పార్లమెంటులో... స్ఫూర్తి పాఠాలు

కొత్త పార్లమెంటు వేదికగా.. ఒక్కో రాష్ట్రం నుంచి.. ఒక్కో యువ ప్రతినిధి.  స్వతంత్ర భారతావనికి పునాదులు వేసిన మహానుభావుల గురించి ప్రసంగించాలి. ఈ అరుదైన అవకాశం ఊరకనే రాదుగా! దేశవ్యాప్తంగా ఎంపికలు.. బోలెడన్ని వడపోతలు. పాతికమంది ఈ  అవకాశాన్ని సొంతం చేసుకుంటే అందులో మన తెలుగమ్మాయిలూ ఉన్నారు. వసుంధర వారితో మాట్లాడింది..  

Updated : 02 Oct 2023 07:08 IST

కొత్త పార్లమెంటు వేదికగా.. ఒక్కో రాష్ట్రం నుంచి.. ఒక్కో యువ ప్రతినిధి.  స్వతంత్ర భారతావనికి పునాదులు వేసిన మహానుభావుల గురించి ప్రసంగించాలి. ఈ అరుదైన అవకాశం ఊరకనే రాదుగా! దేశవ్యాప్తంగా ఎంపికలు.. బోలెడన్ని వడపోతలు. పాతికమంది ఈ  అవకాశాన్ని సొంతం చేసుకుంటే అందులో మన తెలుగమ్మాయిలూ ఉన్నారు. వసుంధర వారితో మాట్లాడింది..  

మూడునిమిషాలు మాట్లాడి
ప్రతిమ బల్దువ

మాది హనుమకొండ జిల్లా రామన్నపేట. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఎస్సీ కెమిస్ట్రీ చదువుతున్నా. నాన్న విష్ణుకుమార్‌, అమ్మ కవిత. ఇద్దరూ అధ్యాపకులే. వారి ప్రభావంతోనే చిన్నతనం నుంచీ  వక్తృత్వ, వ్యాసరచన పోటీల్లో పాల్గొనేదాన్ని. 7వ తరగతిలో తొలిసారి వక్తృత్వ పోటీలో మాట్లాడి.. అప్పటి జిల్లా కలెక్టర్‌ వాకాటి కరుణ చేతుల మీదుగా పురస్కారం పొందా. ఇప్పటి వరకూ 20కి పైగా జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో బహుమతులు గెలుచుకున్నా. ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నెహ్రూ యువకేంద్ర సంగటన్‌ వారు నిర్వహించిన పోటీల్లో జిల్లా స్థాయిలో పాల్గొని మొదటి బహుమతి గెలుచుకున్నా. రాష్ట్రస్థాయిలో.. హైదరాబాద్‌లో సెప్టెంబరు 20న జరిగిన ఆన్‌లైన్‌ పోటీల్లో పాల్గొన్నా. ‘గాంధీ ఆలోచనలు ఈ తరంపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి’ అనే అంశంపై ప్రసంగించా. గాంధీజీ స్ఫూర్తితో ఆత్మ నిర్భర్‌ భారత్‌, మేకిన్‌ ఇండియా లాంటి నినాదాలతో ఆయన అడుగుజాడల్లో భారత్‌ ఎలా నడుస్తోందో మూడు నిముషాలు మాట్లాడడంతో రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంలో నిలిచా. గాంధీ జయంతి సందర్భంగా పార్లమెంటులో జరిగే కార్యక్రమంలో తెలంగాణ ప్రతినిధిగా నాకు అవకాశం వచ్చింది. ఎప్పటికైనా ప్రజలకు సేవ చేసే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలన్నదే నా లక్ష్యం.

గుండు పాండురంగశర్మ, వరంగల్‌


నాన్న కష్టం వృథా కాకూడదనిజ్ఞ

అరుణ

మాది వైయస్‌ఆర్‌ జిల్లా కడప. నాన్న హరిప్రసాద్‌ ఆటో డ్రైవర్‌. అమ్మ రమాదేవి. తమ్ముడు అభిరామ్‌. నాన్న కష్టం చూసి.. బాగా చదివేదాన్ని. ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లోనే చదువుకున్నా. టెన్త్‌ స్కూల్‌ ఫస్ట్‌. బీఎస్సీ 93 శాతం మార్కులతో పాసయ్యా. చాలా స్కాలర్‌షిప్‌లూ అందుకున్నా. ఇరుగు, పొరుగు పిల్లలకి ట్యూషన్లు చెబుతూ.. ఖాళీ సమయాల్లో అమ్మతో కలిసి బుట్టలు అల్లేదాన్ని. చిన్నతనం నుంచీ వక్తృత్వం, పాటలు, చిత్రలేఖనం పోటీలు ఎక్కడ జరిగినా పాల్గొనేదాన్ని. జాతీయ, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని బహుమతులు గెల్చుకున్నా. ఇంట్లో రోజూ ఏదో ఒక విషయంపై చర్చించుకునేవాళ్లం. అలా మాట్లాడటం ఒక అలవాటుగా మారింది. బిడియం తగ్గింది. వార్తాపత్రికలు బాగా చదువుతుంటా. అలానే ఈ పోటీల గురించి తెలుసుకుని దరఖాస్తు చేశా. సమాచారం అంతా సేకరించి, సిద్ధమయ్యా. జిల్లా, రాష్ట్ర స్థాయుల్లో వేర్వేరు అంశాలపైన మాట్లాడించారు. ‘గాంధీజీ, లాల్‌బహదూర్‌ శాస్త్రి జీవన విధానాలు.. సమాజంపై ప్రభావం’ అనే అంశంపై మాట్లాడి ఏపీలో విజేతగా నిలవడంతో పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్లో ప్రసంగించే అవకాశం వచ్చింది. ప్రస్తుతం అంబేడ్కర్‌ యూనివర్సిటీ నుంచి ఓపెన్‌లో ఎమ్మెస్సీ మేథమేటిక్స్‌ చేస్తున్నా. ఇంటి నుంచే యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్నా.

బోగెం శ్రీనివాసులు, కడప


కొత్త కాదు కానీ ప్రత్యేకంజ్ఞ

అనఘ

న్యాయవాద వృత్తి చేపట్టి పేదల గొంతుక అవ్వాలన్నది అనఘ కల. తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పడం ఆమె నైజం. తన వాదనలో నిజాయతీ ఉందని నమ్మితే ఎవరికీ భయపడదీమె. ఆ తత్వంతోనే ఎన్నో వక్తృత్వ పోటీల్లో పాల్గొని గెలుపొందింది కూడా. ఈమెది కేరళలోని త్రిపుణితిర. ఎల్‌ఎల్‌బీ ఆఖరి సంవత్సరం చదువుతోంది. వాయిస్‌ ఆఫ్‌ ఇండియా వంటి పోటీల్లో జాతీయస్థాయి బహుమతులనూ గెలుచుకుంది. కేంద్రం తరఫున నెహ్రూ యువ కేంద్ర సంగటన్‌ నిర్వహించిన ‘యూత్‌ పార్లమెంట్‌ ప్రోగ్రామ్‌’లో పాల్గొని లాల్‌బహదూర్‌ శాస్త్రి, ఆయన జీవిత పాఠాలపై మాట్లాడి.. ప్రథమ బహుమతి గెల్చుకుంది. తాజాగా కేరళ తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ,  పార్లమెంట్‌లో ప్రసంగించే అవకాశాన్నీ అందుకుంది.‘గెలవడం బహుమతులు అందుకోవడం కొత్త కాదు. కానీ ఈసారి కొత్త పార్లమెంటును అందరూ టీవీల్లో చూస్తోంటే నేను అక్కడ అడుగుపెట్టడమే కాదు.. మాట్లాడే అవకాశమూ దక్కడం ఆనందంగా ఉంది’ అంటోంది అనఘ.


ఆహ్వానం

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని