ప్రపంచ గమనాన్ని మార్చేందుకే నా పర్యటనలు!
‘జీవితంలో అన్నీ ఉన్నప్పుడే కాదు...ఏమీ లేనప్పుడు కూడా సంతోషంగా ఉండగలగాలి’...అలాంటి అనుభూతిని చూశాకే ఆత్మసంతృప్తి కోసం లక్షల జీతాన్నిచ్చే ఉద్యోగాన్ని వదిలి పర్యటకురాలిగా మారాను’ అంటారు శివ్యనాథ్. దేశంలోనే టాప్ ట్రావెల్ బ్లాగర్‌గా పేరు తెచ్చుకున్నారామె.
‘జీవితంలో అన్నీ ఉన్నప్పుడే కాదు...ఏమీ లేనప్పుడు కూడా సంతోషంగా ఉండగలగాలి’...అలాంటి అనుభూతిని చూశాకే ఆత్మసంతృప్తి కోసం లక్షల జీతాన్నిచ్చే ఉద్యోగాన్ని వదిలి పర్యటకురాలిగా మారాను’ అంటారు శివ్యనాథ్. దేశంలోనే టాప్ ట్రావెల్ బ్లాగర్‌గా పేరు తెచ్చుకున్నారామె. స్టోరీ టెల్లర్‌గా, సోషల్ ఆంత్ర ¢ప్రెన్యూర్‌గా, పర్యావరణ రక్షకురాలిగానూ ఆమెకి ప్రత్యేక గుర్తింపు ఉంది.
శివ్యది దెహ్రాదూన్‌లో సాధారణ మధ్యతరగతి కుటుంబం. జీవితంలో స్థిరపడాలంటే బాగా చదువుకోవాలని చెప్పిన తల్లిదండ్రుల మాటలకు కట్టుబడి విద్యారుణం తీసుకుని సింగపూర్‌లో మేనేజ్‌మెంట్ డిగ్రీ పూర్తిచేశారు. చదువయ్యాక అక్కడే సింగపూర్ టూరిజం బోర్డులో సోషల్‌మీడియా స్ట్రాటజిస్టుగా చేరారు. విధుల్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ట్రావెల్ బ్లాగర్లను అనుసరించడం మొదలుపెట్టారు. అది మొదలు శివ్యకు పర్యటనలపై ఆసక్తి పెరిగింది. ఉద్యోగం నుంచి రెండు నెలలు విరామం తీసుకుని పశ్చిమ యూరప్‌కి వెళ్లొచ్చారు. మరో నెలరోజుల పాటు స్పితిలోయలో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు, కార్బన్ ప్రత్యామ్నాయ విధానాలపై ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి పని చేశారు. ఈ అనుభవాలు ఆమెను పూర్తి స్థాయి ట్రావెల్ బ్లాగర్‌గా మారడానికి దోహదం చేశాయి.
ఆరునెలలు ఆ డబ్బులతోనే... శివ్య తన అభిరుచి కోసం లక్షల జీతమిచ్చే ఉద్యోగాన్ని వదులుకోవాలనుకుంటున్న విషయం తెలిసి అంతా తప్పుబట్టారు. అయినా సరే, ఆమె తన మనసు చెప్పిందే వినడానికి నిర్ణయించుకున్నారు. ఇందుకోసం అప్పటివరకూ దాచుకున్న డబ్బులతోనే పర్యటన ప్రారంభించారు. ఆరునెలలకే పర్సు ఖాళీ అవ్వడంతో తన ఇంటితో పాటు మరెన్నో విలువైన వస్తువులను అమ్మేశారు. ఆపై ఫ్రీలాన్స్ రైటర్‌గా, మీడియా కన్సల్టెంట్‌గా పనిచేస్తూ ‘ఇండియా అన్‌ట్రావెల్డ్’ అనే స్టార్టప్‌ని ప్రారంభించారు. ఆపై తన ప్రయాణాన్ని వివరిస్తూ ‘షూటింగ్ స్టార్’ పేరుతో ఓ పుస్తకాన్ని ప్రచురించగా అది ఇప్పటివరకూ నాలుగు సార్లు రీప్రింట్ అయ్యింది. ఆపై ఈ పేరుతో పర్యావరణ హిత దుస్తుల బ్రాండ్‌ని మార్కెట్లోకి తెచ్చారు. దీన్నుంచి వచ్చిన ఆదాయాన్ని మాత్రం ఉత్తరాఖండ్‌లో అడవుల పెంపకానికి ఖర్చు చేస్తున్నారు. ప్రస్తుతం హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి సస్టెయినబిలిటీ అండ్ ఎన్విరాన్‌మెంటల్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నారు శివ్య.
పగడపు దిబ్బల్లో పనిచేశా... ‘తాను చేసే ప్రయాణం ప్రజల ఆలోచనల్నీ, ప్రపంచ గమనాన్నీ మార్చాలని’ అంటారు శివ్య. ఈక్వెడార్ ఎడారి, అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్ వంటివాటితో సహా సుమారు 40 దేశాల్లో తన పర్యటన సాగింది. ‘థాయ్‌లాండ్ నుంచి మయన్మార్ ద్వారా భారతదేశానికి రోడ్డు మార్గం ద్వారా చేరుకోవడం ఒకత్తెయితే, పర్షియన్ గల్ఫ్ నుంచి ఇరాక్ మీదుగా ఆర్మేనియా వరకూ ఒంటరిగా చేసిన ప్రయాణం మరో ఎత్తు. ప్రపంచంలోనే అత్యంత మారుమూల ద్వీపం ఇస్లా రాబిన్సన్ క్రూసోలో స్థానిక వ్యవసాయదారులకు పర్యావరణ పరిరక్షణ పాఠాలు చెప్పడం, క్యూబాలోని పగడపు దిబ్బల పునరుద్ధరణ ప్రాజెక్ట్‌లో పనిచేయడం వంటి క్షణాలెన్నో ఆస్వాదించా ’నంటారీమె.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.