నాన్న.. నేను.. ఏడు పర్వతాలు!

శిఖరం చూస్తే సెకను కూడా ఆగదామె. నాన్న అడుగుజాడల్లో నడుస్తూ ఎత్తైన ఎవరెస్ట్‌తో సహా ఏడు పర్వతాలను ఎక్కేసింది దిల్లీకి చెందిన దియా బజాజ్‌. ఆమె కథే ఇది.

Updated : 06 Sep 2023 05:00 IST

శిఖరం చూస్తే సెకను కూడా ఆగదామె. నాన్న అడుగుజాడల్లో నడుస్తూ ఎత్తైన ఎవరెస్ట్‌తో సహా ఏడు పర్వతాలను ఎక్కేసింది దిల్లీకి చెందిన దియా బజాజ్‌. ఆమె కథే ఇది.

పుట్టి పెరిగిందంతా దిల్లీ. తల్లి షీర్లీ థామస్‌, తండ్రి అజిత్‌ బజాజ్‌ ఉత్తర, దక్షిణ ధృవాల మీదుగా స్కీయింగ్‌ పూర్తి చేసిన తొలి భారతీయుడు. పద్మశ్రీ పురస్కారాన్నీ అందుకున్నారు. ‘నాన్న హిమాలయ పర్వత శ్రేణులకు దగ్గర్లో ఓ సాహస క్రీడల సంస్థను ఏర్పాటు చేశారు. చిన్నప్పుడు ఒక్కరోజు సెలవు దొరికితే చాలు కుటుంబ సభ్యులందరం రాఫ్టింగ్‌, హైకింగ్‌, జిప్‌ లైనింగ్‌ వంటి సాహస క్రీడలకు వెళ్లేవాళ్లం. ఆ అలవాటు, నాన్న సాధించిన విజయాలు, అక్కడికి వచ్చే సాహసికుల ధైర్యం నాకూ పర్వతారోహణపై ఆసక్తి పెంచాయి’ అంటోంది దియా. ఇందుకోసం ఎత్తైన పర్వతాలను అధిరోహించాలనే ఆలోచనతో చిన్నప్పటి నుంచే ప్రణాళికలు వేసుకుంది. పదిహేడేళ్ల వయసులో మొదటిసారి ఐస్‌క్యాప్‌ మీదుగా క్రాస్‌కంట్రీ స్కీయింగ్‌ పూర్తిచేసి ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందింది.

ఇరవై కేజీల బరువు...

దియా అమెరికాలోని వార్టన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియా నుంచి బిజనెస్‌ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్‌ పూర్తి చేసింది. చదువుతున్న సమయంలో మౌంటనీరింగ్‌ చేయడానికి వీలుగా శరీరాన్ని సన్నద్ధం చేసుకునేందుకు ప్రత్యేకంగా ఫిట్‌నెస్‌ శిక్షణ తీసుకుంది. ‘శరీరానికి శ్రమ అందించడం కోసం రోజూ కాలేజీకి ఇరవై కిలోల బరువున్న జాకెట్‌ వేసుకుని నడిచి వెళ్లేదాన్ని. తరగతులయ్యాక 150 మెట్లు ఎక్కి దిగేదాన్ని. స్నేహితులతో కలసి విహారానికి వెళ్లాల్సి వచ్చినప్పుడూ సాహస క్రీడల్నే ఎంచుకునేదాన్ని’ అంటూ గుర్తు చేసుకుంటుంది దియా.

‘నాన్న, నేను కలిసి ఎవరెస్ట్‌, ఎల్బ్రన్‌, కోస్కియుస్కో, కిలిమంజారో, విన్సన్‌, డెనాలి, అకాన్‌కాగువా పర్వతాలను ఎక్కగలిగాం. యాభై ఏళ్లు దాటిన తర్వాత ఎంతో ఉత్సాహంగా ఆయన సాధించగలిగినప్పుడు నేనెందుకు చేయలేనని అనుకునేదాన్ని. ఆ పట్టుదలే నన్ను ముందుకు నడిపించింది. ఇప్పటివరకూ ఒంటరిగా శిఖరాలు అధిరోహించినవారు చాలామందే. కానీ, తండ్రీ, కూతుళ్లం మాత్రం మేమే. పర్వతారోహణ అంత సులువైన పని కాదు. నడుముకి సుమారు ఇరవై కిలోల బరువున్న బ్యాగుని వేలాడదీసుకుని ఎక్కాలి. శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థైర్యమూ ముఖ్యమే. ఎవరెస్ట్‌ పర్వతాన్ని ఎక్కుతున్నప్పుడు ఓ రోజు నన్ను ఆందోళన పరిచే ఓ సంఘటన జరిగింది. శిఖరానికి చేరువలో ఉన్నప్పుడు అనుకోకుండా నాన్న ఆక్సిజన్‌ మాస్క్‌ కిందపడిపోయింది. దాంతో ఆయనకు కొన్ని క్షణాలు ఊపిరి ఆడలేదు. అప్పుడు తోటి పర్వతారోహకులు ఆయన్ని సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్లారు. ఆ సమయంలో నాన్నను అక్కడలా వదిలేయలేను. శిఖరాన్ని జయించే లక్ష్యాన్నీ విడిచిపెట్టలేను. దాంతో ఏం చేయాలో తోచక కొంత సమయం ఉక్కిరిబిక్కిరి అయిపోయా. తర్వాత నాన్న క్షేమంగా ఉన్నారని తెలిసి ప్రాణం లేచొచ్చింది. ఆపై ఇద్దరం కలిసి శిఖరం వైపు వడివడిగా అడుగులేశాం. దేశంలోనే ఎవరెస్ట్‌ ఎక్కిన తొలి తండ్రీ కూతుళ్లుగా నిలిచాం’ అని గుర్తుచేసుకుంటుంది దియా.

‘ఆడపిల్లలం కదా అని ఇంటికే పరిమితం కావాలనుకోవద్దు.  ధైర్య సాహసాలను ప్రదర్శించడానికి వెనుకాడొద్ద’ని చెప్పే ఆమె తనకు ప్రయాణంలో ఎదురైన అనుభూతులు, సవాళ్లు, విశేషాలను స్కూల్‌, కాలేజీ అమ్మాయిలతో పంచుకుంటోంది  వారిలో స్ఫూర్తిని నింపుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని