పల్లె జీవితాల్లో వెలుగు పూలు

సేవ చేయడానికి మనసుండాలి కానీ వయసుతో సంబంధం ఏంటి? అదే నిరూపిస్తోందీ టీనేజీ అమ్మాయి.విద్యుత్‌ కొరతతో చదువుకు దూరమవుతున్న పిల్లల కోసం సోలెడ్‌ ప్రాజెక్టుతో సౌర వెలుగులు నింపుతోంది.

Updated : 22 Aug 2023 05:38 IST


సేవ చేయడానికి మనసుండాలి కానీ వయసుతో సంబంధం ఏంటి? అదే నిరూపిస్తోందీ టీనేజీ అమ్మాయి. విద్యుత్‌ కొరతతో చదువుకు దూరమవుతున్న పిల్లల కోసం సోలెడ్‌ ప్రాజెక్టుతో సౌర వెలుగులు నింపుతోంది. యువతని వ్యాపారంవైపు మళ్లించేందుకు నెక్స్ట్‌ఇన్‌ అంకుర సంస్థని మొదలుపెట్టింది 17 ఏళ్ల అన్విత కొల్లిపర. ఆ విశేషాలని వసుంధరతో పంచుకుంది...

నేను పుట్టి పెరిగిందంతా యూఎస్‌లో. అమ్మ సంధ్య, నాన్న శ్రీనివాస్‌ అక్కడే ఉద్యోగం చేసేవారు. నానమ్మ, తాతయ్య కృష్ణాజిల్లా కపిలేశ్వరపురంలో ఉండేవారు. ప్రతి సెలవులకీ వాళ్లని చూడటానికి వచ్చేదాన్ని. అమెరికా సౌకర్యాలతో పోలిస్తే.. పల్లె వాతావరణం భిన్నంగా అనిపించేది. నాకోసం నాన్నమ్మ చాలా వంటకాలు చేసి పెడుతుండేది. వాటిని దాచాలంటే రిఫ్రిజిరేటర్‌ ఉన్నా.. కరెంట్‌ ఉండేది కాదు. దాంతో అవి పాడయ్యేవి. అంతేనా.. విద్యుత్‌ లేకపోవడం వల్ల చదువులు మానేసిన చాలా మంది పిల్లల్ని చూశా. ఒక్క ఊరిలోనే ఇంతమంది ఉంటే దేశవ్యాప్తంగా ఇంకెంతమంది ఉంటారో అనుకున్నా. అప్పటికే నేను యూఎస్‌ ఇండియా కమ్యూనిటీలో చురుగ్గా వ్యవహరించేదాన్ని. అక్కడి వాళ్లతో ఈ సమస్య చెబితే చాలామంది తమ ఆలోచనలూ, సలహాలు చెప్పారు. వాటిల్లో నాకు సౌరవిద్యుత్‌తో చెప్పిన పరిష్కారం నచ్చింది. 2018లో మేము హైదరాబాద్‌ వచ్చేశాం. అమ్మానాన్నలు ఐటీ వ్యాపారం మొదలుపెట్టారు. ఇంతలోనే కొవిడ్‌ వచ్చి పరిస్థితులు అతలాకుతలం అయ్యాయి. ముఖ్యంగా తోడులేని పెద్దవాళ్ల పరిస్థితి బాధనిపించింది. వాళ్లకోసం ‘కేర్‌ ఫర్‌ నీడ్‌’ సంస్థను స్థాపించి వృద్ధులకు మందులు అందించేదాన్ని. ఇందుకోసం తెలిసిన వాళ్ల నుంచి నిధులు సేకరించేదాన్ని.

గ్రామీణ విద్యార్థులకోసం

లాక్‌డౌన్‌ సమయంలో.. ఆన్‌లైన్లో సౌరవిద్యుత్‌, లైట్ల తయారీకి సంబంధించిన తరగతుల్లో చేరి మూడు నెలలు శిక్షణ తీసుకున్నా. 2019 నుంచి తెలిసిన గ్రామాలకు వెళ్లి నేను తయారు చేసిన లైట్లను పిల్లలకు అందించేదాన్ని. కానీ ఎక్కువ గ్రామాలకు ఇవ్వాలంటే నా దగ్గరున్న డబ్బులు సరిపోవు. అందుకే సీఎస్‌ఆర్‌ ఫండ్స్‌ కోసం ప్రయత్నించా. కానీ నన్ను నమ్మి ఏ సంస్థలు ముందుకొస్తాయి. అందుకే నాకంటూ ఓ గుర్తింపుకోసం ప్రయత్నించా. అమ్మానాన్నలు వ్యాపారంలో ఉండటం వల్లనేమో.. నాకూ చదువైన తర్వాత ఇదే రంగంలోకి అడుగుపెట్టాలని కోరిక. అప్పుడే తెలంగాణా టీహబ్‌ అనుసంధానంతో నెక్స్ట్‌ఇన్‌ అనే అంకుర సంస్థని ప్రారంభించా. 14 నుంచి 18 ఏళ్ల వయసు వారందరికీ ఉపయోగపడే వేదిక ఇది. వ్యాపారం చేయాలనే ఆసక్తి ఉండీ, అందుకు తగిన వనరులు గురించి తెలియక సతమతమయ్యేవారి కోసం ఈ అంకురాన్ని ప్రారంభించా. టీనేజీ యువత వాళ్ల ఆసక్తులు చెబితే.. అవకాశాలు, పెట్టుబడులు, పొదుపు లాంటి అంశాలను తెలియజేస్తా. మా స్టార్టప్‌లో ఆరుగురు సభ్యులున్నాం. మరోవైపు మేము సోలెడ్‌ పేరుతో ‘స్వరాజ్‌ ఎనర్జీ’ నుంచి సోలార్‌ ఉత్పత్తులను తీసుకుని పంపిణీపై దృష్టి పెట్టాం. తర్వాత ఈ తయారీ నైపుణ్యాలని మా వాలంటీర్లకి నేర్పించాం. మేమంతా వారాంతంలో ఒక గ్రామాన్ని సందర్శించి అక్కడ పిల్లలకు సౌర విద్యుత్‌ పాఠాలు చెప్పి లైట్లను అందిస్తున్నాం. ఇంతవరకూ ఏడు గ్రామాల్లోని వెయ్యిమంది పిల్లలకు వీటిని అందించాం. మా నెక్స్ట్‌ఇన్‌ అంకుర సంస్థ నుంచి ఫీజుల ద్వారా వచ్చిన ఆదాయాన్నీ, సీఎస్‌ఆర్‌ నిధుల్నీ ఈ సోలెడ్‌ ప్రాజెక్టుకు వెచ్చిస్తున్నాం. గ్రామీణ ప్రాంతంలో ఏ విద్యార్థీ విద్యుత్‌ లేని కారణంతో చదువుకు దూరం కాకూడదన్నదే నా లక్ష్యం. గతేడాది డిసెంబర్లో యూఎన్‌ సదస్సుల వేదికగా సోలెడ్‌ ప్రాజెక్టును ప్రస్తావించే అవకాశం వచ్చింది. మా ఆలోచన నచ్చడంతో యునిసెఫ్‌ మాకు ఆర్థిక సాయం చేయడానికి ముందుకొచ్చింది. దీనివల్ల ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు ఈ సౌర వెలుగులు అందుతాయి. మొదట విడతగా అరుణాచల్‌ప్రదేశ్‌లోని కొన్ని గ్రామాలను ఎంపిక చేసుకుని వారికి ఈ సౌరదీపాలు ఇవ్వాలనుకుంటున్నాం. ప్రస్తుతం నేను ఐఎస్‌హెచ్‌లో.. ఐబీ చదువుతున్నా. భవిష్యత్తులో సామాజిక ప్రయోజనాలుండే వ్యాపారాన్ని మొదలుపెట్టాలన్నది నా కోరిక.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని