చిన్న ఆలోచన.. కోట్లు తెచ్చిపెడుతోంది!

ఎన్నో సలహాలు.. సంప్రదింపుల తర్వాత కోర్సులో చేరతాం. తీరా దానికి ఉద్యోగాలే రావంటే ఎంత బాధ? భవిష్యత్తేంటన్న భయం పుట్టుకొస్తుంది కదూ! సెరీన్‌కీ అదే పరిస్థితి ఎదురైంది. భయపడకుండా ఏం చేద్దామని ఆలోచిస్తున్న తనకు ఓ బుల్లి ఐడియా తట్టింది. ఇలా అమల్లో పెట్టిందో లేదో కోటీశ్వరురాలైంది.

Updated : 31 Aug 2023 07:12 IST

ఎన్నో సలహాలు.. సంప్రదింపుల తర్వాత కోర్సులో చేరతాం. తీరా దానికి ఉద్యోగాలే రావంటే ఎంత బాధ? భవిష్యత్తేంటన్న భయం పుట్టుకొస్తుంది కదూ! సెరీన్‌కీ అదే పరిస్థితి ఎదురైంది. భయపడకుండా ఏం చేద్దామని ఆలోచిస్తున్న తనకు ఓ బుల్లి ఐడియా తట్టింది. ఇలా అమల్లో పెట్టిందో లేదో కోటీశ్వరురాలైంది.

సోషల్‌ మీడియా మార్కెటింగ్‌.. పెద్ద సంస్థలు సైతం అనుసరిస్తున్న మార్గం. ఈ బాటలోనే నడిచి తన ఆలోచనను విజయవంతమైన స్టార్టప్‌గా మలిచింది సెరీన్‌ లిమ్‌. ఈమెది ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌. ఎన్నో ఆశలతో న్యూట్రిషన్‌ సైన్స్‌లో డిగ్రీ పూర్తిచేసింది. ఇంకొన్ని రోజుల్లో జాబ్‌ మార్కెట్‌లోకి అడుగు పెడుతుందనగా ఆ రంగంలో తగిన అవకాశాలు లేవు. ఏళ్ల చదువు వృథా అయ్యింది అనిపించిందామెకు. అలా బాధ పడుతూ కూర్చోవడమూ దండగేనని మేనేజ్‌మెంట్‌ కోర్సు చేద్దామనుకుంది. దాంతో ఏదైనా వ్యాపారం చేయొచ్చన్నది తన ఆలోచన. చదువు పూర్తయ్యేదాకా కూర్చోకుండా భవిష్యత్తు గురించీ ఆలోచించాలనుకుంది. అలా వెదికే క్రమంలో ఆమెకు నెయిల్‌ స్టిక్కర్స్‌ కనిపించాయి. అవి ఆమెకు చాలా నచ్చాయి. ఆస్ట్రేలియా మార్కెట్‌లోకి అవి ఇంకా రాకపోవడం గ్రహించి తనే పరిచయం చేయాలనుకుంది.

‘ఫ్యాషన్‌లో భాగంగా గోళ్ల మీద డిజైన్లు వేయించుకోవడం ఇప్పుడు మామూలైపోయింది. నేనూ వేయించుకుంటా. కాకపోతే గంటలకొద్దీ బ్యూటీ సెలూన్లలో కూర్చోవాలి. వాటిని తీసేటప్పుడూ సమస్యే. గోళ్లు పొరలుగా ఊడతాయి, పొడిబారతాయి. వీటితో ఆ సమస్య ఉండదు. జెల్‌తో తయారు చేసిన ఈ స్టిక్కర్‌ వేసి, యూవీ/ఎల్‌ఈడీ లైట్‌ కింద నిమిషం ఉంచితే చాలు. కోరుకున్న డిజైన్‌ వచ్చేస్తుంది. రెండు వారాలు ఉంటుంది. తొలగించడమూ సులువే’ అనే 28 ఏళ్ల సెరీన్‌ దీనిపై మూడు నెలలు పరిశోధన చేసి, ఉత్సాహంగా తన వ్యాపార ఆలోచనను ఇంట్లో చెప్పింది. వాళ్లేమో అప్పులు తప్ప మరేమీ మిగలవంటూ నిరుత్సాహ పరిచారు. సెరీన్‌ మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.

‘జెల్లే’ పేరుతో గత నవంబరులో ఉత్పత్తులను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. తన పాకెట్‌ మనీ రూ.2.6 లక్షలే పెట్టుబడి. ఈ స్టిక్కర్లు వేసుకునే విధానాన్ని ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా, టిక్‌టాక్‌లో వీడియోలుగా పెట్టింది. అవి చూసిన చాలామంది అమ్మాయిలు ఆ ఉత్పత్తులను కొనడం మొదలుపెట్టారు. మార్కెట్‌లో తన బ్రాండ్‌కి గుర్తింపూ వచ్చింది. వ్యాపారం నెలకు రూ.80 లక్షలకు పైమాటే. ఇప్పుడీమె కథ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ‘విజయం సాధించాలా.. మొదటి అడుగేసే ధైర్యం చేయండి చాలు. సందేహాలొస్తే అనుభవమున్న వారిని కలవండి. మనం సందేహిస్తాం కానీ.. వాళ్లెప్పుడూ సాయానికి ముందుంటారు. అవకాశాల్లేవని కూర్చోక వీటిని అనుసరించండి’ అంటూ హితవూ పలుకుతోంది. అవరోధం వచ్చిందని భయపడుతూ ఆగకుండా.. చిన్న ఆలోచనతో ఈమె ఎదిగిన తీరు ఆదర్శమేగా మరి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని