పైట కొంగుతో... హీరో చొక్కాలు కుట్టా!
‘వీడు ముసలాడవ్వకూడదే’ ఉప్పెన.. సినిమాలో బేబమ్మ చెప్పిన డైలాగ్ గుర్తుందా? అలా అయితే హీరోతోపాటు అతను వేసుకున్న పూలచొక్కా, చిల్లుల బనీను కూడా మీ కళ్లముందు మెదలాలి.
‘వీడు ముసలాడవ్వకూడదే’ ఉప్పెన.. సినిమాలో బేబమ్మ చెప్పిన డైలాగ్ గుర్తుందా? అలా అయితే హీరోతోపాటు అతను వేసుకున్న పూలచొక్కా, చిల్లుల బనీను కూడా మీ కళ్లముందు మెదలాలి. జాంబిరెడ్డీ సినిమాలో జాంబీలు గుర్తున్నాయా?.. ఇవన్నీ ఎందుకు అంటారా? మనకి ఆ పాత్రల్ని గుర్తుండిపోయేలా చేసిన కాస్ట్యూమ్ డిజైనర్ మరెవరో కాదు.. తెలుగమ్మాయి ప్రసన్నవర్మ. డిజైనర్‌గా తన ప్రయాణాన్ని మనతో పంచుకుంది..
కాలేజీలో ఉన్నప్పుడు హీరోయిన్‌లు వేసుకున్న డ్రెస్సులు చూడ్డానికే సినిమాలకెళ్లేదాన్ని. ఆ ఇష్టం కాస్తా నా కెరియర్‌నే మలుపు తిప్పుతుందని అనుకోలేదు. మాది భీమవరం. అమ్మ పద్మావతి, నాన్న రామకృష్ణంరాజు. మాకు చేపల చెరువులున్నాయి.. వాటిని చూసుకుంటున్నారు. ఒక తమ్ముడు. భీమవరంలో ఇంటర్ వరకు చదివాక... డిజైనింగ్‌పై ఆసక్తికొద్దీ హైదరాబాద్‌లో ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిప్లొమా చేశా. ఆ తర్వాత దుబాయ్‌లోని ది కాలేజీ ఆఫ్ ఫ్యాషన్ అండ్ డిజైన్ (సీఎఫ్‌డీ)లో ఎంబీఏ పూర్తిచేశా. సినిమాల్లో పనిచేస్తానంటే నాన్న ఒప్పుకోలేదు. బెంగళూరులో పీటర్ ఇంగ్లాండ్ మెన్స్‌వేర్‌లో డిజైనర్‌గా పనిచేసినా ఆ పని నాకు సంతృప్తినివ్వలేదు. దాంతో ఏడాది తిరక్కుండానే మానేశా. నాకు బొమ్మలు వేయడమన్నా ఇష్టమే. నేను వేసిన ఒక పెయింటింగ్ డైరెక్టర్ పూరీగారి వరకూ వెళ్లింది. అదే నా జీవితంలో పెద్ద మలుపు. అది బాగుందని ఫోన్ చేసి ఇంటికి ఆహ్వానించి, ప్రశంసించారు. ఆ పరిచయం నన్ను సినిమాలవైపు ప్రోత్సహించింది. కానీ తొలి అవకాశం మాత్రం వేరొకరి రూపంలో వచ్చింది. నటుడు రాజా రవీంద్ర మాకు బంధువు. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ‘ఇంత టాలెంట్ ఉంది, సినిమాల్లో ఎందుకు చేయకూడ’దని అన్నారు. అలా 2018లో నిఖిల్ చేసిన కిరాక్ పార్టీ సినిమాలో అవకాశం అందుకున్నా. ఆ తర్వాత వరుస అవకాశాలు రావడంతో ఏడాదిపాటు ఇంటి ముఖమే చూడనంత బిజీ అయిపోయా.
జాంబీలకోసం దుస్తులు..
జాంబిరెడ్డి చిత్రంలో ప్రధాన పాత్రలకే కాకుండా వందలకొద్దీ జాంబీ పాత్రలకు దుస్తులు డిజైన్ చేయడం మర్చిపోలేను. అలాగే మామా మశ్చీంద్ర, చోర్‌బజార్, అర్జున ఫల్గుణ, యాత్ర సహా 14 చిత్రాలకు పనిచేశాను. ఇక జాతీయ పురస్కారం సాధించిన ‘ఉప్పెన’ గురించి చెప్పాలంటే.. ఆ చిత్ర దర్శకుడు బుచ్చిబాబు ఫోన్ చేసి హీరో వైష్ణవతేజ్ పాత్ర గురించి చెప్పి కొత్త లుక్ తీసుకురావాలన్నారు. మామూలుగా అయితే పాత్రల స్టైల్, ఆహార్యం వంటివి ముందుగా స్కెచ్ వేసి దర్శకుడికి చూపిస్తా. ఈ సినిమాకి అలా చేయలేదు. నేరుగా కాకినాడలోని షూటింగ్ స్పాట్‌కికెళ్లా. ఆ పరిసరాలు చూడగానే చిన్నప్పుడు నేను చూసిన రంగుల పూల చొక్కాల జాలర్లు గుర్తొచ్చారు. ఆ స్టైల్‌లో చూపించాలనుకున్నా. అందుకే హీరో చొక్కాల కోసం చీరలని ఎంచుకున్నా. సిల్క్, జార్జెట్, క్రేప్ చీరలు తీసుకుని వాటి పైట అంచులతో చొక్కాలు కుట్టించా. ఇంకా మాస్ లుక్ రావాలని హీరో ధనుష్ ధరించే చిల్లుల బనియన్లు లాంటివి వెతికా. రంగులవి దొరక్క, తెలుపు వాటికి డై వేయించా. దీంతో పాత్రకు తగ్గట్లు సరిగ్గా కుదిరాయి. సినిమా విడుదలయ్యాక ఆ చొక్కాలు ఎక్కడ దొరికాయి అంటూ ఒకటే ప్రశంసలు.
ఒకటే చీర...
హీరోయిన్ కృతిశెట్టి కోసం చుడీదార్లు, లంగాఓణీలు ఎంచుకున్నా. అంతా బాగానే ఉంది కానీ.. క్లైమాక్స్‌లో మాత్రం కాస్త టెన్షన్ పడ్డా. హీరోయిన్ చీరలో అయితే బాగుంటుందని అనుకున్నారు. కానీ సమయం లేదు. షాపులవాళ్లని బతిమాలి ఉదయాన్నే దుకాణం తెరిపించా. చివరకు అనుకున్న రంగులో పట్టుచీర దొరికినా, అటువంటిదే మరొకటి కావాలి. ఎందుకంటే షాట్స్‌లో చీర పాడయితే రెండోది వాడతాం. కానీ ఒకటే చీర దొరికింది. అందుకే ఆమె వెంటే ఉన్నా. చీర తడిచినా, మురికైనా క్షణాల్లో క్లీన్ చేసి ఆరబెట్టి, ఐరన్ చేసి డ్రేపింగ్ చేసిచ్చేవాళ్లం. క్లైమాక్సంతా ఒక్క చీరతోనే గడిపేశాం. ఆ సీన్లన్నీ అనుకున్నట్టుగా పూర్తవడంతో హమ్మయ్య అనుకున్నా. హర్రర్, థ్రిల్లర్ పనిచేయాలనేది నా కల. ఆత్మవిశ్వాసంతో మనసుకు నచ్చింది చేస్తే విజయం అదే వరిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.