అమ్మల కోసమే.. వీళ్ల విహారయాత్రలు!

చిన్నతనం నుంచీ ఈ స్నేహితురాళ్లకు పర్యటనలంటే ప్రాణం. చదువు, ఉద్యోగం, పెళ్లి.. ఏవీ ఇందుకు అడ్డుపడలేదు. కానీ పిల్లలు పుట్టాక అలా కాదని విన్నారు. ఇష్టమైనది చేయడానికి అమ్మతనం అడ్డుకాదని నిరూపించాలనుకున్నారు. వాళ్లు ప్రయాణించడమే కాదు.. తమలాంటి మరెంతో మంది అమ్మలకూ విహారయాత్రలు ప్లాన్‌ చేస్తున్నారు సాక్షి, నిఖిత.

Published : 21 Aug 2023 00:06 IST

చిన్నతనం నుంచీ ఈ స్నేహితురాళ్లకు పర్యటనలంటే ప్రాణం. చదువు, ఉద్యోగం, పెళ్లి.. ఏవీ ఇందుకు అడ్డుపడలేదు. కానీ పిల్లలు పుట్టాక అలా కాదని విన్నారు. ఇష్టమైనది చేయడానికి అమ్మతనం అడ్డుకాదని నిరూపించాలనుకున్నారు. వాళ్లు ప్రయాణించడమే కాదు.. తమలాంటి మరెంతో మంది అమ్మలకూ విహారయాత్రలు ప్లాన్‌ చేస్తున్నారు సాక్షి, నిఖిత.

‘మాతృత్వం ప్రతి స్త్రీకి గొప్పవరం. కానీ అమ్మయ్యాక ఎన్నో సరదాలను వదులుకోవాలి. ఇక ప్రయాణాలు, పర్యటనలు మునుపటిలా ఆస్వాదించలేమని అనుకుంటారు. అదంతా భ్రమే అని నిరూపించాలనుకున్నాం’ అంటారు సాక్షి గులాటి, నిఖిత మాథుర్‌. వీళ్లిద్దరూ దంత వైద్యులు. అందమైన ప్రదేశాల్లో ప్రయాణించి అక్కడి వింతలు, విశేషాలు తెలుసుకోవడమంటే ఆసక్తి. పెళ్లయ్యాకా దాన్ని కొనసాగించారు. కానీ పిల్లలు పుట్టాక వీటన్నింటినీ వదులుకోవాల్సిందే అని కొందరు అనడం విన్నారు. అమ్మయ్యాక ఇంటికే పరిమితం అవ్వాలా? ఆమెకంటూ కోరికలు ఉండవా అన్న ప్రశ్నలు వాళ్లని కలవర పెట్టాయి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఎక్కడికైనా వెళితే సరదాగా గడుపుతాం. పిల్లలతో వెళితే మాత్రం ఇబ్బంది అని ఎందుకు ఆలోచించాలి. వాళ్లతోనూ మధురానుభూతులను పోగేసుకోవచ్చని చూపించాలనుకున్నారు. సాక్షి మొదటి ప్రసవమయ్యాక తన మూడు నెలల కూతురుతో కలిసి తొలిసారి మహాబలిపురం వెళ్లారు. నిఖిత నెలల వయసున్న బాబుతో మైసూరు వెళ్లారు.

‘పసిపిల్లలతో వెళ్లినప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు మామూలే! అయితే అందరూ అన్నట్లు అసాధ్యం, కష్టమేమీ కాదు. పైగా అదో వింత అనుభూతి. పిల్లలతో గడిపిన ఆ ఆనంద క్షణాలను ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌ల్లో పంచుకున్నాం. ప్రశంసలూ వచ్చాయి. అప్పుడే సీనియర్‌ సిటిజన్లు, ప్రేమికులు, ఒంటరి ప్రయాణాలకు ట్రావెల్‌ గ్రూపులున్నాయి. అమ్మలకు మాత్రం ఎందుకు ఉండొద్దని 2021లో ‘ట్రావెల్‌ విత్‌ కిడ్స్‌’ మొదలుపెట్టి పర్యటనలు ప్లాన్‌ చేశాం. మొదట ఆరుగురు అమ్మలు ముందుకొచ్చారు. వారి ఇష్టాలు, అభిరుచులు తెలుసుకున్నాకే యాత్రను ప్రారంభిస్తాం. ఫ్యామిలీ టూర్‌ అనిపించేలా చూస్తాం. ఎలాంటి లోటు రాకుండా దగ్గరుండి చూసుకుంటాం’ అంటారు నిఖిత.
‘పుదుచ్చేరి, కునూర్‌, వకలా, గోవా, మైసూరు వంటి ప్రాంతాల్లో ఎక్కువగా విహారయాత్రలు ప్లాన్‌ చేశాం. ఆ విశేషాలనూ చూస్తూ ఫొటోలు, వీడియోలు తీస్తూ తల్లులూ చిన్నపిల్లలుగా మారిన సందర్భాలెన్నో. పంటపొలాలు కనిపిస్తే ఆ రైతుల నుంచి సేకరించిన వాటితో స్వయంగా భోజనం వండి పెడతాం. పర్యటన అన్నిరోజులూ వాళ్లు ఆనందంగా గడుపుతోంటే సంతోషమేస్తుంది’ అని చెబుతారు సాక్షి. వీళ్లు తమ తమ వృత్తుల్లో కొనసాగుతూనే వారాంతాల్లో ఈ విహారయాత్రలను ప్లాన్‌ చేస్తున్నారు. పర్యటనల్లో ఒకవేళ తల్లులు అలసిపోయినా వారి పిల్లల బాధ్యతను వీరు తీసుకుంటారట. ఈ పర్యటన వివరాలన్నీ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటారు. వీళ్ల ఖాతాను దాదాపు 78 వేల మంది అనుసరిస్తున్నారు. ‘తల్లి అవ్వటం మధురానుభుతి. అది అమ్మల చిన్న చిన్న ఆనందాలకు అవరోధం కాదు. ఇందుకు మాతో ప్రయాణించే తల్లుల చిరునవ్వులే రుజు’వంటున్న వీళ్ల ప్రయాణం బాగుంది కదూ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని