపర్‌ ఎవరా అని. ఈసారి మొదటి స్థానాన్నే కాదు.. తొలి మూడు స్థానాల్నీ అమ్మాయిలే దక్కించుకున్నారు. అయితే ఈ కలని నెరవేర్చుకోవడం కోసం ఎన్నో వైఫల్యాలకీ, సవాళ్లకీ ఎదురీదారు.

Updated : 19 Aug 2023 06:43 IST

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ఫలితాలు వెలువడ్డాయి అనగానే.. అందరికీ ఆతృతే టాపర్‌ ఎవరా అని. ఈసారి మొదటి స్థానాన్నే కాదు.. తొలి మూడు స్థానాల్నీ అమ్మాయిలే దక్కించుకున్నారు. అయితే ఈ కలని నెరవేర్చుకోవడం కోసం ఎన్నో వైఫల్యాలకీ, సవాళ్లకీ ఎదురీదారు. చివరికి లక్ష్యాన్ని సాధించారు. వసుంధరతో ఆ విశేషాలని పంచుకున్నారు..


నాన్న కల

మొదటి నుంచీ భానుశ్రీ లక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూష మంచి ర్యాంకరే! అయితే తను గ్రూప్‌-1 సాధించడానికి మాత్రం కష్టపడి కాదు.. ఇష్టంగా ప్రయత్నించడమే కారణమంటున్నారు. తొలి ప్రయత్నంలోనే మొదటి ర్యాంకు సాధించిన ఆమె ఏం చెబుతున్నారంటే..

మాది పశ్చిమగోదావరి జిల్లాలోని సీసలి గ్రామం. నాన్న రామాంజనేయులు ప్రభుత్వ ఉపాధ్యాయుడు. అమ్మ ఉష. చిన్నప్పట్నుంచీ మంచి విద్యార్థినినే. ఇంటర్‌లో స్టేట్‌ ఫస్ట్‌ వచ్చా. అందరిలా ఇంజినీరింగో, మెడిసినో కాకుండా దిల్లీలోని లేడీ శ్రీరామ్‌ కాలేజ్‌లో బీఏ (పొలిటికల్‌ సైన్స్‌ అండ్‌ ఎకనామిక్స్‌)లో చేరడానికి కారణం నాన్నే. ఆయనకు నన్ను కలెక్టర్‌ హోదాలో చూడాలని కల. డిగ్రీ పూర్తవ్వగానే సివిల్స్‌ లక్ష్యంగా పెట్టుకున్నా. ప్రిలిమ్స్‌ కూడా సాధించా. ఇంతలో ఏపీపీఎస్‌సీ నోటిఫికేషన్‌ పడటంతో దాన్నీ ప్రయత్నించమన్నారు నాన్న. యూపీఎస్‌సీ సన్నద్ధత ప్రిలిమ్స్‌కి పనికొచ్చింది. మెయిన్స్‌కి మాత్రం కొంత సిద్ధమవ్వాల్సి వచ్చింది. పరీక్షయ్యాక వస్తుందన్న నమ్మకం కలిగింది కానీ, మొదటి ర్యాంకు ఊహించలేదు. నేను పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేప్పుడు అమ్మ నాకు తోడుగా దిల్లీ వచ్చింది. నానమ్మ నాన్నని చూసుకుంది. నాకు ఏ ఇబ్బందీ కలగొద్దని వాళ్లంతా కష్టపడ్డారు. అందుకే ఈ విజయాన్ని నేను మా కుటుంబ సభ్యులకే అంకితమిస్తా. మా ఇంట్లో అడ్మినిస్ట్రేషన్‌ వైపు ఎవరూ లేరు. అయినా విజయం సాధించగలిగానంటే ఇష్టంగా ప్రయత్నించడం వల్లే! ప్రభుత్వ కొలువనగానే పోటీ చాలా ఉంటుంది. వయసు సరిపోదు. కష్టం అన్న మాటలు వినిపిస్తాయి. నాకు 22 ఏళ్లు. తొలి ప్రయత్నంలోనే విజయానికి నన్ను నేను నమ్మడమే కారణం. మీరూ అంతే. ఎంచుకున్నది ఏదైనా మిమ్మల్ని మీరు నమ్మండి. శ్రమపడుతూ కాకుండా ఇష్టంగా నేర్చుకుంటూ ముందుకు సాగండి. విజయం సాధించడం ఖాయం. నావరకూ సివిల్స్‌ కల. ఈ సెప్టెంబరులో మెయిన్స్‌నీ రాయబోతున్నా.

- సీహెచ్‌ నాగేశ్వరాచారి, ఈటీవీ, హైదరాబాద్‌


ఐదో ప్రయత్నంలో సాధించి..

పొరపాట్లు ఎవరైనా చేస్తారు. కానీ వాటిని మళ్లీ చేయకుండా జాగ్రత్తపడి అనుకున్న లక్ష్యాన్ని సాధించారు భూమిరెడ్డి పావని. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి తాజా ఫలితాల్లో రెండో ర్యాంకుని సొంతం చేసుకున్నారీమె.. 

మాది వైయస్‌ఆర్‌ జిల్లాలోని మైదుకూరు. నాన్న గంగయ్య రైతు. అమ్మ లక్ష్మీదేవి. పదో తరగతిలో 84 శాతం, ఇంటర్‌లో 92 శాతం, బీటెక్‌ 75 శాతంతో ఉత్తీర్ణత సాధించా. ప్రొద్దుటూరులోని వాగ్దేవి కళాశాలలో ఇంజినీరింగ్‌ పూర్తిచేశా. కొంతకాలం పాటు కర్నూలు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఒప్పంద అధ్యాపకురాలిగా పనిచేశా. సర్వీస్‌లపై ఇష్టంతో 2015 గ్రూప్‌ 1 పరీక్ష కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాను. 2016, 2017లో గ్రూప్‌ 2 పరీక్షలు రాశాను. 2018లో గ్రూప్‌1 రాశా. అవన్నీ నాకు వరుస వైఫల్యాలనే మిగిల్చాయి. ఇంటర్వ్యూ వరకూ వచ్చి కూడా వెనుతిరిగాను. కొంతకాలం హైదరాబాద్‌ వచ్చి కోచింగ్‌ తీసుకున్నా. సిటీ సెంట్రల్‌ లైబ్రరీలో ఉండి చదువుకున్నప్పుడు నాలా కష్టపడి చదువుతున్న అనేకమందిని చూసి స్ఫూర్తిని నింపా. వరుస వైఫల్యాలతో బాధపడుతున్న సమయంలో మా చెల్లి భాగ్యలక్ష్మి, తమ్ముడు గణేష్‌ నాలో ధైర్యం నింపారు. ఇంట్లో మాక్‌ టెస్టులు పెట్టేవారు. అవసరమైన నోట్స్‌ రాసిచ్చేవారు. అలా వాళ్ల సహకారంతోనే ఐదో ప్రయత్నంలో.. గతంలో చేసిన పొరపాట్లు చేయకుండా, ఆత్మవిశ్వాసంతో ప్రయత్నించా. రెండో ర్యాంకు సాధించడం సంతోషంగా ఉంది.

- విజయభాస్కర్‌ రెడ్డి, మైదుకూరు


ముగ్గుర్నీ అలానే పెంచారు..

తండ్రి సామాన్య బస్‌ కండక్టర్‌. ముగ్గురు ఆడపిల్లల్లో చివరి అమ్మాయి కంబాలకుంట లక్ష్మీప్రసన్న. లక్ష్యాన్ని చేరుకొనే క్రమంలో వైఫల్యాలు ఎదురైనా, పట్టుదలతో శ్రమించి తాజా ఫలితాల్లో మూడో ర్యాంకు సాధించారీమె.. 

మాది కడప జిల్లా నందలూరు మండలంలోని టంగుటూరు. నాన్న సుబ్బరాయుడు రాజంపేట ఆర్టీసీలో కండక్టర్‌గా పనిచేసి పదవీ విరమణ తీసుకున్నారు. అమ్మ సరస్వతి. పదోతరగతి వరకూ మా ఊళ్లోని ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నా. తిరుపతిలోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్‌ చదివా. రాజంపేటలోని అన్నమాచార్య కళాశాలలో ఇంజినీరింగ్‌ పూర్తి చేశా. మా అక్క లావణ్య ఆరేళ్ల క్రితమే గ్రూప్‌-1లో ర్యాంకు కొట్టి.. డీఎస్పీ ఉద్యోగం సాధించింది. ప్రస్తుతం తిరుపతిలోని ఏపీ ట్రాన్స్‌కోలో చీఫ్‌ విజిలెన్స్‌ అధికారిగా పనిచేస్తోంది. రెండో అక్క మాధవి ఏపీ టిడ్కోలో పని చేస్తోంది. తను కూడా గ్రూప్స్‌ సాధించాలని శిక్షణ తీసుకుంటోంది. 2014 నుంచి మూడు సార్లు సివిల్స్‌ కోసం ప్రయత్నించా. కానీ సాధించలేకపోయా. 2019లో పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం సాధించి, ప్రస్తుతం టీవీపురం గ్రామంలో విధులు నిర్వహిస్తున్నా. ఉద్యోగం చేస్తూనే కోచింగ్‌ తీసుకుని గ్రూప్‌-1 పరీక్షలు రాశా. డిప్యూటి కలెక్టర్‌గా ఎంపిక కావడం సంతోషంగా ఉంది. మావారు చంద్రదీప్‌ పంచాయతీ కార్యదర్శిగా అనంతపురం ఎల్లానూరు మండలంలో పని చేస్తున్నారు. ఆడపిల్లలమన్న తక్కువ భావన రానీయకుండా ఉన్నదాంట్లోనే నాన్న  ముగ్గుర్నీ  కష్టపడి చదివించారు. మేమంతా ప్రభుత్వ  పాఠశాల్లోనే చదువుకున్నాం. లక్ష్యం బలంగా ఉంటే విజయం తేలిగ్గానే దొరుకుతుంది. అందుకు మా  విజయాలే ఉదాహరణ.

- కొత్తపల్లి చంద్రసుభాష్‌, రాజంపేట


వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాంల ద్వారా  పంపవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని