Chandrayaan 3: జాబిల్లి యాత్రలో మన కల్పన!

క్షణ క్షణ ఉత్కంఠ.. ఆ సేతుహిమాచలమే కాదు యావత్‌ ప్రపంచం మనవైపు ఆతృతగా చూసిన అపురూప క్షణాలివి. చంద్రయాన్‌-3లో అసోసియేట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా కీలక పాత్ర పోషించి.. తెలుగు మహిళల సత్తా చాటారు కల్పనా కాళహస్తి.

Updated : 24 Aug 2023 07:32 IST

క్షణ క్షణ ఉత్కంఠ.. ఆ సేతుహిమాచలమే కాదు యావత్‌ ప్రపంచం మనవైపు ఆతృతగా చూసిన అపురూప క్షణాలివి. చంద్రయాన్‌-3లో అసోసియేట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా కీలక పాత్ర పోషించి.. తెలుగు మహిళల సత్తా చాటారు కల్పనా కాళహస్తి. ఈ సందర్భంగా వసుంధరతో ప్రత్యేకంగా మాట్లాడారామె...

చంద్రయాన్‌-3 అనుకున్నట్టుగా విజయాన్ని సాధిస్తుందా? మనం పంపిన ఉపగ్రహం క్షేమంగా జాబిల్లిని చేరుతుందా అని..  ఎంత టెన్షన్‌ పడ్డాం! మనకే ఇలా ఉంటే ఈ ప్రాజెక్ట్‌ని ముందుండి నడిపించిన శాస్త్రవేత్తల పరిస్థితి ఎలా ఉంటుంది. ‘అది నిజమే ఈ లక్ష్యం కోసం పగలూ, రాత్రీ చూడకుండా.. సమయాన్ని పట్టించుకోకుండా పనిచేశాం’ అంటున్నారు కల్పన. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పుత్తూరు మండలంలో ఉన్న తడుకు ఆమె స్వస్థలం. తండ్రి మునిరత్నం. ఆయన చెన్నై హైకోర్టులో అధికారిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. తల్లి ఇందిర. కల్పన విద్యాభ్యాసం అంతా చెన్నైలోనే జరిగింది. మద్రాసు విశ్వవిద్యాలయంలో బీటెక్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌లో ఇంజినీరింగ్‌ చదివారు. ‘భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో ఉద్యోగం చేయాలన్నది నా చిన్ననాటి కల. బీటెక్‌ ఈసీఈ పూర్తయిన వెంటనే ప్రయత్నాలు మొదలుపెట్టా. 2000లో ఇస్రో నుంచి ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ వెలువడటం.. ఇంజినీర్‌గా ఎంపికవ్వడం చకచకా జరిగిపోయాయి. సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లో రాడార్‌ ఇంజినీర్‌గా విధుల్లో చేరా. అక్కడే ఐదేళ్లపాటు పనిచేశా. 2005లో బెంగళూరులోని యూఆర్‌ రావు శాటిలైట్‌ సెంటర్‌కు బదిలీ అయ్యా. అక్కడ ఉపగ్రహ సిస్టమ్స్‌ ఇంజినీర్‌గా శాటిలైట్‌ భవనంలో విధుల్లో చేరా. ప్రస్తుతం అసోసియేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌గా పని చేస్తున్నా’ అంటూ తన ఉద్యోగ ప్రస్థానం గురించి వివరించారు.


యాత్ర కోసం..

చంద్రయాన్‌-2 ప్రాజెక్టు సహా పలు కీలక ప్రాజెక్టులో కల్పన తన సేవలు అందించారు. ప్రస్తుత చంద్రయాన్‌-3 ప్రాజెక్టులో అసోసియేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌గా వ్యవహరించారు. సాధారణంగా ఒక్కో ఉపగ్రహం తయారీకి ఐదేళ్లకు పైగా పడుతుంది. డిజైన్‌ చేయడం, హార్డ్‌వేర్‌ తయారీ తర్వాత ఉపగ్రహానికి పలు రకాల పరీక్షలు నిర్వహించాక షార్‌కు తీసుకొస్తారు. ఇక్కడ కూడా కొన్ని పరీక్షలు చేసి రాకెట్‌ సాయంతో నింగిలోకి పంపుతారు. ‘ఈ రోజున్న సవాల్‌ మరుసటి రోజు ఉండేది కాదు. మరో కొత్త సవాల్‌ మా కోసం ఎదురుచూస్తుండేది. వాటికి పరిష్కారం కావాలంటే ఎంతో అంకితభావంతో పని చేయాల్సి ఉంటుంది. అందుకే గడియారం చూసుకోకుండా... ఒక్కోసారి 14 గంటల వరకూ పనిచేసిన రోజులున్నాయి. పని పూర్తయ్యాకనే కార్యాలయం నుంచి బయటకు వెళ్లే వాళ్లం’ అంటారు కల్పన.


మహిళలకు అనుకూలమే..

వతరం అమ్మాయిలు సైన్స్‌ రంగాల వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఎంతో ఉందనే కల్పన.. మహిళలు విధులు నిర్వహించడానికి ఇస్రోలో అనుకూలమైన వాతావరణం ఉందంటున్నారు. ‘ఇక్కడ  లింగ వివక్ష ఉండదు. పని, సామర్థ్యం ఆధారంగానే గుర్తింపు లభిస్తుంది. 1990లో మహిళా ఉద్యోగుల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు. మహిళలకు సమాన అవకాశాలు దొరుకుతున్నాయి. ప్రస్తుతం 24 శాతం మంది మహిళలు సాంకేతిక విభాగాల్లో ఉన్నారు. ఈ ప్రాజెక్ట్‌ సమయంలో వాళ్లకి క్షణం కూడా తీరిక లేద’నే కల్పన తన సేవలకిగానూ దిల్లీ కమిషన్‌ నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా పురస్కారం
అందుకున్నారు.

- కల్లిపూడి దేవేంద్రరెడ్డి, శ్రీహరికోట


ఆహ్వానం

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని