లక్షల మందికి సాయం.. షార్క్‌లతో సావాసం!

నేనేంటి? ఎందుకిలా ఉన్నా.. కష్టాల్లో పుట్టిపెరిగిన వాళ్లు ఇలా అనుకోవడం సహజమే! గొప్పింటి అమ్మాయి, నాన్న పేరున్న వ్యాపారవేత్త.. పైగా తనే ఓ డాక్టర్‌. అలాంటమ్మాయి ఈవిధంగా ఆలోచించడమేంటి?

Published : 22 Sep 2023 01:49 IST

నేనేంటి? ఎందుకిలా ఉన్నా.. కష్టాల్లో పుట్టిపెరిగిన వాళ్లు ఇలా అనుకోవడం సహజమే! గొప్పింటి అమ్మాయి, నాన్న పేరున్న వ్యాపారవేత్త.. పైగా తనే ఓ డాక్టర్‌. అలాంటమ్మాయి ఈవిధంగా ఆలోచించడమేంటి? ఇంతకీ తనకీ ఈ షార్క్‌లకీ సంబంధమేంటో తెలియాలంటే జెబాని కలుసుకోవాల్సిందే!

నాన్న వైద్యుడు. హెల్త్‌కేర్‌ రంగంలో మంచి పేరుంది. ఆయన స్ఫూర్తితో జెబా మూపెన్‌ కూడా డాక్టర్‌ అవ్వాలనుకుంది. పుట్టింది కేరళ అయినా పెరిగిందంతా దుబాయి. యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియా నుంచి ప్రీ మెడికల్‌ స్టడీస్‌, భారత్‌లో ఎంబీబీఎస్‌ పూర్తిచేసింది. ఎంతో ఇష్టంతో చేరినా అదెందుకో తనను అంతగా ఆకర్షించలేదు. నాన్న వ్యాపారం.. ఎస్తర్‌ డీఎం హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్‌ బాధ్యతలను తీసుకుంది. ‘సీఎస్‌ఆర్‌ ఇనిషియేటివ్‌’ పేరుతో ఓ వలంటీరు ప్రోగ్రామ్‌ ప్రారంభించింది. దీని ద్వారా ఉచిత సర్జరీలు, మెడికల్‌ క్యాంపులు, వికలాంగులకు ఉద్యోగాలు వంటి ఎన్నో కార్యక్రమాలను నిర్వహించింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 45 లక్షల మందికి సాయపడింది. ఇన్ని చేస్తున్నా తన మనసులో ఏదో వెలితి. తనలో లోపాలను వెతుక్కునేది. అలా మానసిక కుంగుబాటుకు గురైంది. దెబ్బమీద దెబ్బలా సొరియాసిస్‌, ఆటో ఇమ్యూన్‌ వ్యాధులతోడయ్యాయి. ఇవి ఆమెను మరింత కుంగదీశాయి.

భిన్న వైద్యాల పరిచయం..

చేతులు, కాళ్లు పొట్టు రాలిపోయేవి. అడుగు వేయడం మాట అటుంచి చేతులతో బాటిల్‌ మూత తెరవడమూ వీలయ్యేది కాదు. దీనికి తోడు ఆర్థరైటిస్‌తో ఎముకల నొప్పులు. భరించలేకపోయేది. చికిత్స కోసం కేరళ వచ్చింది. ‘నా శరీరం ఎన్నో సూచనలిచ్చింది. కానీ నేనే పట్టించుకోలేదు. అక్కడ ఆయుర్వేద వైద్యుడు ‘మా సాయం 20 శాతమే.. మిగతా 80 శాతం నీ ప్రయత్నం మీదే ఆధారపడి ఉంటుంది’ అన్నారు. అప్పట్నుంచీ సానుకూలంగా ఆలోచించడం, ఆరోగ్యకరమైన ఆహారంపై దృష్టిపెట్టా. త్వరలోనే పరిస్థితి అదుపులోకి వచ్చిం’దనే జెబా పోటీ ప్రపంచంలో పరుగుతీస్తూ చాలామంది తమని తాము పట్టించుకోకపోవడం గమనించింది. వాళ్లకోసం ‘వెల్త్‌’ పేరిట లైఫ్‌స్టైల్‌ కారణంగా, వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులపై అవగాహన కల్పిస్తూనే ఆయుర్వేదం, యోగా, హోమియో వంటి 15 రకాల వైద్యాలను తమ ఆస్పత్రుల్లో ప్రారంభించింది.

నీటిపై ప్రేమ..

తను ప్రవేశపెట్టిన ప్రోగ్రాములన్నీ జెబాకు పేరు తెచ్చాయి. 17 ఏళ్ల వయసులోనే జెబా స్కూబా డైవింగ్‌లో శిక్షణ తీసుకున్నా.. 25ఏళ్ల వయసులో కుటుంబంతో మాల్దీవులకు వెళ్లినప్పుడు తొలిసారి ప్రయత్నించింది. అప్పుడే నీటిపై మనసు పారేసుకుంది. ఓసారి ప్రమాదవశాత్తూ నీటిలో జారిన సంఘటన చూసి తోటివారిని కాపాడాలనుకుని ‘రెస్క్యూ డైవింగ్‌’ సర్టిఫికేషన్‌ చేసింది. ఈక్రమంలోనే తనకి షార్క్‌లతో డైవింగ్‌తో గుర్తింపు పొందిన యూఎస్‌కి చెందిన ఓషన్‌ రామ్‌సే పరిచయమైంది. తనతో కలిసి షార్క్‌లతో డైవింగ్‌ చేయడానికి ప్రయత్నించింది. ‘తొలిసారి భయపడ్డా. కానీ నీటిమధ్య ఆ జీవులతో గడుపుతోంటే ఎక్కడలేని ప్రశాంతత. వాటితో ప్రేమలో పడ్డా’ననే జెబా మానవ తప్పిదాల కారణంగా అవి అంతరించిపోవడం తట్టుకోలేకపోయింది. దానిపై అవగాహన కల్పించాలనుకుంది. ‘వన్‌ ఓషన్‌ వన్‌ లవ్‌’ సంస్థలో చేరి ఆసక్తి ఉన్నవారిని షార్క్‌లతో కలిసి డైవింగ్‌ చేయిస్తోంది. దీనికోసం డైవ్‌ మాస్టర్‌ కోర్సునీ చేసింది. ఇలాగైనా సముద్రాలకు, ఆ జీవులకు హాని చేసే పని మానుకుంటారని తన తపనట. ఒకటిన్నరేళ్లుగా ఫ్రీ డైవింగ్‌నీ సాధన చేస్తోంది. ఈ ఏడాది పోటీల్లో పాల్గొని జాతీయ రికార్డునీ సాధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని