ఒంటిచేత్తో.. సాధించింది!

చిన్న చిన్న సమస్యలు ఎవరికైనా మామూలే! వాటిని దాటడంలో గొప్పేముంది. పెద్ద అవరోధాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడే గుర్తింపు.. ఈ మాటను చిన్నతనంలోనే నమ్మింది అఖిల. అందరూ జాలి చూపిస్తోంటే.. ఆమె మాత్రం జీవితాన్ని సాధించడంపై దృష్టిపెట్టింది. అంగవైకల్యాన్ని దాటి, ఈ ఏడాది సివిల్స్‌ సాధించి అందరి చేతా శభాష్‌ అనిపించుకున్న తన స్ఫూర్తి ప్రయాణమిది.

Updated : 02 Sep 2023 05:20 IST

చిన్న చిన్న సమస్యలు ఎవరికైనా మామూలే! వాటిని దాటడంలో గొప్పేముంది. పెద్ద అవరోధాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడే గుర్తింపు.. ఈ మాటను చిన్నతనంలోనే నమ్మింది అఖిల. అందరూ జాలి చూపిస్తోంటే.. ఆమె మాత్రం జీవితాన్ని సాధించడంపై దృష్టిపెట్టింది. అంగవైకల్యాన్ని దాటి, ఈ ఏడాది సివిల్స్‌ సాధించి అందరి చేతా శభాష్‌ అనిపించుకున్న తన స్ఫూర్తి ప్రయాణమిది.

యిదేళ్ల వరకూ అందరిలాగే అఖిల కూడా మామూలు అమ్మాయే. అనుకోకుండా బస్సు ప్రమాదానికి గురైంది. ఆ యాక్సిడెంట్‌లో ఆమె కుడిచేయి పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. వెంటనే ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాలు దక్కాయి. కానీ కుడి చేతి భుజం నుంచి కింది వరకు తొలగించాల్సి వచ్చింది. ఈమెది కేరళలోని తిరువనంతపురం. నాన్న బుహారి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. అమ్మ సాజినా బీవీ. ‘అమ్మాయికి ఇలా అయ్యిందే’, ‘పాపం ఇంకేం చేయగలదు’ అంటూ అందరూ ఆమెను చూసి జాలిపడుతోంటే తట్టుకోలేకపోయారు. దీంతో పుణెలోని ఇండియన్‌ ఆర్మీ లింబ్‌ సెంటర్‌లో కృత్రిమ చేయి పెట్టించడానికి తీసుకెళ్లారు. వాళ్లకు వీలుకాక జర్మనీ నుంచి నిపుణులను తీసుకొచ్చినా ప్రయోజనం లేకపోయింది. కూతురి భవిష్యత్తు ఏంటని అమ్మానాన్న డీలాపడటం చూసింది అఖిల.

‘లేని చేయి కోసం అందరూ ఆలోచిస్తున్నారు. మరో చేయి ఉందిగా’ అని  ఆలోచించిందామె. ఎడమచేత్తో రాయడం, పనులు చేయడం మొదలుపెట్టింది. ఆమె పట్టుదల చూసి ఇంట్లో వాళ్లు ప్రోత్సహించడం మొదలుపెట్టారు. ఈమె కష్టపడేతత్వానికి టీచర్లూ సాయపడేవారు. పది, ఇంటర్‌లలో మంచి మార్కులు సాధించి, ఐఐటీ మద్రాస్‌లో ఇంటిగ్రేటెడ్‌ ఎంఏలో చేరింది. అది పూర్తయ్యాక ఓ లెక్చరర్‌ సివిల్స్‌ గురించి చెప్పి, ప్రయత్నించమన్నారు.

‘కలెక్టర్‌ అవుతావా.. సమాజానికి సాయపడొచ్చని మా లెక్చరర్‌ అడిగితే ఆసక్తి కలిగింది. సివిల్స్‌కు సంబంధించిన సమాచారమంతా సేకరిస్తోంటే ఎలాగైనా సాధించాలనిపించింది. ఏడాది బెంగళూరులో శిక్షణ తీసుకొని తిరిగొచ్చా. తర్వాత సొంతంగా సన్నద్ధమయ్యా. మొదటి రెండుసార్లూ ప్రిలిమ్స్‌ సాధించినా మెయిన్స్‌ పోయింది. ఈసారి మూడో ప్రయత్నం.. 760వ ర్యాంకు వచ్చింద’ని ఆనందంగా చెబుతున్న 28 ఏళ్ల అఖిలకు ఇదీ అంత సులువుగా రాలేదు. ‘గంటల తరబడి కూర్చోలేను. సన్నద్ధతప్పుడు సరే! కానీ పరీక్షలో ఏకధాటిగా కూర్చోలేకపోయా. చేయినొప్పి, అలసిపోయేదాన్ని. అయినా లక్ష్యం కోసం పంటి బిగువున కొనసాగించా’నంటోన్న అఖిల.. ఆమెలో లేనిదానికి జాలిపడే వారికి తనలో ఉన్న ఇతర లక్షణాలను చూపించాలని ఉండేదట. అందుకే లక్ష్యాలను ఏర్పరుచుకొని పట్టుదలగా ప్రయత్నించేదాన్నని చెబుతోన్న ఆమె కథ స్ఫూర్తిదాయకమేగా మరి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని