సవాళ్లు దాటి...మెరిశారు!

పోడియం మీద నిల్చొని పతకం అందుకోవడం.. క్రీడాకారులు ఎదురు చూసే క్షణమది. గెలుపు.. దాంతో వచ్చే ప్రశంసలు, గుర్తింపే అందరికీ కనిపిస్తాయి. కానీ దాని వెనక కఠోర శ్రమే కాదు.. కష్టాలు, సవాళ్లు, విమర్శలూ ఎన్నో దాగుంటాయి.

Updated : 28 Sep 2023 07:12 IST

పోడియం మీద నిల్చొని పతకం అందుకోవడం.. క్రీడాకారులు ఎదురు చూసే క్షణమది. గెలుపు.. దాంతో వచ్చే ప్రశంసలు, గుర్తింపే అందరికీ కనిపిస్తాయి. కానీ దాని వెనక కఠోర శ్రమే కాదు.. కష్టాలు, సవాళ్లు, విమర్శలూ ఎన్నో దాగుంటాయి. వాటన్నింటినీ దాటి సత్తాచాటుతున్న వారిలో కొందరు వీళ్లు. ఆసియా క్రీడల్లో పతకాలు సాధించి దేశానికి గర్వకారణం అయ్యారు.


పరుగు వదిలి..
తితాస్‌ సాధు

నాన్న రణ్‌దీప్‌ క్రీడాకారుడు. శిక్షణ సులువయ్యేలా సొంత క్రికెట్‌ అకాడమీనే ఉంది. ఇంకేం సులువుగా కెరియర్‌లో దూసుకెళ్లొచ్చు అనిపిస్తుంది కదూ! కానీ తితాస్‌కి మాత్రం తిరస్కరణలొచ్చాయి. ఈమెది పశ్చిమ్‌బంగాలోని చిన్సురా. చదువు, ఆటలు రెండిట్లో ముందుండే తితాస్‌ అసలు ఎంచుకున్నది పరుగు, ఈత. అనుకోకుండా క్రికెట్‌లోకి వచ్చింది. నాన్నకు అకాడమీ పనుల్లో సాయపడేది. ఓసారి సరదాగా బౌలింగ్‌ చేసినప్పుడు ఈమెలో దాగున్న ప్రతిభ బయటపడింది. ఇంకేం శిక్షణిచ్చారు. అలా బంతిపై ప్రేమను పెంచుకున్న తితాస్‌ జట్టులో స్థానం కోసం కష్టపడింది. కానీ రాష్ట్రస్థాయిలో తిరస్కరణకు గురైంది. 13 ఏళ్లమ్మాయి.. తనకది పెద్ద షాకే! అయినా కసిగా ప్రయత్నించి సీనియర్‌ టీమ్‌లో స్థానం సంపాదించింది. అండర్‌-19 వరల్డ్‌కప్‌ గెలిచిన బృందంలో తితాస్‌ సభ్యురాలు. డబ్ల్యూపీఎల్‌లో స్థానం సంపాదించినా నిరూపించుకునే అవకాశం మాత్రం ఆసియా క్రీడల్లో లభించింది. దాన్ని అందిపుచ్చుకొని జట్టు బంగారు పతకం సాధించడంలో ప్రధాన పాత్ర పోషించింది. మూడు వికెట్లు తీసి ‘మరో జులన్‌’ అన్న పేరునూ తెచ్చుకుంది 18ఏళ్ల తితాస్‌.


రైతు బిడ్డ
నేహా ఠాకూర్‌

క్క గెలుపుతో స్టారవ్వడం నేహకు సరిగ్గా సరిపోతుంది. గతఏడాది ఆసియన్‌ ఛాంపియన్‌షిప్‌తో అలాగే వెలుగులోకి వచ్చిందీ 17ఏళ్లమ్మాయి. మధ్యప్రదేశ్‌లోని చిన్న పల్లె తనది. నాన్న రైతు. సైకిల్‌, బైక్‌ ట్యూబ్‌లను నడుముకి కట్టుకొని పిల్లకాలువల్లో ఈదడమంటే సరదా తనకి. సెయిలింగ్‌లోకి అనుకోకుండానే వచ్చింది. తన కజిన్‌ సెయిలింగ్‌లో శిక్షణ తీసుకుంటోంటే నేహ కూడా వెళ్లి ప్రయత్నించింది. అనుభవం లేకపోయినా నీటిలోతు, గాలివాటాలను ఇట్టే పట్టేసే తన తీరు చూసి కోచ్‌ ఆమెకు సెయిలింగ్‌ నేర్పించాలనుకున్నారు. పల్లె అమ్మాయి.. పైగా టీనేజర్‌.. ఊరికి దూరంగా ఉంచడానికి ఇంట్లోవాళ్లు సందేహించారు. డబ్బు కష్టాలు సరే సరి. అందరినీ ఒప్పించి గుర్తింపు తెచ్చుకుంటోంది నేహ. ఆసియా క్రీడల్లో వెండి పతకంతో మెరిసి తన వాళ్లకి గర్వంగా నిలిచింది.


డిప్రెషన్‌ని దాటొచ్చింది
మెహులీ ఘోష్‌

స్టార్‌ షూటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న మెహులి.. గన్‌ కొనుక్కోవడానికే ఏడాది ఎదురు చూసింది. అదీ తన కుటుంబ ఆర్థిక పరిస్థితి. వీళ్లది కోల్‌కతా. నాన్న సాధారణ క్లర్క్‌. టీవీలో క్రీడా పోటీలను చూస్తోన్న మెహులీని షూటింగ్‌ ఆకర్షించింది. ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన అభినవ్‌ బింద్రాని చూశాక తనూ ఆ స్థాయికి చేరాలనుకుంది. స్థోమత లేకపోయినా కూతురి ఆశను కాదనలేక ఆమె అమ్మానాన్న ఏడాది కష్టపడి రైఫిల్‌ కొనిచ్చి క్లబ్‌లో చేర్చారు. కానీ అదో పీడకల అవుతుందని మెహులి కూడా ఊహించలేదు. షూటింగ్‌లో కొద్దిరోజుల్లోనే పట్టు సాధించిన మెహులి.. ఓరోజు సాధన చేస్తూ అనుకోకుండా ఒకరిని గాయపరిచింది. తెలియక జరిగిన తప్పైనా క్లబ్‌ వాళ్లు తను షూటింగ్‌కే పనికి రాదని బహిష్కరించారు. 14 ఏళ్ల వయసులో అది తట్టుకోలేక డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. ఆమె స్థితిని చూసిన వాళ్ల నాన్న షూటర్‌ జయ్‌దీప్‌ కర్మాకర్‌ని కలిసి మెహులికి శిక్షణిమ్మని కోరారు. అయిష్టంగానే ఒప్పుకొన్న జయ్‌దీప్‌ ఆమెలో ప్రతిభను చూశాక సీరియస్‌గా ట్రైనింగ్‌ ఇచ్చారు. తిరస్కరణలను సవాలుగా తీసుకున్న మెహులి కూడా చాలా శ్రమించింది. అకాడమీకి వెళ్లడానికే 2గం. పట్టేది. ఇంటికొచ్చే సరికే పొద్దుపోయేది. అయినా వెనకాడలేదు. ఓవైపు చదువులో సత్తా చాటుతూనే అంతర్జాతీయ పోటీల్లో గెలవడం మొదలుపెట్టింది. ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ వరల్డ్‌కప్‌, కామన్‌వెల్త్‌ గేమ్స్‌, సౌత్‌ ఆసియన్‌ గేమ్స్‌ల్లో పతకాలు, జూనియర్‌ వరల్డ్‌ రికార్డునీ సాధించింది. పశ్చిమ్‌బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీతోపాటు ప్రధాని ప్రశంసలూ అందుకుంది. తాజా ఆసియన్‌ క్రీడల్లో 10ఎమ్‌ రైఫిల్‌ టీమ్‌ విభాగంలో రజతం సాధించిన 21ఏళ్ల మెహులి కల ఒలింపిక్‌ పతకం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని