ఆమె మాటలే.. నన్ను గనుల్లోకి నడిపించాయి!

‘భూగర్భ గనులు, తవ్వకాలంటే.. మగవాళ్లే గుర్తుకురావాలా? ఈ రంగంలో అమ్మాయిలెందుకు అడుగుపెట్టకూడదు?’ పత్రికా ఇంటర్వ్యూలో ఓ మహిళా శాస్త్రవేత్త అన్నమాటలని ఆ అమ్మాయి మర్చిపోలేకపోయింది.

Updated : 23 Sep 2023 06:53 IST

‘భూగర్భ గనులు, తవ్వకాలంటే.. మగవాళ్లే గుర్తుకురావాలా? ఈ రంగంలో అమ్మాయిలెందుకు అడుగుపెట్టకూడదు?’ పత్రికా ఇంటర్వ్యూలో ఓ మహిళా శాస్త్రవేత్త అన్నమాటలని ఆ అమ్మాయి మర్చిపోలేకపోయింది. ఆ మాటలే ఆమె కెరియర్‌ని మలుపు తిప్పాయి.  కోల్‌ ఇండియాలో అంకం అఖిల సాహితిని మొదటి తెలుగు మహిళా మైనింగ్‌ ఇంజినీర్‌గా తీర్చిదిద్దాయి. ఆ అనుభవాలని ఆమె వసుంధరతో పంచుకుంది... 

‘అబ్బాయిలకు మాత్రమే..’ 2019 వరకూ భూగర్భగనుల్లో ఉద్యోగావకాశాల ప్రకటనలు ఇలానే ఉండేవి. ఇప్పుడిప్పుడే అమ్మాయిలు ఈ రంగంలోకి అడుగుపెడుతూ చరిత్ర సృష్టిస్తున్నారు.మాది జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం. నాన్న జనార్దన్‌ ఆర్టీసీలో కండక్టర్‌గా పనిచేస్తున్నారు. అమ్మ పద్మ.. కొడిమ్యాల మాజీ ఎంపీటీసీ సభ్యురాలు. కరీంనగర్‌లో ఇంటర్‌ అయ్యాక.. కొత్తగూడెం స్కూల్‌ ఆఫ్‌ మైన్స్‌లో ఇంజినీరింగ్‌ చదివా. 2022లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్‌ కూడా చేశా. ఇంట్లో వాళ్లని ఒప్పించి ఈ రంగంలోకి రావడానికి కారణం ఓ ఇంటర్వ్యూ. 

ఆమె స్ఫూర్తితో..

చంద్రాని వర్మ ప్రసాద్‌.. మనదేశంలో మొదటి మహిళా మైనింగ్‌ ఇంజినీర్‌ ఆమె. వాళ్ల నాన్న మైన్‌ మేనేజర్‌. దాంతో ఆసక్తి కొద్దీ ఈ రంగంలో డిప్లొమా చేసినా, మహిళ అన్న కారణంతో క్షేత్రస్థాయిలో పనిచేయడానికి అప్పట్లో తనకి అవకాశం ఇవ్వలేదు. దానికోసం ఆమె పెద్ద పోరాటమే చేశారు. ఆ తర్వాత సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మైన్స్‌ అండ్‌ ఫ్యూయల్‌ రిసెర్చ్‌ సెంటర్‌లో సీనియర్‌ శాస్త్రవేత్తగా స్థిరపడ్డారు. ఆమె ఇంటర్వ్యూ చూసి, నేనూ మైనింగ్‌పై ప్రేమను పెంచుకున్నా. ఇంట్లో చెబితే ఒప్పుకోలేదు. అమ్మాయిలు అడుగు పెట్టని రంగం ఎలా ఉంటుందోనని కంగారు పడ్డారు. కానీ నా ఉత్సాహం చూసి కాదనలేకపోయారు. వేసవిలో ఒకేషనల్‌ శిక్షణలో భాగంగా బీటెక్‌ రెండు, మూడు సంవత్సరాల్లో సింగరేణి ఓపెన్‌కాస్ట్‌ మైనింగ్‌లో 45 రోజుల చొప్పున శిక్షణ అందుకున్నా. ఆ తర్వాత చేస్తే అక్కడే పని చేయాలన్నంత పట్టుదలగా ఉండేదాన్ని. కానీ అప్పటికి దక్షిణాది నుంచి భూగర్భ గనుల్లో పనిచేసే అమ్మాయిలే లేరు. మా ప్రొఫెసర్ల ప్రోత్సాహమే నన్ను ముందుకు నడిపించింది. 

కోల్‌ ఇండియాలో ఉద్యోగం..

ఎంటెక్‌ చివరి ఏడాది చదువుతుండగానే ‘గేన్‌వెల్‌ కోమోసేల్స్‌’ సంస్థలో ఉద్యోగం వచ్చింది. ఆ వెంటనే ‘టాటా స్టీల్‌’లో. దాంతో టాటా సంస్థలో చేరి నాలుగు నెలలు పనిచేశా. ఆ తర్వాత కోల్‌ ఇండియాలో అవకాశం వచ్చింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ సంస్థలో ఉద్యోగం సాధించిన మొదటి అమ్మాయిని. ఇందులో ఎనిమిది విభాగాలు ఉంటాయి. అందులో వెస్ట్రన్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌ కంపెనీ ఒకటి. ఇందులో చేరిన మొదటి మహిళా ఇంజినీర్‌ని నేను. ప్రస్తుతం మహారాష్ట్రలోని బల్లార్షాలో భూగర్భ గనుల్లో పనిచేస్తున్నా. నిత్యం సవాళ్లు నిండిన పని ఇది. రోజూ భూగర్భ గనుల్లోకి 3కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాలి. మగవాళ్లతో కలిసి పనిచేయాలి. ఎప్పుడైనా ప్రమాదకర వాయువులు వెలువడే అవకాశం ఉంటుంది. దానిని దృష్టిలో పెట్టుకొనే పనిచేసుకోవాలి. కానీ మేమెంతో మంది అమ్మాయిలకు స్ఫూర్తి. అందుకే సవాళ్లకు వెనుకడుగు వేయను. జనవరిలో నిర్వహించిన కర్మయోగా ప్రారంభ్‌ కార్యక్రమంలో భాగంగా మాపై చిత్రీకరించిన వీడియోను ప్రధాని నరేంద్రమోదీ ఎదుట ప్రదర్శించారు. అబ్బాయిలకు దీటుగా అమ్మాయిలు కూడా అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. మైనింగ్‌లో మన దేశంతోపాటు విదేశాల్లోనూ అమ్మాయిలకు మంచి ఉద్యోగావకాశాలున్నాయి.

- కంచర్ల నాగార్జున, కొడిమ్యాల


ఆహ్వానం

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని