ఇంటి నుంచి చదువు.. గిన్నిస్ రికార్డు!
అయిదు డిగ్రీలు.. మూడు పీజీలు.. పీహెచ్‌డీ చేశారామె. పది దేశాల్లో ప్రెజెంటేషన్లు. తాజాగా గిన్నిస్ రికార్డునీ సాధించారు. ఒకప్పుడు ఇంటి నుంచి కాలు బయట పెట్టడమే కష్టమైన స్థితి నుంచి డాక్టర్ షేక్ జాహేదా బేగం ఈ స్థాయి వరకూ ఎలా చేరుకున్నారంటే..
అయిదు డిగ్రీలు.. మూడు పీజీలు.. పీహెచ్‌డీ చేశారామె. పది దేశాల్లో ప్రెజెంటేషన్లు. తాజాగా గిన్నిస్ రికార్డునీ సాధించారు. ఒకప్పుడు ఇంటి నుంచి కాలు బయట పెట్టడమే కష్టమైన స్థితి నుంచి డాక్టర్ షేక్ జాహేదా బేగం ఈ స్థాయి వరకూ ఎలా చేరుకున్నారంటే..
మాది నల్గొండ జిల్లాలోని హజారిగూడెం అనే గ్రామం. సంప్రదాయ ముస్లిం కుటుంబం. మేం నలుగురం ఆడపిల్లలం. అమ్మాయిలు బయటికి వెళ్లడానికే అంగీకరించేవారు కాదు. ఏడోతరగతి వరకు ఇంట్లోనే ట్యూషన్లు చెప్పించారు. తర్వాత నాన్న దస్తగిరి ప్రభుత్వోద్యోగం సాధించాక స్కూల్లో చేర్చారు. చిన్న సైకిల్ తొక్కుకుంటూ పక్క ఊరికెళ్లి చదివా. ఉస్మానియా క్యాంపస్‌లో ఉంటూ 5 డిగ్రీలు (బీఏ, బీఈడీ, ఎల్‌ఎల్‌బీ, ఉర్దూ, హిందీ), 3 పీజీలు (పొలిటికల్ సైన్స్, ఎల్‌ఎల్‌ఎం, ఎంఈడీ), పీహెచ్‌డీ (పొలిటికల్ సైన్స్) చేశా. తర్వాత నెట్ రాసి, ప్రభుత్వోద్యోగం సాధించా. ప్రస్తుతం హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాను. పీహెచ్‌డీలో మొదట మహిళా సాధికారత అంశాన్ని ఎంచుకున్నా. అనుకోకుండా 2011 ముంబయి ఉగ్రదాడి నా దారి మార్చింది. ఉగ్రవాదులు చిన్న పడవ ద్వారా వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డారని తెలిసి.. తీర ప్రాంతాల్లో లొసుగులు, వాటిని మరింత పటిష్టంగా చేయడంపై పరిశోధన మొదలుపెట్టా. ‘సముద్ర తీర ప్రాంతాల పరిరక్షణ- తీరప్రాంత రక్షణ దళం పాత్ర’పై పరిశోధన పత్రాన్నీ సమర్పించా. ఈ అంశంపై 2016లో బ్యాంకాక్‌లో జరిగిన ‘ఇంజినీరింగ్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ లైఫ్‌సైన్సెస్’ అంతర్జాతీయ సదస్సులో ప్రజెంటేషన్ ఇచ్చి బహుమతి అందుకున్నా. దీంతోపాటు జపాన్, ఆస్ట్రేలియా, శ్రీలంక, మలేషియా, దుబాయ్ వంటి పది దేశాల సదస్సుల్లో పాల్గొన్నాను.
రెండు పాత్రలు..
2020లో ఈఎస్‌ఎన్ అనే ప్రచురణ సంస్థ 150గం. ఏకధాటిగా ఆన్‌లైన్‌లో ప్రెజెంటేషన్ ప్రోగ్రామ్ నిర్వహించింది. దానిలో నేనూ పాల్గొన్నా. అదప్పుడు రికార్డు. ఆ స్ఫూర్తితో ప్రపంచంలోనే పెద్ద పుస్తకం రూపకల్పన ప్రారంభించింది. ఎనిమిది మంది రచయితలం దీనిలో పాల్గొన్నాం. తెలుగు రాష్ట్రాల నుంచి నేనొక్కదాన్నే. పైగా రచయిత, ఎడిటర్ రెండు పాత్రలు పోషించా. మహిళా సాధికారత, పర్యావరణం, సస్టెయినబుల్ డెవలప్‌మెంట్‌లపై వ్యాసాలు రాస్తూనే మిగిలిన వాళ్లవి సరిచూడటం కత్తిమీద సామే! మొత్తం లక్షావంద పేజీల పుస్తకానికి ‘వరల్డ్ 2023’ అని పేరు పెట్టాం. మా కష్టం ఫలించి ఇటీవలే గిన్నిస్ రికార్డు అందుకోవడం మర్చిపోలేని అనుభూతి.
చిన్నతనం నుంచీ చదువుకోవడానికి ఎన్నో సవాళ్లు దాటా. అందుకే ఉన్నతస్థాయిలో నిలవాలని తాపత్రయపడేదాన్ని. ఎవరిమీదా ఆధారపడొద్దని ఉద్యోగం చేసుకుంటూ చదువుకున్నా. ఎన్‌జీఓలతో కలిసి పనిచేస్తున్నా. విపత్తుల సమయంలో సాయమందిస్తా. ఈక్రమంలో ఆసియా అరబ్ సమ్మిట్‌లో ‘సూపర్ విమెన్’, షీటీమ్ నుంచి మార్గదర్శన్‌తోపాటు రాష్ట్ర, జాతీయ స్థాయుల్లో మరెన్నో పురస్కారాలూ అందుకున్నా. తాజాగా తెలంగాణ నుంచి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు అందుకున్నా. చిన్న పల్లె నుంచొచ్చా. నన్ను చూసి ఒక్కరైనా స్ఫూర్తి పొందితే చాలనుకుంటా.
- ఆవుల రమేశ్, మిర్యాలగూడ
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.