నాయకురాలవ్వాలని.. వ్యాపారంలోకొచ్చింది!

నాన్న పెద్ద వ్యాపారవేత్త. చదువయ్యాక హాయిగా దాని బాధ్యతలు చేపట్టొచ్చు. కానీ.. ఒకరు వేసిన బాటలో నడిస్తే.. వ్యాపారంలో కష్టనష్టాలు తెలియవు కదా అనుకుందామె.

Updated : 10 Sep 2023 05:45 IST

నాన్న పెద్ద వ్యాపారవేత్త. చదువయ్యాక హాయిగా దాని బాధ్యతలు చేపట్టొచ్చు. కానీ.. ఒకరు వేసిన బాటలో నడిస్తే.. వ్యాపారంలో కష్టనష్టాలు తెలియవు కదా అనుకుందామె. పైగా తన కాళ్లమీద తాను నిలబడాలన్నది ఆమె కల. అందుకని సొంతంగా వ్యాపారం మొదలుపెట్టింది. అవరోధాలను దాటి దాన్ని రెండేళ్లలోనే కోట్ల వ్యాపారంగా మలిచింది ఆకాంక్ష. ఆమె ప్రయాణమిది!

‘పిల్లల ఉత్పత్తుల్లోని రసాయనాలు అలర్జీలు, దీర్ఘకాలంలో క్యాన్సర్‌కి దారితీస్తున్నాయని టీవీలో చూశా. ఆ ఉత్పత్తులను ఏకంగా కాల్చేయడం చూసి పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమైంది. అప్పుడే మాకు ఏం వాడారో తెలుసుకోవాలి అనిపించి అమ్మను అడిగా. మా చిన్నతనంలో కొబ్బరినూనె, సున్నిపిండి, వెన్న వంటి సహజ పదార్థాలే వాడేవారని తెలిసి ఆశ్చర్యపోయా. ఈ తరానికి అలాంటివి ఎందుకు అందివ్వకూడదు అన్న ఆలోచన వచ్చింది’ అనే ఆకాంక్ష శర్మది పుణె. లాస్‌ ఏంజెల్స్‌లో డిజైన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ చేసింది. చదువు పూర్తయ్యాక దేశానికి తిరిగొచ్చి సొంత వ్యాపారం ప్రారంభిస్తానంటే అంతా ఆశ్చర్యపోయారు.

‘నచ్చింది చదువుకోనిచ్చారు అమ్మానాన్న. ఇద్దరూ వ్యాపారవేత్తలు. స్కూళ్లు, మీడియా అవుట్‌లెట్లు ఉన్నాయి. వాళ్ల లక్ష్యం తర్వాత ఆ వ్యాపారాన్ని నేను నడిపించాలనే! నాకూ బిజినెస్‌పై ఆసక్తి ఉంది. కానీ అది సొంతంగా ఎవరి సాయం లేకుండా చేయాలని ఆశ. అదే ఇంట్లో చెప్పినప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. విజయవంతంగా సాగుతున్న వ్యాపారం ఉండగా కొత్తది ఎందుకన్నారు. మీరు వేసిన బాటలో నాకు కష్టనష్టాలు తెలియవు. నాకు వారసురాలిని కాదు.. నాయకురాలిని అవ్వాలనుంది. వీటన్నింటినీ దాటితేనే అది సాధ్యమని చెప్పా. నాన్న ఆనందంగా భుజం తట్టి.. నేర్చుకోమన్నారు’ అంటుంది ఆకాంక్ష.

పిల్లల ఉత్పత్తులు అని ఈ 23ఏళ్లమ్మాయి ముందే నిర్ణయించుకుంది. కానీ పరిశోధనా చేసింది. సంస్థను ప్రారంభిద్దామనుకునే నాటికి లాక్‌డౌన్‌. ఈ సమయాన్ని ఉత్పత్తి తయారీ, దాన్ని పరీక్షించడానికి ఉపయోగించింది ఆకాంక్ష. 2021 జూన్‌కి ‘సిట్టా’ పేరిట ఉత్పత్తులను మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. టాల్కమ్‌లేని బేబీ పౌడర్లు, ఆయిల్స్‌, బామ్స్‌ వంటివి తీసుకొచ్చింది. ‘కొబ్బరినూనె, ఆముదం, గుంటగలగర, నువ్వుల నూనె వంటి సంప్రదాయ పదార్థాలతో వీటిని రూపొందించాం. టెస్ట్‌ల్లోనూ సానుకూల ఫలితాలొచ్చాయి. సమస్యల్లా మార్కెటింగ్‌లోనే! ఉద్యోగులను ఎంచుకుంటే ‘ఇంత అనుభవం ఉండి నీ మాట వినాలా’ అనేవారు. బయట నువ్వే చిన్నపిల్లవి. పిల్లల గురించి నీకేం తెలుసనేవారు. కానీ పిల్లల, చర్మ నిపుణులకు చూపించాం. వాళ్లు మెచ్చారు. తమవద్దకు వచ్చిన వాళ్లకీ సూచించేవారు. ఆఫ్‌లైన్‌, ఆన్‌లైల్లోనూ అందుబాటులోకి తెచ్చాం. అలా కొనుగోళ్లు పెరిగాయి’ అనే ఆకాంక్ష ‘సిట్టా’ను రెండేళ్లలో రూ.కోటిన్నర వ్యాపారంగా మార్చింది. త్వరలో దేశవ్యాప్తంగా అమ్మకాలు జరపడం తన కల.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని