అమ్మ.. ఆరోగ్యం జాగ్రత్త!

పుట్టిన పాపాయిని చేతుల్లోకి తీసుకొని మురిసిపోవాలి అనుకుంటుంది ఏ తల్లైనా! ఆ పసికూననీ ఎత్తుకోలేక పోయిందామె.

Updated : 26 Sep 2023 02:08 IST

పుట్టిన పాపాయిని చేతుల్లోకి తీసుకొని మురిసిపోవాలి అనుకుంటుంది ఏ తల్లైనా! ఆ పసికూననీ ఎత్తుకోలేక పోయిందామె. ఆ పరిస్థితి దాటడానికి నడకను ప్రారంభించిన మెహక్‌.. ఇప్పుడు ఫిట్‌నెస్‌కి మారుపేరులా ఎలా నిలిచారు?

మెహక్‌ కపూర్‌.. అమృత్‌సర్‌కి చెందిన టెకీ. రెండో ప్రసవం అయ్యాక డిస్క్‌ జారింది. ‘పాపనీ ఎత్తుకోలేకపోయా. చాలా బాధనిపించేది. చాలాకాలం చికిత్స తర్వాత వైద్యుల సలహాతో నడక ప్రారంభించా. చాలా మార్పు కనిపించింది. అదికాస్తా పరుగుగా మారింద’నే మెహక్‌ వ్యాయామాలపైనా దృష్టిపెట్టి ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ అయ్యారు. దేశవ్యాప్తంగా పలు మారథాన్‌లలో పాల్గొని, అల్ట్రారన్నర్‌ అయ్యారు. ఐరన్‌మ్యాన్‌ 70.3 ట్రయాథ్లాన్‌లో పాల్గొని సత్తా చాటారు. ఇంకా ఏదో చేయాలన్న తపన ఆవిడది. ఎంతోమంది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని గ్రహించారామె. అలాంటి వారిలో అవగాహన కలిగించాలని ‘వియ్‌ అమృతసర్‌ రన్నర్స్‌’ కమ్యూనిటీ ప్రారంభించారు. ‘పరుగుతో ఆరోగ్యం’ అంటూ అవగాహన కలిగిస్తున్నారీమె.

తను ప్రారంభించిన కమ్యూనిటీలో 500మందికిపైగా సభ్యులున్నారు. సొంత ఫిట్‌నెస్‌ సెంటర్‌నీ ప్రారంభించి మహిళలకు వ్యాయామ పాఠాలు బోధిస్తున్నారు. తాజాగా చీరలో మారథాన్‌ నిర్వహించి అందరి దృష్టీ ఆకర్షించారు. ‘మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఇల్లంతా సజావుగా సాగుతుంది. కానీ ఆమె మాత్రం బాధ్యతల్లో పడి తనను తాను నిర్లక్ష్యం చేసుకుంటుంది. మనం ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మించగలం. ఈ విషయాన్ని అందరికీ తెలియజెప్పాలనే నా తపన. ఇక చీర సంగతంటారా? అది మన సంప్రదాయానికి ప్రతీక. అయితే ఫలానా దుస్తుల్లోనే వ్యాయామం చేయాలన్న అపోహ చాలామందిది. మనకు సౌకర్యం ఉన్న ఏ వస్త్రాల్లోనైనా చేయొచ్చని చూపడంతో పాటు.. వాటిని ఎంచుకునే హక్కు మనది అని చెప్పాలన్న ఉద్దేశంతో గుడ్‌గావ్‌లో ‘చీరలో మారథాన్‌’ నిర్వహించా. అది విజయవంతం అవ్వడమే కాదు.. పేరూ తెచ్చింది’ అంటారు మెహక్‌. ‘పరుగనే కాదు.. తమకు వీలైన ఏదోక వ్యాయామాన్ని రోజులో కనీసం 15 నిమిషాలు చేయండి. ఇది మీ పట్ల, మీ ఆరోగ్యం పట్లా సానుకూలతను పెంచడమే కాదు.. మీ ఆనందం, మానసిక ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం పైనా ప్రభావం చూపుతుంది. కాబట్టి నిర్లక్ష్యం చేయొద్దు’ అనే మెహక్‌ రచయిత కూడా. ‘ఫ్రం డబ్ల్యూ టూ వియ్‌’ పేరుతో పుస్తకాన్నీ రచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని