ఔరా... సారా!

ఎదుటివారు చెప్పేది సరిగా అర్థం చేసుకోలేకపోతేనే ఎన్నో గొడవలు, మరెన్నో సమస్యలు. తను మాత్రం ఒక్కమాటా నోరు విప్పి చెప్పలేదు. ఇతరులు చెప్పింది వినలేదు. అయినా సరే, ఈ బధిర న్యాయవాది తన సైగలతోనే తన వాదనలను సుప్రీంకోర్టులో వినిపించింది. దేశం మొత్తాన్ని ఔరా అనిపించింది. ఆమే సారా సన్నీ.

Updated : 27 Sep 2023 07:04 IST

ఎదుటివారు చెప్పేది సరిగా అర్థం చేసుకోలేకపోతేనే ఎన్నో గొడవలు, మరెన్నో సమస్యలు. తను మాత్రం ఒక్కమాటా నోరు విప్పి చెప్పలేదు. ఇతరులు చెప్పింది వినలేదు. అయినా సరే, ఈ బధిర న్యాయవాది తన సైగలతోనే తన వాదనలను సుప్రీంకోర్టులో వినిపించింది. దేశం మొత్తాన్ని ఔరా అనిపించింది. ఆమే సారా సన్నీ.

వైకల్యం శరీరానికే కానీ, సాధించాలనే తన సంకల్పానికి కాదు అంటోంది సారా. తాజాగా సుప్రీంకోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా సైగలతో తన వాదనలు వినిపించి చరిత్ర సృష్టించింది. ఈ స్థాయికి రావడానికి ఎన్నో అడ్డంకులను దాటి ఆత్మవిశ్వాసాన్ని చాటింది. సారా స్వస్థలం కేరళలోని కొట్టాయం. తండ్రి సన్నీ ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌. తల్లి బెట్టీ. వీరికి ముగ్గురు సంతానం. కొడుకు ప్రతీక్‌ పుట్టిన ఎనిమిదేళ్లకు ఇద్దరు కవల ఆడపిల్లలు జన్మించారు. వారిలో సారా ఒకరు. దురదృష్టవశాత్తూ ఈ ముగ్గురూ జన్యులోపాల వల్ల వినికిడితో పాటూ మాట్లాడే సామర్థ్యాన్నీ కోల్పోయారు. దాంతో ముద్దు ముద్దు మాటలతో మురిపిస్తారనుకున్న తమ బిడ్డలు వినలేరనీ, మాట్లాడలేరనీ తెలిసి ఆ తల్లిదండ్రులు పడ్డ బాధ వర్ణనాతీతం. ఆ చిన్నారుల భవిష్యత్తుని సందేహిస్తూ బంధువులూ, ఇరుగుపొరుగూ మాటలతో ఎన్నో అవమానాల్నీ దిగమింగుకున్నారు. అయితే, వీటి ప్రభావం తమ పిల్లలపై పడకూడదనుకున్నారు. వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపి ప్రపంచాన్ని జయించే ధీరులుగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసమే తమ మకాం బెంగళూరుకి మార్చేశారు.


అప్పటి నుంచీ వాదనే...

వలల్లో మరియా శాంతంగా ఉంటే సారా అల్లరిపిల్ల. మాట్లాడలేకపోయినా స్కూల్లో తోటి చిన్నారులతో మాత్రం బాగా పోట్లాడేది. అంతేనా, ఎంతమంది ఉన్నా, ఎంత గొప్ప వ్యక్తి ముందున్నా... తాను అడగాలనుకున్నది నిస్సంకోచంగా ప్రశ్నించేది. అది చూసి భవిష్యత్తులో తను న్యాయవాది అవుతుందని ఆమె తల్లిదండ్రులు అనుకునేవారట. తర్వాత మరియా తండ్రి బాటలో నడిచి ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌ అయితే, సారా ఎల్‌ఎల్‌బీ చేసి న్యాయవాద వృత్తిని ఎంచుకుంది. ‘ఒకప్పుడు బధిరురాలు న్యాయవాదిగా ఎలా వాదించగలదని నవ్విన వారే, ఇప్పుడు మెచ్చుకుంటున్నారు. అది చూసి మా అమ్మానాన్నలెంతో గర్వంగా ఫీలవుతున్నార’ని చెబుతోంది సారా.


కలలు సాధించి...

సారా తల్లిదండ్రులు సన్నీ, బెట్టీలు... లా చదవాలనుకుంటున్న సారా అడ్మిషన్‌ కోసం కాలేజీలెన్నో తిరిగారు. చివరికి సెయింట్‌ జోసెఫ్‌ లా కాలేజీలో సీటు దొరికింది. ‘నేను న్యాయవాద వృత్తినెంచుకుంది ఈ రంగంపై ఉన్న ఆసక్తితో మాత్రమే కాదు... నాలా వైకల్యం ఉన్న వారికి ఓ ఉదాహరణగా నిలవాలని కూడా. వికలాంగుల, మానవ హక్కుల చట్టాలపై పట్టు తెచ్చుకోవడంతో పాటు, బిజినెస్‌లాలో కెరియర్‌ని సాగించాలన్నదే నా ప్రధాన లక్ష్యం. న్యాయశాస్త్ర పట్టా అందుకున్నాక కర్ణాటక బార్‌ కౌన్సిల్‌లో సభ్యురాలిగా పేరు నమోదు చేయించుకున్నా. అప్పుడే తెలిసింది... న్యాయవాద వృత్తిని చేపట్టిన తొలి బధిరురాలు నేనే’నని చెప్పుకొచ్చింది సారా. సెంటర్‌ ఫర్‌ లా అండ్‌ పాలసీ రిసెర్చ్‌తో పాటు పలు ప్రముఖ సంస్థల్లో ఇంటర్న్‌గా, దిల్లీకి చెందిన నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ లా నెట్‌వర్క్‌లో సభ్యురాలిగానూ ఉంది. ప్రస్తుతం ‘తిరు అండ్‌ తిరు’ అసోసియేట్స్‌లో పనిచేస్తూ సుప్రీంకోర్టు న్యాయవాది సంచితా ఐన్‌ వద్ద జూనియర్‌గా వ్యవహరిస్తోంది. తాజాగా సుప్రీంకోర్టులో వర్చువల్‌గా జరిగిన ఓ కేసు విచారణలో తన వాదనలను సంకేత భాషతో సాగించి వార్తలోకెక్కింది. ఈ ప్రక్రియను ఇండియన్‌ సైన్‌ లాంగ్వేజ్‌ (ఐఎస్‌ఎల్‌) వ్యాఖ్యాత సౌరవ్‌ రాయ్‌ చౌదరి అనువదించారు. ‘కలలు కనడంతోనే లక్ష్యాన్ని సాధించేయలేం. కోరుకున్నదానికోసం కష్టపడాలి. అవమానాలు, కన్నీళ్లు, కష్టాలు వంటివెన్నో స్థైర్యంతో దాటగలగాలి’ అంటోంది సారా.


ఆహ్వానం

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని