హిమాలయాల్లో.. విదేశీ సైనికురాలు!

దేశానికి పర్యటన కోసం వచ్చిందావిడ. ఇక్కడి అందాలను చూసి ఎంత మురిసి పోయారో.. పేరుకుంటున్న చెత్తను చూసి అంతే బాధపడ్డారు. స్వదేశానికి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయి.. ‘చెత్త సైనికురాలిగా’ మారారు జోడి అండర్‌హిల్‌. అందమైన ప్రదేశాలు పర్యటకులను ఇట్టే ఆకర్షిస్తాయి.

Published : 04 Sep 2023 01:43 IST

దేశానికి పర్యటన కోసం వచ్చిందావిడ. ఇక్కడి అందాలను చూసి ఎంత మురిసి పోయారో.. పేరుకుంటున్న చెత్తను చూసి అంతే బాధపడ్డారు. స్వదేశానికి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయి.. ‘చెత్త సైనికురాలిగా’ మారారు జోడి అండర్‌హిల్‌.

అందమైన ప్రదేశాలు పర్యటకులను ఇట్టే ఆకర్షిస్తాయి. చూసి ఆనందించేసి వెళితే పర్లేదు. కానీ ఆ ప్రదేశాన్ని అంతే అందంగా ఉంచాలన్న బాధ్యత మరుస్తారు. ప్లాస్టిక్‌ కవర్లు, బాటిళ్లు, ఆహార వృథాను ఎక్కడపడితే అక్కడ పడేస్తారు. అవేమో రానురానూ కొండలా పేరుకుపోతాయి. అందరూ అలాగే వదిలేస్తే పర్యావరణానికి హాని కదా! వాటిని తిరిగి శుభ్రంగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకున్నారు జోడి అండర్‌హిల్‌. ఈవిడ బ్రిటిషర్‌. హిమాలయాల అందాలను చూడటానికి భారత్‌కి వచ్చారు. ఆ ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తను చూసి చలించిపోయి పూర్వ స్థితికి తీసుకు రావాలనుకున్నారు. 2008 నుంచి స్థానికులతో మాట్లాడి వాటిని తొలగించే పనిలో పడిన ఆవిడ 2012లో ‘వేస్ట్‌ వారియర్స్‌’ పేరుతో దేహ్రాదూన్‌లో ఎన్‌జీఓని ప్రారంభించారు. ఉత్తరాఖండ్‌ నుంచి హిమాచల్‌ ప్రదేశ్‌ వరకు ఉన్న పర్యటక ప్రాంతాలన్నింట్లో వాలంటీర్లను ఏర్పాటు చేసుకొని శుభ్రత చేపడుతున్నారు. ‘ఏటా ఈ ప్రాంతాల్లో 8.4 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల చెత్త పేరుకుపోతుంది. ఇవి ఆ ప్రాంతాలను అందవిహీనంగా మార్చడమే కాదు.. స్థానికులను అనారోగ్యాల పాలూ చేస్తుంది. ఇంకా ప్రకృతి విపత్తులొచ్చినపుడు ఇలాంటివే సహాయ చర్యలకు అడ్డుపడుతుంటాయి. వీటివల్ల నష్టాలను స్థానికులకు చెప్పి, చైతన్యం కలిగించి చెత్తలేకుండా చూస్తున్నా’మంటారీమె. సేకరించిన వాటిని వేస్ట్‌ బ్యాంకులకు తరలించి మెటీరియల్‌ రికవరీ ఫెసిలిటీస్‌ (ఎంఆర్‌ఎఫ్‌)కు పంపుతారు. తర్వాత వాటిని రీసైకిల్‌ చేస్తారు. అంతేకాదు పర్యటకులకు వచ్చిన ప్రదేశాన్ని తిరిగి అంతే అందంగా ఉంచేలా వేలమంది వారియర్లు అవగాహనా కలిగిస్తున్నారు. ఓ విదేశీ మహిళ.. దశాబ్ద కాలంగా దేశాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నారంటే అభినందించాల్సిందేగా మరి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని