చెత్తబుట్టల్లోవి తిని ఆకలి తీర్చుకొనేదాన్ని...

ఆరేళ్ల వయసంటే.. పిల్లలు అమ్మ కొంగు పట్టుకొని, నాన్నతో గారాలు పోతుంటారు. కానీ లిలిమా ఖాన్‌కి అలాంటి బంగారు బాల్యం దొరకలేదు. చెత్తకుప్పల్లో ఏరుకుని కడుపు నింపుకొనేది. అలాంటి అమ్మాయి మాస్టర్‌ చెఫ్‌ స్థాయికి చేరిందంటే ఆశ్చర్యమే కదా! ఇదంతా ఎలా సాధ్యమైందో ఆమె మాటల్లోనే...

Updated : 27 Aug 2023 07:39 IST

ఆరేళ్ల వయసంటే.. పిల్లలు అమ్మ కొంగు పట్టుకొని, నాన్నతో గారాలు పోతుంటారు. కానీ లిలిమా ఖాన్‌కి అలాంటి బంగారు బాల్యం దొరకలేదు. చెత్తకుప్పల్లో ఏరుకుని కడుపు నింపుకొనేది. అలాంటి అమ్మాయి మాస్టర్‌ చెఫ్‌ స్థాయికి చేరిందంటే ఆశ్చర్యమే కదా! ఇదంతా ఎలా సాధ్యమైందో ఆమె మాటల్లోనే...

మాది దిల్లీలోని తైమూర్‌ నగర్‌. అమ్మానాన్న, అక్క, అన్నయ్య, తమ్ముళ్లతో ఇల్లు సందడిగా ఉండేది. నాకు అయిదేళ్లున్నప్పుడు నాన్న అనారోగ్యంతో చనిపోయారు. ఆ బెంగతో అమ్మా కన్ను మూసింది. కాపురంలో కలహాలు రావడంతో అక్క ఆత్మహత్య చేసుకొంది. అన్నయ్య డ్రగ్స్‌కు అలవాటుపడి, ఇల్లు అమ్మేసి ఎటో వెళ్లిపోయాడు. తమ్ముడు, నేను అనాథలమయ్యాం. అక్కడి మురికివాడలో ఓ కుటుంబం మమ్మల్ని చేరదీసింది. వాళ్లతోపాటు 4 గంటలకు నిద్రలేచి చెత్త ఏరి ఇస్తే ఒక పూట రోటీ పెట్టేవారు. చెత్త దొరకని రోజు పస్తులే.

ఆకలికి ఆగలేక...

కొన్నిరోజులకి మా బంధువొకామె నన్నొదిలి, తమ్ముడిని తనతో తీసుకెళ్లింది. తనైనా బాగుంటాడు కదా అనుకున్నా. స్కూల్‌కెళ్లే పిల్లలను చూసినప్పుడల్లా అమ్మానాన్న ఉంటే నన్నూ చదివించేవారు కదా అనిపించేది. రాత్రుళ్లు చెత్త బ్యాగుల వెనుక ఎవరికీ కనిపించకుండా పడుకొనేదాన్ని. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అన్న భయంతో ఎన్నో రాత్రుళ్లు నిద్రలేకుండా గడిపా. ఒంటరిగా, భయంతో ఎన్ని రోజులిలా అని ఏడ్చేదాన్ని. చెత్త దొరకని రోజు నాకు రొట్టె ఉండదు. ఆకలికి తట్టుకోలేకపోయేదాన్ని. దిల్లీ డిఫెన్స్‌ కాలనీలోని డస్ట్‌బిన్‌లు వెతికి ఏదైనా దొరికితే తినేదాన్ని. లేదంటే పస్తులే. అలా రెండేళ్లు గడిచాయి.

పనిలో పెట్టింది..

నా 11 ఏళ్ల వయసులో ఓ ఎన్జీవో నాలాంటి వారందరినీ దగ్గరకు తీసుకొంది. కడుపు నిండా భోజనం, చదువు దొరుకుతాయని తెలిసి సంబరపడిపోయా. అప్పటివరకు స్కూల్‌కెళ్లని నేను  ఐదో తరగతిలో చేరా. ఆ సంతోషం రెండేళ్లే. మా అత్త వచ్చి నన్ను చదివిస్తానని చెప్పి ఎన్జీవోతో మాట్లాడి తనవెంట తీసుకెళ్లింది. తీరా ఓ షూ ఫ్యాక్టరీలో నెలకు రూ.2వేలు జీతానికి కుదిర్చింది. మా తమ్ముడు నా పరిస్థితి గుర్తించి, దగ్గర్లోని ‘కిల్కరి రెయిన్‌బో హోం’కు సమాచారాన్నిచ్చాడు. అలా నా జీవితం మరో మలుపు తిరిగింది.

లక్ష్యంతో..

ఆ హోంలోనే  ప్లస్‌టూ పాసయ్యా. ఒక ఛారిటబుల్‌ ఆర్గనైజేషన్‌ మా హోంకు వచ్చి, పిల్లలందరినీ లక్ష్యాలేంటని అడుగుతుంటే నేను చెఫ్‌నవుతా అన్నా. మా నాన్న బాగా వండేవారు. అందుకే అదే నా కల అయ్యింది. మూడేళ్లు కష్టపడి వివిధ దేశాల వంటకాలన్నీ నేర్చుకున్నా. ఎన్నో ప్రముఖ రెస్టారెంట్లు చెఫ్‌గా అవకాశం ఇచ్చాయి. ప్రస్తుతం ‘డియర్‌ డోనా’ హెడ్‌ చెఫ్‌గా, 35 మంది టీంతో కలిసి పనిచేస్తున్నా. సొంత ఇల్లు కొనుక్కున్నా. లక్ష్యం సాధించాలనే పట్టుదల ఉంటే ఎప్పటికైనా మనల్ని మనం నిరూపించుకోగలం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని