సేంద్రియ సిరి మంత్రం!

మట్టి పనికన్నా.. నాలుగు డబ్బులొచ్చే ఉద్యోగమే మేలు అనేది ఒకప్పటి అభిప్రాయం. సేంద్రియ వ్యవసాయంలో అడుగుపెట్టి ఆరోగ్య‘సిరి’పై దృష్టిపెడుతోంది నేటితరం. సోషల్‌మీడియా దన్నుతో సేంద్రియ సాగులోకి వచ్చారీ యువ రైతులు మేఘన, నేత్ర.  

Updated : 20 Aug 2023 06:50 IST

మట్టి పనికన్నా.. నాలుగు డబ్బులొచ్చే ఉద్యోగమే మేలు అనేది ఒకప్పటి అభిప్రాయం. సేంద్రియ వ్యవసాయంలో అడుగుపెట్టి ఆరోగ్య‘సిరి’పై దృష్టిపెడుతోంది నేటితరం. సోషల్‌మీడియా దన్నుతో సేంద్రియ సాగులోకి వచ్చారీ యువ రైతులు మేఘన, నేత్ర.  ఈ రంగంలో తమకెదురైన అనుభవాలని వసుంధరతో పంచుకున్నారిలా...


స్వచ్ఛమైన తేనె కోసం
- మేఘన

చేస్తున్న ఉద్యోగం వదిలి.. నాణ్యమైన ఆహారాన్ని అందించాలనే తలంపుతో ఆర్గానిక్‌ తేనెను అందిస్తున్నారు మేఘన..

దైనా వ్యాపారం చేయాలి. నలుగురికీ ఉపాధి కల్పించాలనేది నా ఆలోచన. మాది నెల్లూరు. నేను బెంగళూరు కాగ్నిజెంట్‌లో పనిచేసేదాన్ని. మావారు మహేష్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. ఆయన తీరిక సమయాల్లో ఫుడ్‌ బ్లాగ్స్‌ చేస్తుంటారు. ఎక్కడ మంచి ఆహారం దొరుకుతుందో తెలుసుకుని వీడియోలు చేయడం ఆయన హాబీ. పెళ్లయ్యాక నేనూ తోడయ్యా. ఉదయం లేవగానే గ్లాసుడు నీళ్లలో తేనె కలుపుకొని తాగడం మాకు అలవాటు. ఆ క్రమంలో కల్తీలేని స్వచ్ఛమైన తేనె కోసం వెతికితే ఎక్కడా దొరకలేదు. మనమే ఎందుకు ఆర్గానిక్‌ హనీని తయారుచేయకూడదు? అనే ఆలోచన వచ్చింది. పెట్టుబడీ తక్కువే కావడంతో ఆయనా సరే అన్నారు. దీన్ని ప్రారంభించడానికి ముందు చాలా అధ్యయనం చేశా. క్యాంప్‌లు, పర్యటనలు, ఫ్యామీలీ పార్టీలు, బ్లాగ్‌లు ఏ పని మీద, ఎక్కడికెళ్లినా దగ్గర్లో తేనెటీగల ఫామ్‌లు ఏమైనా ఉన్నాయా అని వెతికేదాన్ని. ఉంటే ఆ రైతులతో కలిసి మాట్లాడేదాన్ని. వీటి పెంపకం, తయారీ, నాణ్యమైన తేనె సరఫరా గురించి తెలుసుకునే సరికే ఐదు నెలలు పట్టింది. కొల్లూరు దగ్గరగా ఉన్న రైతులతో మాట్లాడి తేనె సేకరించేందుకు రూ.2లక్షలు బయానాగా ఇచ్చాం. అది నా తొలిప్రయత్నం. తర్వాత 15 మంది రైతులు తోడయ్యారు. మార్కెటింగ్‌, ప్యాకింగ్‌, బ్రాండ్‌, ఏ పేరు పెట్టాలి.. వినడానికి చిన్నగానే ఉన్నా ఆలోచిస్తే మాత్రం తలనొప్పి వచ్చేది. ఈ ఫామింగ్‌లో నాకు సాయం చేస్తున్న తమ్ముడు, మావారూ ఇద్దరూ బీటెక్‌ చదివిన వాళ్లే. అందుకే దీనికి ‘బీటెక్‌వాలా’ ఆర్గానిక్‌ హనీ అని పేరు పెట్టా. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా పేజీలను ఉపయోగించుకున్నాం. ఆన్‌లైన్‌లోనే ఆర్డర్లు తీసుకుంటున్నాం. తెలుగు రాష్ట్రాలకే కాకుండా దిల్లీ, ముంబయి, చెన్నైకీ కొరియర్‌ చేస్తున్నాం. మొదటి రెండు నెలల్లోనే మేం పెట్టిన పెట్టుబడి మొత్తం వచ్చేసింది. నెలకు వెయ్యి కేజీల తేనె సరఫరా చేస్తున్నాం. రైతులకు అందరూ కిలోకి రూ.200 ఇస్తుంటే మేం రూ.300 ఇస్తున్నాం. విజయవాడ శివార్లలో సొంతంగా ఫామ్‌ను ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నా. నగరవాసులు వచ్చి, సేదతీరి, నచ్చిన ఫ్లేవర్‌లో తేనెను కొనుక్కొని సంతోషంగా వెళ్లాలి అన్నది నా కల.

- మరిశర్ల జగదీష్‌కుమార్‌, విజయవాడ


నటన విడిచి.. రైతుగా మారి..!
- నేత్ర

యూట్యూబ్‌, ఇన్‌స్టాలో చక్కని తెలంగాణ భాష మాట్లాడుతూ.. తన సాగు వీడియోలతో అందరికీ చేరువవుతున్న అమ్మాయి ‘ఫార్మర్‌ నేత్ర’. నటనని వదిలి వ్యవసాయంలో అడుగుపెట్టిందీ అమ్మాయి.. 

నా అసలు పేరు సాధు శ్రీతేజ. అందరికీ నేత్రగానే పరిచయం. మా సొంతూరు నిర్మల్‌. పుట్టింది, పెరిగింది అంతా అక్కడే. అమ్మ అంగన్‌వాడీ టీచర్‌. నాన్న మెకానిక్‌. నా భర్త వంశీకృష్ణ మోటివేషనల్‌ స్పీకర్‌. పదో తరగతి వరకు నిర్మల్‌లో, ఆ తరువాత హైదరాబాద్‌లో చదువుకున్నా. ఇంటర్‌ తరువాత ఏవియేషన్‌ కోర్సు చేసినా అందులో ఉద్యోగం రాలేదు. ఆ తర్వాత సినిమా రంగం వైపు వెళ్లాను. ‘మహర్షి’, ‘చిత్రలహరి’ సహా 15 సినిమాల్లో నటించా. రుషికేశ్‌లో కొన్నాళ్లు యోగా ట్రైనర్‌గానూ పనిచేశా. మనం ఏ పని చేయాలన్నా ఆరోగ్యం చాలా ముఖ్యం. ఈ క్రమంలోనే సేంద్రియ వ్యవసాయంపై నాకు ఆసక్తి పెరిగింది. పొరుగు దేశాలూ, రాష్ట్రాల్లో సేంద్రియ వ్యవసాయం ఎలా చేస్తున్నారో తెలుసుకున్నా. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చాలామంది రైతులతో మాట్లాడా. ‘వారధి ఫామ్స్‌’ పేరుతో సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతుల నుంచి వస్తువులు సేకరించి అమ్ముతున్నా. తేనె, బియ్యం, పసుపు, ఆవు నెయ్యి, కారం వంటివి మా వెబ్‌సైట్‌లో ఉంచాం. తక్కువ కాలంలోనే మంచి స్పందన లభించింది. ఆర్డర్లు ఎక్కువ వచ్చినా సరే.. రాజీపడకుండా నాణ్యమైన ఆర్గానిక్‌ వస్తువులని మాత్రమే అమ్మాలనుకున్నా. ప్రస్తుతం దొంతనపల్లిలో నాలుగు ఎకరాల్లో కూరగాయలు, ఆకు కూరలు, వరి పండిస్తున్నా. తేనెటీగల పెంపకంలోనూ శిక్షణ తీసుకున్నా. నాటుకోళ్లని పెంచుతున్నా. ఈ మధ్యే ఆవుల పెంపకం కూడా మొదలుపెట్టాం. వినియోగదారుల అభిరుచి తెలుసుకోవడం కోసం కొన్నాళ్లు రైతు బజారులో స్వయంగా కూరగాయలు, తేనె, జున్ను పాలు అమ్మా. ఏ పని చేద్దాం అన్నా.. అది నీ వల్ల కాదు అని చెప్పేవాళ్లే ఎక్కువ. ముఖ్యంగా వ్యవసాయం అంటే చాలామందికి చిన్నచూపు. కానీ ఇష్టంతో చేస్తే ఏదీ కష్టం కాదు. ప్రస్తుతం నేను రూ.20 నుంచి రూ.30 లక్షల టర్నోవర్‌కు చేరుకోగలిగా. యూట్యూబ్‌, ఇన్‌స్టాల్లో.. నాలుగు లక్షలమంది అభిమానులున్నారు. 

- అవదూత హరిప్రియ, హైదరాబాద్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని