అమ్మాయికి ఇక్కడేం పని అన్నారు
పురుషాధిక్య రంగంలో రాణించాలనుకుంది. కష్టపడితే సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదని బలంగా నమ్మింది. అవాంతరాలు, హేళనలు అన్నీ సహించింది. అదే అక్షయను రెండు స్టార్టప్‌లకు యజమానిని చేసింది. తన ప్రయాణంలోని విశేషాలివి.
పురుషాధిక్య రంగంలో రాణించాలనుకుంది. కష్టపడితే సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదని బలంగా నమ్మింది. అవాంతరాలు, హేళనలు అన్నీ సహించింది. అదే అక్షయను రెండు స్టార్టప్‌లకు యజమానిని చేసింది. తన ప్రయాణంలోని విశేషాలివి.
అక్షయా దినేష్.. న్యూజెర్సీలో పుట్టిపెరిగిన భారతీయ మూలాలున్న 24ఏళ్ల యువతి. వేసవి స్కూలు సెలవుల్లో ఖాళీగా ఉండకుండా ఏదైనా కొత్త అంశాన్ని నేర్చుకోవాలని సూచించారామె తల్లిదండ్రులు. ప్రోగ్రామింగ్, కోడింగ్‌కు పెరుగుతున్న ఆదరణ చూసి జావా కోర్సులో చేరమన్నారు. ఇష్టం లేకపోయినా చేరింది. తర్వాత పాఠశాల ప్రారంభమైంది. మనసుకు నచ్చిన గణితంలో పోటీలు జరుగుతున్నాయని తెలిసి వెళ్లాలనుకుంది. అప్పుడే ఆమెకు సాఫ్ట్‌వేర్ కోడింగ్ ఫెస్ట్ హ్యాక్‌థాన్ గురించి తెలిసింది. జావాలో తనకున్న అనుభవంతో వాటిలో పాలు పంచుకోవాలనుకుంది. వారాంతాల్లో ఈ హ్యాక్‌థాన్ పోటీల్లో పాల్గొని 45 వరకూ గెలిచింది. ఈ విజయం ఆమెకు స్కూల్లో మంచి గుర్తింపు తెచ్చింది. ఈ క్రమంలోనే ఒక రోజు రోబోటిక్స్ తయారు చేసే ప్రయోగశాలకు వెళ్లింది. అది అక్షయను ఆకట్టుకుంది. ‘ప్రోగామింగ్ చేస్తానని అడిగితే, టీం లీడర్ అమ్మాయిలకు ఇక్కడేం పని బయటకు పో అనడంతో ఇంటికెళ్లి అమ్మ దగ్గర ఏడ్చా’ అంటూ గుర్తుచేసుకుంటుంది అక్షయ. టెక్ రంగంలో అమ్మాయిలెందుకు రాణించకూడదు? కోడింగ్, ప్రోగ్రామింగ్ అబ్బాయిలకేనా? అనే ప్రశ్నలు ఆమెను టెక్ దిశగా నడిపించాయి.
ప్రోత్సహించలేదు..
అంకుర సంస్థలు అనగానే వ్యాపార ప్రయోజనాలు చూసే వారే ఎక్కువ. కానీ అక్షయ తన సంస్థ టెక్ రంగంలో రాణించాలనుకునే ఆడపిల్లలకు అవకాశాలు సృష్టించేదిగా ఉండాలని కోరుకుంది. అనుకున్నట్లుగానే లాడర్, స్పెల్‌బౌండ్ స్టార్టప్‌లను ప్రారంభించింది. అయితే ఇదేం అంత సులువుగా జరగలేదు. వీటి ప్రారంభంలో పెట్టుబడి కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ‘ఆడపిల్ల, నల్ల జాతీయురాలు’ అని ఎవరూ ప్రోత్సహించలేదు సరికదా ఇది నీకు సరిపడదని హేళన చేశారట. అయినా సరే పట్టువదలకుండా ముందుకు సాగింది. పాఠశాల విద్యాభ్యాసం అయిన వెంటనే స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో షీ ప్లస్‌ప్లస్ టెక్ ప్రోగాంకి ఎంపికైంది. విద్యార్థులకు సాంకేతిక రంగంలో ఉన్న అవకాశాలను పరిచయం చేయడమే దీని ముఖ్యోద్దేశం. అలా దాదాపు 600 మంది పిల్లలకు పాఠాలు చెప్పింది. వీళ్లలో కొంతమందికి కోడింగ్ ఏ మాత్రం పరిచయం లేదు. కానీ 8 వారాల శిక్షణ తర్వాత వారే సొంతంగా ఒక యాప్‌ను తయారుచేశారు. దీన్నే ఒక స్టార్టప్‌గా తయారు చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చిందామెకు. దానితో పాటు మైక్రోసాఫ్ట్‌లో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశమూ దక్కించుకుంది. అలా వచ్చిన డబ్బును తన అంకుర సంస్థకు కేటాయించింది. స్టాన్‌ఫర్డ్‌లో మాస్టర్స్ చేస్తున్నప్పుడు ‘లాడర్’ అనే ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంను ఏర్పాటు చేసి పిల్లలకు కోడింగ్ పాఠాలు చెబుతోంది. ఇదే కాదు స్పెల్ బౌండ్ అనే మరో సంస్థనూ స్థాపించింది. ఇది మెయిల్స్ నుంచి వచ్చే స్పామ్, ఫేక్, మెయిల్ బాక్స్ హ్యాకింగ్ వంటి సమస్యలకు పరిష్కారంగా వచ్చిన అంకురం. ఏ రంగంలోనైనా రాణించాలంటే శ్రమ, పట్టుదల, నేర్చుకునే సామర్థ్యం ఉండాలే కానీ జాతి, లింగ, ఆర్థిక వివక్షలు అడ్డంకులు కావని నిరూపించడమే లక్ష్యంగా సాగిపోతోంది అక్షయ.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.