బడుగర్‌ అమ్మాయి.. పైలట్‌ అయ్యింది!

కొండల్లో పుట్టిపెరిగిన అమ్మాయి.. వాటినే ప్రపంచం అనుకొని సరిపెట్టుకోలేదు. తన కలలకి రెక్కలు తొడిగి ఆకాశం అంచున ఎగరాలనుకుంది. నీలగిరి కొండల్లోని బడుగర్‌ తెగ నుంచి వచ్చిన మొదటి గిరిజన పైలెట్‌గా ఎం.ఎం. జయశ్రీ చరిత్ర లిఖించుకుంది.

Updated : 09 Sep 2023 09:13 IST

కొండల్లో పుట్టిపెరిగిన అమ్మాయి.. వాటినే ప్రపంచం అనుకొని సరిపెట్టుకోలేదు. తన కలలకి రెక్కలు తొడిగి ఆకాశం అంచున ఎగరాలనుకుంది. నీలగిరి కొండల్లోని బడుగర్‌ తెగ నుంచి వచ్చిన మొదటి గిరిజన పైలెట్‌గా ఎం.ఎం. జయశ్రీ చరిత్ర లిఖించుకుంది..

తమిళనాడులోని నీలగిరి కొండల్లో... పదుల సంఖ్యలో గిరిజన గ్రామాలున్నాయి. అక్కడ పెద్ద చదువులు చదివే అమ్మాయిలే తక్కువ. కానీ ఆ సంప్రదాయాన్ని తిరగరాస్తూ పైలట్‌గా ఎదిగింది జయశ్రీ. నీలగిరి జిల్లా కోతగిరి సమీపంలో ఉన్న కురుకుతి ఈమె స్వస్థలం. అక్కడి కొండల్లో యుద్ధ విమానాలు, రక్షణశాఖ శిక్షణ విమానాలు చక్కర్లు కొడుతుండటం తరచూ జరిగేదే. ఆ గ్రామ వాసులు వాటిని చూడటమే కానీ, ఏరోజూ వాటిలో ఎక్కిందిలేదు. ఏనాటికైనా ఆ విమానాలు నడిపే పైలట్‌ అవ్వాలనేది జయశ్రీ చిన్ననాటి కల. కానీ అందుకు ఏం చదవాలో చెప్పేవాళ్లే ఆ ఊళ్లోలేరు. దాంతో ఆ కలని తాత్కాలికంగా పక్కన పెట్టింది. కోయంబత్తూరులోని ప్రైవేటు కాలేజీలో కంప్యూటర్స్‌ సైన్స్‌లో పీజీ చేసింది. తర్వాత పైలట్‌ అవడానికి ఏరోనాటిక్స్‌ చదవాలని తెలిసినా... మధ్యతరగతి కుటుంబంలో పుట్టిపెరిగిన అమ్మాయిగా అంత సాహసం చేయలేదు. జీవితంలో నిలదొక్కుకునేందుకు ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం సాధించి బిజినెస్‌ అనలిస్ట్‌గా, సాఫ్ట్‌వేర్‌లు రూపొందించడంలో దిట్టగా మారింది. మెషిన్‌ లెర్నింగ్‌, డేటా అనలిటిక్స్‌లోనూ ప్రావీణ్యం సాధించింది. కానీ కొవిడ్‌ ఆమె జీవితాన్ని అనుకోని మలుపు తిప్పింది. లాక్‌డౌన్‌ సమయంలో వర్క్‌ఫ్రంహోమ్‌ ఇవ్వడంతో తిరిగి గ్రామానికి వచ్చేసింది జయశ్రీ. ఇంటి నుంచి పనిచేయడం మొదట్లో బాగానే ఉన్నా.. ఆ నాలుగ్గోడలకి పరిమితం కావడం తనకు ఇష్టం లేదు. అలాగని చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకోవడమా? అనే ఆలోచనా ఆమెని వెనక్కి లాగినా చివరికి ధైర్యం చేసింది.

250 గంటలు నడిపేందుకు రెడీ!

జయ తండ్రి జె.మణి విశ్రాంత గ్రామ పరిపాలనాధికారి, తల్లి మీనామణి సంగీత కళాకారిణి. తల్లినుంచి నృత్యం, సంగీతమూ నేర్చుకున్న జయశ్రీ పైలట్‌ అవ్వాలన్న తన ఆలోచనని వాళ్లతో పంచుకుంది. బిడ్డ ఆసక్తి చూసి వాళ్లూ సరేనన్నారు. ఇది తన తొలి విజయంగా జయశ్రీ భావించింది. ఐటీ ఉద్యోగాన్ని వదులుకుని, కూనూరు సమీపంలోని వెల్లింగ్టన్‌ ఆర్మీ పబ్లిక్‌స్కూల్‌లో టీచర్‌గా చేరింది. తను పనిచేసిన 6 నెలల్లో విమానయానం గురించి తెలుసుకుంది. తర్వాత ఆమె పెట్టుకున్న దరఖాస్తుకు దక్షిణాఫ్రికాలోని ఉల్కన్‌ ఏవియేషన్‌ ఇన్‌స్టిట్యూట్ నుంచి ఆహ్వానం అందింది. ‘చేస్తున్న ఉద్యోగం వదులుకుంది, ఎక్కడికో వెళ్తానంటోంది, ఇంత ఖర్చుపెట్టి అమ్మాయిని విదేశాలకు పంపడం అవసరమా’ అన్నారు బంధువులు. ఎవరేమనుకున్నా జయ జొహన్నెస్‌బర్గ్‌ విమానం ఎక్కేసింది. అక్కడ కఠిన శిక్షణను సైతం విజయమంతంగా పూర్తి చేసింది. ప్రైవేటు పైలట్ లైసెన్సునూ సాధించింది. బడుగర్‌ తెగలో ఈ ఘనత సాధించిన తొలి యువతి ఆమె. జయ తన గ్రామానికి తిరిగి వచ్చినప్పుడు ఊరివాళ్లు సంబరం చేసుకున్నారు. ‘పైలట్‌గా 70గంటలు ఆకాశంలో విమానంలో చక్కర్లు కొట్టాను. ఇక కమర్షియల్‌ పైలట్ లైసెన్సు కోసం పరీక్ష రాయాలి. శిక్షణకాలంలో 250 గంటలు విమానం నడపాల్సి ఉంటుంది. దానికీ సిద్ధమే’ అంటూ గర్వంగా చెబుతోందామె.

పేద పిల్లలకు అండగా..

కాలేజీరోజుల నుంచే జయశ్రీలో సేవాగుణం ఎక్కువ. తానుండే కొండ గ్రామాల్లోని పేద పిల్లలకు చదువు చెప్పేందుకు ‘యూ అండ్‌ ఐ ట్రస్ట్‌’లో వాలంటీరుగా చేరి ఆంగ్లం, గణితం నేర్పించేది. తనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో కృత్రిమమేధకు సంబంధించిన విద్యలోనూ పిల్లలకు, కాలేజీ విద్యార్థులకు శిక్షణ ఇచ్చింది. ఐటీ ఉద్యోగం చేసే సమయంలోనే ఈ సేవా కార్యక్రమాలకు కొంత సమయం వెచ్చించేది. పైలట్‌గా చేసినా వీటిని కొనసాగిస్తాననీ అంటోందీమె.

- హిదాయతుల్లాహ్‌.బి, చెన్నై

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని