14 శిఖరాలు అధిరోహించి..
మనసుకు దగ్గరైన వారి మరణం ఆమె జీవితానికో లక్ష్యాన్ని ఏర్పరిచింది. అదే ఈమెను 14 ఎత్తైన పర్వతాలను అధిరోహించేలా చేసింది. వేగవంతమైన పర్వతారోహకురాలిగా ప్రపంచ రికార్డు సాధించిన క్రిస్టిన్ హరీలా స్ఫూర్తి కథనమిది..
మనసుకు దగ్గరైన వారి మరణం ఆమె జీవితానికో లక్ష్యాన్ని ఏర్పరిచింది. అదే ఈమెను 14 ఎత్తైన పర్వతాలను అధిరోహించేలా చేసింది. వేగవంతమైన పర్వతారోహకురాలిగా ప్రపంచ రికార్డు సాధించిన క్రిస్టిన్ హరీలా స్ఫూర్తి కథనమిది..
పర్వతాలమధ్య మృతదేహాలను చూసినప్పుడు భయంకన్నా, శిఖరంపై చనిపోవడానికి కూడా సిద్ధపడాలనే ఆలోచనే వచ్చిందనే క్రిస్టిన్‌కు పర్వత శిఖరాలంటే ప్రాణం. నార్వేకు చెందిన ఈమెకు అత్యంత సన్నిహితుల మరణం, సవాళ్లను ఎదుర్కోవాలనే ఆలోచననిచ్చింది. అసాధ్యమైనదాన్ని సాధ్యం చేయాలనే ఈమె, స్కీయింగ్ క్రీడాకారిణిగా ఎదిగారు. ఏడేళ్ల క్రితం పర్వత శిఖరాల అధిరోహణను అభిరుచిగా మార్చుకొన్నారు. ‘ప్రకృతి నాకెంతో ప్రశాంతతనిచ్చేది. ఆత్మవిశ్వాసం ఉంటే లక్ష్యాన్ని చేరుకోవచ్చని తెలుసుకొన్నా. అదే నన్ను మరిన్ని సాహసాలు చేసేలా పురిగొల్పింద’ని చెబుతారు 37 ఏళ్ల క్రిస్టిన్.
చావుకి ఎదురెళ్లి..
2015లో ఆఫ్రికాలోని కిలిమంజారో నుంచి నా పర్వతారోహణ ప్రయాణం ప్రారంభమైంది. ఆ తర్వాత ఐలెంట్ పీక్, అమా దబ్లమ్ వంటివెన్నో ఎక్కానంటారీమె. ‘8వేల మీటర్ల ఎత్తుండే 14 పర్వతాలు.. మౌంట్ ఎవరెస్ట్, దౌలగిరి, కాంచనగంగ, మకాలు, ఛోయూ, నంగా పర్బాత్, అన్నపూర్ణ 1, గషేర్‌బ్రమ్, బ్రాడ్ పీక్, షిషాపాంగ్మా వంటివాటిని 92 రోజుల్లోనే అధిరోహించి ప్రపంచంలోనే అతివేగవంతమైన పర్వతారోహకురాలినయ్యా. అయితే ఈ ఛాలెంజ్ అనుకున్నంత సులువు కాదు. చావుకు ఎన్నోసార్లు ఎదురెళ్లా. మృత్యువు అంచులను చూశా. దౌలగిరి-7 ఎక్కేటప్పుడు 7,246 మీటర్ల ఎత్తులో నాతోపాటు మరో ఇద్దరు పర్వతారోహకులు, ఒక గైడ్ ఉన్నారు. 2వ క్యాంపు వద్ద భారీ తుపాను ఎదురైంది. ఆగకుండా దౌలగిరి శిఖరాగ్రానికి వెళ్లి, తిరిగి బేస్ క్యాంపును 19 గంటల్లో చేరుకున్నాం. కాళ్లు కూరుకుపోయే మంచు. తుపాను తాకిడికి ముందడుగు వేయలేయలేకపోయా. ఆ భయంకరమైన అనుభవాన్ని మరవలేను. అప్పుడు కోల్పోయిన నా పాదాల స్పర్శ తిరిగి రావడానికి 6 నెలలు పట్టింది. శిఖరాగ్రాన్ని చేరుతున్న మార్గంలో చనిపోయే పర్వతారోహకులను చూసినప్పుడు భయం వేయదు. ఇటువంటి చోట ప్రాణాలొదలడానికి కూడా వెనుకాడ’నని చెబుతున్న క్రిస్టినా పర్వతారోహణపై ఆసక్తి ఉన్నవారికి శిక్షణనిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.