డీపీ పెట్టినా తప్పేనా?
రమ్య, గీత(పేర్లు మార్చాం).. స్నేహితురాళ్లు. ఎక్కడకెళ్లినా సరదాగా సెల్ఫీలు దిగి వాట్సాప్, ఇన్‌స్టాల్లో డీపీలుగా పెట్టుకునేవారు. అంతా వారి స్నేహాన్ని మెచ్చుకుంటే మురిసిపోయేవారు.
రమ్య, గీత(పేర్లు మార్చాం).. స్నేహితురాళ్లు. ఎక్కడకెళ్లినా సరదాగా సెల్ఫీలు దిగి వాట్సాప్, ఇన్‌స్టాల్లో డీపీలుగా పెట్టుకునేవారు. అంతా వారి స్నేహాన్ని మెచ్చుకుంటే మురిసిపోయేవారు. అవే వారి పాలిట శాపమయ్యాయి. వాటిని మార్ఫింగ్ చేసి బెదిరించడంతో ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు.
రజితకు పెళ్లై రెండేళ్లు. తన ప్రేమకాదని మరొకర్ని చేసుకుందని ఆమెపై పగబట్టాడొకడు. దాంతో ఆమె ఫొటోలను ఎడిట్ చేసి పోర్న్ వీడియోలుగా మార్చి వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేశాడు. ఆ విషయం తెలిసి భర్త విడాకులకు దరఖాస్తు చేశాడు. ఆ అమ్మాయి తీవ్ర కుంగుబాటుకు గురై ఆత్మహత్యాయత్నం చేసింది.
ఇలాంటి ఘటనలు ఒకటీ రెండు కాదు... పరికించి చూస్తే మన చుట్టూనే ఎన్నో కనిపిస్తాయి. పరువు పోతుందన్న భయం, భవిష్యత్తు ఏమవుతుందోనన్న ఆందోళన వారిని ప్రాణాలు తీసుకునేలా చేస్తున్నాయి. మరి ఇదే పరిస్థితి మీకూ ఎదురైతే ఏం చేయాలో తెలుసా?
- మీ వ్యక్తిగత ఫొటోలు మా దగ్గర ఉన్నాయి డబ్బులు ఇవ్వండి అని అడుగుతున్నారా? నా మాట వినకపోతే నీ నగ్న చిత్రాల్ని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తా అని బెదిరిస్తున్నారా? భయపడకండి. ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయనే అవగాహన పెరుగుతోంది. అవతలివారు మిమ్మల్ని చెడ్డవ్యక్తిలా చూపించాలనుకున్నా ఎవరూ అంత తొందరగా నమ్మేయరు. మీరు బెంబేలెత్తి పోవడం వల్ల అవతలి వ్యక్తి మిమ్మల్ని మరింత బలహీనురాలిగా లెక్కేసే ప్రమాదం ఉంది. ముందుగా సమస్యను కుటుంబ సభ్యులకు తెలిపి, పోలీసులకూ ఫిర్యాదు చేయొచ్చు. నిందితులపై ఐపీసీ 384, 503, 292 సెక్షన్లకింద కేసు నమోదు చేస్తారు. తమకు జరిగిన అన్యాయాన్నీ, వేధింపులనూ జాతీయ మహిళా కమీషన్ దృష్టికి తీసుకెళ్లవచ్చు.
ఒకవేళ మీరు ఉంటున్న ఇంట్లోనే మీకు తెలియకుండా హిడెన్ కెమెరాలతో చిత్రీకరించినా, సంబంధిత ఫొటోలు, వీడియోలను బయటపెట్టినా, పెడతానని బెదిరించినా ఐటీయాక్ట్- 2000 ప్రకారం 66(ఇ),67, 67(ఎ)కింద వారిపై కేసు నమోదు చేయించవచ్చు. మీ ఫొటోలను, వీడియోలను మార్చి అభ్యంతరకరంగా ఏదైనా వెబ్‌సైట్ లేదా సామాజిక మాధ్యమ ఖాతాల్లో చేర్చారని తెలిస్తే...అవి మరింత వ్యాప్తి చెందకుండా చూడమని కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకోవచ్చు. మీ ఫేక్ ఫొటోలను వెబ్‌సైట్లలో చూస్తే వాటిని తీసేయమని ఆ వెబ్ మాస్టర్ లేదా, గూగుల్, ఫేస్‌బుక్ వంటి సంస్థలను సంప్రదించవచ్చు.
- ఇక అంతర్జాల వేదికగా జరిగే వేధింపులను ఎదుర్కోవడానికి cybercrime.gov.in సాయం చేస్తుంది. మార్ఫింగ్ చేసిన వీడియోలూ, ఫొటోలను పలు వెబ్‌సైట్‌లూ, ఖాతాల్లో ప్రచురిస్తే వాటిని తొలగించేందుకు stopncii.org వంటి సంస్థలు కృషి చేస్తున్నాయి. ఆయా వెబ్‌సైట్లలోకి వెళ్లి సంబంధిత వివరాలను నమోదు చేస్తే చాలు. వాటిని ప్రత్యేక సాఫ్ట్‌వేర్ సాయంతో ఏ మూలనున్నా పట్టి తొలగించేస్తారు.
- ఎస్.పి మమత, సైబర్ లాయర్
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.