అన్నగారి రూపం.. ఆనందాన్నిచ్చింది!

చిన్నప్పుడు పలకపై వేసిన బొమ్మలే.. ఆమెని నాణాల రూపశిల్పిగా వినూత్నమైన కెరియర్‌వైపు అడుగులు వేయించాయి. ఎన్టీఆర్‌ శత జయంతి సందర్భంగా కేంద్ర ఆర్థికశాఖ రూపొందించిన వంద రూపాయల స్మారక నాణాన్ని చూసే ఉంటారు కదా! ఈ ప్రాజెక్టులో కీలకపాత్ర పోషించి తెలుగువారి మనసు దోచుకున్న ఆ అమ్మాయి మరెవరో కాదు పడాల నాగశైలరెడ్డి.

Updated : 01 Sep 2023 08:08 IST

చిన్నప్పుడు పలకపై వేసిన బొమ్మలే.. ఆమెని నాణాల రూపశిల్పిగా వినూత్నమైన కెరియర్‌వైపు అడుగులు వేయించాయి. ఎన్టీఆర్‌ శత జయంతి సందర్భంగా కేంద్ర ఆర్థికశాఖ రూపొందించిన వంద రూపాయల స్మారక నాణాన్ని చూసే ఉంటారు కదా! ఈ ప్రాజెక్టులో కీలకపాత్ర పోషించి తెలుగువారి మనసు దోచుకున్న ఆ అమ్మాయి మరెవరో కాదు పడాల నాగశైలరెడ్డి. వసుంధరతో ఆ విశేషాలని పంచుకున్నారామె... 

మా తాతమ్మ సావిత్రమ్మ సరదాగా వేసిన బొమ్మలే నాకు చిత్రకళలో ఓనమాలు నేర్పాయి. మాది తూర్పు గోదావరి జిల్లాలోని కొమరిపాలెం. నాన్న సతీష్‌ రెడ్డి దేవాలయాలకు రంగులు వేసేవారు. అమ్మ శ్రీదేవి. చిన్నప్పుడు పలక, కాగితం ఏది దొరికినా బొమ్మలు గీయాల్సిందే. కాస్త పెద్దయ్యాక ఈనాడులో వచ్చే ‘చుక్కలు కలపండి’, ‘రంగులు వేయండి’ వంటివి కనిపిస్తే వదిలేదాన్ని కాదు. ఏ రంగు వేస్తే బావుంటుందో ఆలోచించేదాన్ని. ఆ సమయంలోనే మా తాతమ్మ గీసిన బొమ్మలు చిరిగిపోయి కనిపించాయి. వాటిని తిరిగి మంచి కాగితాలపై వేయడం మొదలుపెట్టా. ఆ క్రమంలో తాతమ్మ కొన్ని మెలకువలు చెప్పి, ప్రోత్సహించింది. పదో తరగతి వరకూ రాయవరంలోని సాయితేజా విద్యానికేతన్‌లో చదివా. అక్కడ స్కూల్‌డేకి ఏటా ఎవరో ఒక అతిథిని ఆహ్వానించేవారు. అలా వచ్చిన ప్రముఖులకు నాతో బొమ్మలు వేయించి బహుమతులుగా అందించేవారు. సంగీత దర్శకుడు కోటి, కోట శ్రీనివాసరావు వంటివారికి బొమ్మలు వేసి ఇస్తే మెచ్చుకున్నారు. పదో తరగతి తర్వాత వేసవి సెలవుల్లో సత్యానందం మాష్టారు నెల రోజులు కోర్సు పెడితే అందులో చేరా. ఆంధ్రా యూనివర్సిటీలో ఫైన్‌ ఆర్ట్స్‌లో పీజీ చేశా. నిజానికి ముంబయిలోని జేజే స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌లో పీజీ చేయాలన్నది నా కల. కొవిడ్‌ కారణంగా అంతదూరం వెళ్లే అవకాశం రాలేదు. 

ఏంటీ పిచ్చిగీతలన్నారు..

ఇంట్లో అమ్మానాన్న ప్రోత్సహించినా బయటి వాళ్లు మాత్రం ‘ఏమిటీ పిచ్చిగీతలు’ అనే వారు. అవేమీ పట్టించుకోలేదు. ఫైన్‌ ఆర్ట్స్‌లో బొమ్మలు తయారు చేసే కోర్సును ఎంపిక చేసుకున్నా. మట్టి, పీవోపీ, ఫైబర్‌, టెర్రాకోట వంటివాటితో బొమ్మలు తయారు చేస్తా. ఇత్తడి బొమ్మలు పోత పోయటం, వాటితో కళాఖండాలు చేయడం నా ప్రత్యేకత. యూనివర్సిటీలో చదివేటప్పుడే ఆర్‌కే బీచ్‌లో, హవామహల్‌లో ఎగ్జిబిషన్లు నిర్వహించా. ఆస్ట్రేలియా, సింగ్‌పూర్‌, కొలంబియా, పంజాబ్‌ల నుంచి వచ్చి నా చిత్రాలను కొనుగోలు చేసి తీసుకెళ్లేవారు. బియ్యం గింజల మీద పేర్లు, రెండు చేతులతోనూ రాయటం, మెహెందీ పెట్టడం వంటివీ సాధన చేశాను. పీజీ చదువుతున్నప్పుడే నాణాల తయారీ సంస్థలో రూపశిల్పి (ఎంగ్రీవర్‌) పోస్టులు పడ్డాయి. కేవలం మూడు పోస్టులే. దరఖాస్తు చేస్తే చాలా వడపోతల తర్వాత ఉద్యోగం వచ్చింది. జాబ్‌లో చేరాక అధికారుల అనుమతి తీసుకుని పీజీ పూర్తి చేశా. ఉద్యోగంలో చేరి 16 నెలలే అయ్యింది. ఈ కొద్దికాలంలోనే ప్రధాని ప్రారంభించిన టైగర్‌ ప్రాజెక్టు వంటి వాటిల్లో పాల్గొని బృందంతో కలిసి నాణాన్ని తయారుచేసే అవకాశం వచ్చింది. మరో అద్భుతమైన అవకాశం ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాల సందర్భంగా రూపొందించిన స్మారక నాణెం.

సమష్టి కృషితో..

ఈ నాణానికి మార్కెట్లో ఎంతో ఆదరణ వచ్చింది. ఇదంతా మా బృందం సమష్టి కృషితోనే సాధ్యమైంది. ఈ నాణెం తయారీకి సుమారుగా 30 నుంచి 40 రోజులు పట్టింది. తెలుగువారికి అత్యంత ఇష్టమైన వ్యక్తికి సంబంధించిన కాయిన్‌ తయారీ అంటే మామూలు బాధ్యత కాదు కదా! సవాల్‌తో కూడిన పని. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాం. ఎక్కడా రాజీ పడకుండా చేశాం. అనుకున్నట్టుగానే నాణానికి మంచి ఆదరణ రావడంతో.. అందరి నుంచీ అభినందనలు అందుతుంటే పడ్డ శ్రమ అంతా మర్చిపోయా. చాలా సంతోషం అనిపించింది.

- మల్లిడి వెంకట కృష్ణారెడ్డి, బిక్కవోలు


ఆహ్వానం

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని