అమ్మకోసం..సింహనందిని!

పూర్వం దేవాలయాల్లో దేవదాసీలు చేసే ప్రత్యేక నృత్యాలు మనలో ఎవరికైనా తెలుసా? ఇలాంటి ఎన్నో సంప్రదాయ కళలు అంతరించిపోతున్నాయి.

Published : 24 Aug 2023 01:59 IST

పూర్వం దేవాలయాల్లో దేవదాసీలు చేసే ప్రత్యేక నృత్యాలు మనలో ఎవరికైనా తెలుసా? ఇలాంటి ఎన్నో సంప్రదాయ కళలు అంతరించిపోతున్నాయి. ఇప్పటితరానికి డాన్స్‌ అంటే సామాజిక మాధ్యమాల్లో చేసే స్టెప్పులే...  అదే మార్చాలనుకున్నారు బెస్త దేవీశ్రీ. అపురూపమైన సింహనందినీ అద్భుతంగా చేసే దేవీశ్రీ ఈ కళని ఎలా బతికించారో చూద్దాం..

మ్మకి నాట్యమంటే ప్రాణం. కానీ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆ కోరికను చంపుకొంది. నా ద్వారా నేరవేర్చుకోవాలనుకుంది. మాది కర్నూలు పక్కన తాండ్రపాడు. నాన్న రామలింగం ప్రైవేటు ఉద్యోగి. అమ్మ నాగమల్లేశ్వరమ్మ సంగీత శిక్షకురాలు. అన్నయ్య చంద్రకాంత్‌ ఫిజియోథెరపిస్ట్‌. నాకు ఐదేళ్లు ఉన్నప్పుడే నారాయణ స్వామి గురువు దగ్గర కూచిపూడి నేర్చుకోవడానికి చేర్చారు. 14 ఏళ్లకే శారదా సంగీత, నృత్య ప్రభుత్వ కళాశాలలో సర్టిఫికేషన్‌ పూర్తిచేశాను. తర్వాత రెండేళ్లకు డిప్లొమా కూడా అయ్యింది. ఊహ తెలిశాక ఈ రంగంలో నాకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవాలనుకున్నా. నృత్యం అందరూ చేస్తారు. నేనూ అదే చేస్తే ఎంత మంది ఆదరిస్తారు. అప్పుడే యూట్యూబ్‌లో సింహనందిని నృత్యం వీడియోను చూశాను. అది నన్ను చాలా ప్రభావితం చేసింది. అసలు ఆ కళేంటి. దాన్ని ఎప్పుడు, ఎవరు చేసేవారు? ఇప్పుడెందుకు వెనుకబడిందో తెలుసుకోవడం మొదలుపెట్టాను. ఆ క్రమంలోనే మన దేశంలో అంతరించిపోతున్న కళలు ఎన్నో పరిచయమయ్యాయి. ఈ సింహనందిని నృత్యాన్ని నేర్చుకోవాలనుకున్నా. యూట్యూబ్‌ సాయంతో రెండు నెలల్లో దీనిలో మెలకువలన్నీ తెలుసుకున్నా.

దేవాలయాల్లోనే..

షోడశోపచారాల్లో నృత్యం ఒకటి. కానీ ఇప్పుడు దీన్ని వ్యాపారం చేసేశారు. నేను అటువైపు వెళ్లకూడదనుకున్నా. అందుకే పోటీలు, బహుమతుల గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని దేవాలయాల్లో వివిధ సందర్భాల్లో నాట్యం చేశాను. తిరుపతి మాడవీధుల్లో నాట్యం చేయడం మరచిపోలేని అనుభూతి. 2019 గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎర్రకోట దగ్గర ఈ కళను ప్రదర్శించే అవకాశం దక్కింది. సింహనందిని నృత్యమంటే.. కూచిపూడి చేస్తూనే ముగ్గు, వస్త్రం ఉపయోగించి దుర్గాదేవి వాహనమైన సింహాన్ని కాలివేలితో గీయడం నేను ఐదు నిమిషాల్లో పూర్తి చేయగలను.. పూర్వం ఆలయాల్లో ఉత్సవాలు జరిగేటప్పుడు ఈ నృత్యాల్ని ప్రదర్శించాకే మిగతా కార్యక్రమాలు ప్రారంభించేవారు. రానురానూ ఇది అంతరించింది. ఇలాంటి భంగిమలన్నీ నేర్చుకుని ఈ కళలను కాపాడాలన్న లక్ష్యంతో సాగిపోతున్నా. ప్రస్తుతం 50 మంది విద్యార్థులు నా దగ్గర శిక్షణ తీసుకుంటున్నారు. అందులో 20 మందికి ఉచితంగా నేర్పిస్తున్నా. స్కూల్లో ఉండే ఒత్తిడి నుంచి నృత్యం ఉపశమనం ఇస్తుంది అని పిల్లలు చెబితే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఫిజియోథెరపీని పూర్తిచేశాను. ప్రస్తుతం విజయవాడలోని కూచిపూడి గ్రామంలో కూచిపూడిలో మాస్టర్స్‌ చదువుతున్నా.

- పిల్లనగోయిన రాజు, ఈజేఎస్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని