చీకట్లు దాటి.. మెరిశారు!

ఒకటి అంధత్వమైతే.. రెండోది పేదరికం! అయినా బెదిరిపోలేదు. ఆత్మవిశ్వాస దీపాలు వెలిగించుకున్నారు. ఆ చీకట్లను చీలుస్తూ తారకలై మెరుస్తున్నారు. జాతీయ అంధుల క్రికెట్‌ జట్టులో సభ్యులై ప్రపంచ పోటీల్లో పసిడి పతకాన్ని సాధించిన బంగారు తల్లులు సత్యవతి, రవణి, సంధ్యల గాథ ఇది..

Updated : 29 Aug 2023 06:54 IST

ఒకటి అంధత్వమైతే.. రెండోది పేదరికం! అయినా బెదిరిపోలేదు. ఆత్మవిశ్వాస దీపాలు వెలిగించుకున్నారు. ఆ చీకట్లను చీలుస్తూ తారకలై మెరుస్తున్నారు. జాతీయ అంధుల క్రికెట్‌ జట్టులో సభ్యులై ప్రపంచ పోటీల్లో పసిడి పతకాన్ని సాధించిన బంగారు తల్లులు సత్యవతి, రవణి, సంధ్యల గాథ ఇది..

ఆంధ్రా జట్టు సారథి

మాగుపల్లి సత్యవతిది శ్రీకాకుళం జిల్లాలోని జీరుపాలెమనే మత్స్యకార గ్రామం. నాన్న లక్ష్మణ జాలరి. అమ్మ పోలమ్మ ఊరూరా తిరిగి చేపలమ్ముతారు. చిన్నప్పట్నుంచే సత్యవతికి చూపు సమస్య. శస్త్ర చికిత్స చేయిస్తే పాక్షికంగా (40% వైకల్యం) కనిపిస్తుంది. బాగా చదువుకుని అమ్మానాన్నకు అండగా నిలవాలన్నది తన కల. విశాఖపట్నం అంధబాలికల పాఠశాలలో పది, ఏఎస్‌ రాజా కళాశాలలో ఇంటర్‌ పూర్తిచేసింది. వెయిట్‌ లిఫ్టింగ్‌లోనూ శిక్షణ పొందింది. రాష్ట్ర, జాతీయ పతకాలను సాధించింది. మూడేళ్ల క్రితం కళాశాల కార్యక్రమానికి వచ్చిన అప్పటి జాతీయ అంధుల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ అజయ్‌రెడ్డి స్ఫూర్తి కలిగించారు. శిక్షణ తీసుకొని ఆంధ్రా మహిళా క్రికెట్‌ జట్టుకి కెప్టెన్‌ అయ్యింది. తర్వాత కీపర్‌గా భారత జట్టులో స్థానం సాధించింది. చినజీయర్‌ స్వామి నేత్రవిద్యాలయంలో ఉంటూ బీఏ ఆఖరి ఏడాది చదువుతోంది.

అథ్లెట్‌ కూడా!

వలసనైని రవణిది అల్లూరి జిల్లాలోని రంగసింగపాడు అనే గిరిజన గ్రామం. అమ్మానాన్న చిట్టెమ్మ, గోపాలకృష్ణ రైతు కూలీలు. అయిదుగురు పిల్లల్లో ముగ్గురు అంధులే. రవణికి పుట్టుకతోనే అంధత్వం. తన కాళ్లపై తను నిలబడుతుందని అంధుల పాఠశాలలో చేర్పించారు. ఈమె అథ్లెట్‌ కూడా. రన్నింగ్‌లో పతకాలూ సాధించింది. 2017లో మంగమారిపేట నేత్రవిద్యాలయంలో చేరాక క్రికెట్‌పై ఆసక్తి కలిగింది. శిక్షణతో ఆల్‌రౌండర్‌గా ఎదిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఇంటర్‌ చదువుతోన్న ఈమె మూడు అంతర్జాతీయ మ్యాచ్‌లూ ఆడింది. తాజా పోటీల్లో ఉత్తమ ఇన్నింగ్స్‌ ఆడి, జట్టు గెలుపులో పాత్ర పోషించింది.

ఆరు గంటల సాధన

భారత జట్టులో స్లోబౌలర్‌గా చోటు సంపాదించిన కిల్లాక సంధ్య ఎనిమిదో తరగతి విద్యార్థిని. ఈమెది పార్వతీపురం మన్యం జిల్లాలోని బాతుగొడబ గిరిజన తండా. అమ్మానాన్న కామి, పెంటయ్య వ్యవసాయ కూలీలు. నలుగురు పిల్లల్లో ఈమె చిన్నది. ఉచిత చదువు, బస దొరుకుతాయని అంధ పాఠశాలలో చేర్చారు. 2017లో నేత్రవిద్యాలయంలో చేరినపుడు అంధుల క్రికెట్‌ గురించి తెలిసింది. దేశానికి ప్రాతినిధ్యం వహించొచ్చని రోజుకు ఆరుగంటలు సాధనకే కేటాయించేది. మూడేళ్లలో బౌలర్‌గా జాతీయ జట్టుకి ఎంపికయ్యింది. మూడు అంతర్జాతీయ మ్యాచ్‌లూ ఆడింది.

ఎలా ఆడతారు?

అంధుల క్రికెట్‌ది దశాబ్దాల చరిత్ర. దీనికోసం ప్రత్యేకంగా వరల్డ్‌ బ్లైండ్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ కూడా ఏర్పాటైంది. నాలుగేళ్లకోసారి వరల్డ్‌కప్‌లూ నిర్వహిస్తారు. మామూలు క్రికెట్‌తో పోలిస్తే దీనికి కొన్ని ప్రత్యేక నియమాలు ఉంటాయి. పూర్తి అంధత్వం, 70%, 40% చూపు కనిపించని వారు పాల్గొనవచ్చు. బౌలర్‌ బంతి వేసేముందు ‘రెడీ’ అనీ, వేశాక ‘ప్లే’ అనీ చెబుతుంటారు. అంపైర్‌ కూడా ఇక్కడ నోటితో ‘నో బాల్‌’, ‘అవుట్‌’ వంటివి చెబుతారు. గ్రౌండ్‌ కూడా ప్రత్యేకంగా ఉంటుంది. తాజాగా బర్మింగ్‌హామ్‌లో ఇంటర్నేషనల్‌ బ్లైండ్‌ స్పోర్ట్స్‌ ఫెడరేషన్‌ ప్రపంచ అంధుల క్రీడలను నిర్వహించింది. వీటిల్లో తొలిసారిగా క్రికెట్‌ను చేర్చింది. మహిళల విభాగంలో భారత జట్టు విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. దానిలో మన అమ్మాయిల విజయాలను చూసి ఒకప్పుడు జాలిపడిన వారే ఇప్పుడు మా ఊళ్లకి గర్వకారణంగా నిలిచారని సంబరాలు చేసుకుంటున్నారు.

వాసుపల్లి వెంకట్‌, విశాఖపట్నం

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని