చవితి పూజచేస్తామిలా...

గణేశ నవరాత్రులు వచ్చాయంటే చాలు ‘ఆది’ పూజలు అందుకునే బొజ్జ గణపయ్యను కొలవడానికి చిన్నా, పెద్దా పోటీ పడుతుంటారు. చవితి పండగను తామెలా చేసుకుంటారో పంచుకున్నారు ఈ తారలు.

Updated : 17 Sep 2023 03:08 IST

గణేశ నవరాత్రులు వచ్చాయంటే చాలు ‘ఆది’ పూజలు అందుకునే బొజ్జ గణపయ్యను కొలవడానికి చిన్నా, పెద్దా పోటీ పడుతుంటారు. చవితి పండగను తామెలా చేసుకుంటారో పంచుకున్నారు ఈ తారలు.


కాలేజీ రోజులు గుర్తొస్తాయి
- రష్మిక మందన్న

వినాయక చవితి మా ఇంట్లో భిన్నంగా ఉంటుంది. పూజ అందరిలా యథాతథంగానే చేస్తాం. కానీ విగ్రహం పెట్టం. కాలేజీ రోజుల్లో మాత్రం బాగా ఎంజాయ్‌ చేశా. ఇప్పటికీ చవితి అంటే నాకు ఆ రోజులే గుర్తొస్తాయి. స్నేహితులమంతా కలిసి చందాలు వసూలు చేసేవాళ్లం. మండపాన్ని రంగు రంగుల కాగితాలతో అలంకరించేవాళ్లం. ఇక డ్యాన్స్‌లు సరే సరి. గత ఏడాది ఈ పండగను ఉత్తరాదిన నిర్వహించుకున్నా. అక్కడ మాత్రం కాస్త భిన్నంగా నిర్వహించుకోవడం గమనించా. అప్పుడే తొలిసారి ‘మోదకం’ తిన్నా. చాలా నచ్చింది. ఇప్పుడు గతంలోలా వేడుకగా నిర్వహించుకోవడం లేదు కానీ.. ఎక్కడున్నా పూజ మాత్రం తప్పనిసరి.


ఆ ప్రతిమలకూ పూజ చేసేవాళ్లం
- నేహా శెట్టి

నేను చేసుకునే పండగల్లో పెద్దది వినాయక చవితినే. మంగళూరులోని మేముండే బిల్డింగ్‌లో ముందు రోజు మట్టి గణపయ్యను తయారు చేసే పోటీలు జరిగేవి. వాటిల్లో పాల్గొనడానికి నేను, చెల్లి నవమి ఉత్సాహంగా ఎదురు చూసేవాళ్లం. అమ్మ కొన్న విగ్రహంతో పాటు మేము చేసిన వాటిని కూడా పూజలో పెట్టేది. అది మాకెంతో నచ్చేది కూడా. ఇక, ఆ రోజు మా ఇంట్లో బొబ్బట్లు, పులిహోర తప్పనిసరిగా ఉంటాయి. అవంటే నాకెంతో ఇష్టం. ఈ ఏడాది మాత్రం త్వరలో విడుదల కానున్న ‘రూల్స్‌ రంజన్‌’ సినిమా ప్రచారంలో ఉండటం వల్ల ఇంటికి వెళ్లే అవకాశం లేదు. కాబట్టి ఇక్కడే, నాతో కలిసి పనిచేసే సిబ్బంది అందరితో కలసి పండగ చేసుకోబోతున్నా.


ధూల్‌పేట నుంచి విగ్రహం తెస్తా
- వైష్ణవీ చైతన్య

వినాయక చవితి వస్తోందంటే చాలు... తమ్ముడు నితీశ్‌కి, నాకూ భలే సరదా. చిన్నప్పుడు ఓ పెద్ద గణేశుడి విగ్రహాన్ని చూడటానికి వెళ్తే, అక్కడ పక్కనే ఉన్న చిన్న ప్రతిమను వెంట తెచ్చేశాడు వాడు. అప్పట్నుంచే మా ఇంట్లో గణేశ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మేమిద్దరం కాస్త పెద్దయ్యాక పండగ ముందు రెండు రోజుల పాటు ధూల్‌పేట్‌ మొత్తం తిరిగి నచ్చిన విగ్రహాన్ని కొనుక్కొచ్చేవాళ్లం. ఇక, నవరాత్రుల్లో మా ఇల్లు భజనలు, ఆటపాటలతో భలే సందడిగా ఉంటుంది. చిన్నప్పుడు ఎవరూ చూడకుండా లంబోదరుడి చేతిలోని లడ్డూని దొంగతనం చేసి తినేసి ఆ నెపాన్ని మాత్రం మరొకరి మీద వేసి ఎంత నవ్వుకునే వాళ్లమో! ఇదే కాదు, పాతబస్తీలోని మా గల్లీలో అన్నదానం చేయడం, తీన్‌మార్‌ డ్యాన్సులతో ట్యాంక్‌బండ్‌కి నిమజ్జనానికి తీసుకెళ్లడం ఒకటా రెండా ఎన్నో మధుర జ్ఞాపకాలున్నాయి. అంతేకాదండోయ్‌! బయట మండపాల్లో జరిగినట్లే లడ్డూ వేలం మా ఇంట్లోనూ వేస్తాం. దాన్ని ఎవరు పాడుకుంటే మరుసటేడాది వారే విగ్రహాన్ని తెచ్చివ్వాలి. ఈ ఏడాది ఆ వంతు మా తమ్ముడిది. అయితే, బేబీ సినిమా విజయంతో ఈ నవరాత్రులను మరింత ఘనంగా చేసుకోవాలన్నది మా ఇంటిల్లిపాది ఆలోచన.


అమ్మతో కలిసి చేసుకుంటా
- సారా అలీఖాన్‌

టా గణపతిని మా ఇంటికి తీసుకొస్తాం. చుడీదార్‌, బొట్టు, గాజులతో సిద్ధమైపోయి అమ్మతో కలిసి పూజ చేస్తా. దానికి సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పంచుకుంటా. అమ్మ హిందూ.. నాన్న ముస్లిం. నేను రెండు ఆచారాలనూ పాటిస్తా. ఇదే అనుసరించాలన్న నిబంధన మాకెప్పుడూ లేదు. అందుకే ఎవరైనా ఏమైనా అన్నా పట్టించుకోను. నచ్చినా నచ్చకపోయినా నేను ఇలాగే ఉంటానని సమాధానమిస్తా. నాన్న, చిన్న తమ్ముళ్లు కూడా పూజలో పాల్గొంటారు. కాబట్టి, నాకిదేమీ కొత్తగా అనిపించదు. అందరు అమ్మాయిల్లాగే పూజ చేస్తా. నచ్చిన పిండి వంటలన్నీ తినేస్తా. నిమజ్జనానికి వెళ్లేప్పుడు డ్యాన్స్‌ కూడా చేస్తా. భజనలు, నృత్యాలతో సందడిగా ఉండే ఈ పండగ నాకు చాలా ఇష్టం కూడా!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని