దర్జీ కుమార్తె.. జడ్జీ!

సమాజంలో న్యాయం నిలబడాలి.. కులమతాలు, వర్గ విభేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి న్యాయం అందాలనే ఆలోచన తండ్రిది... ఆయన కోరికల్ని తన ఆశయంగా మార్చుకోవాలన్న తపన తనయది. అందుకోసమే పట్టుదలగా చదివారామె. చిన్న వయసులోనే జూనియర్‌ సివిల్‌ జడ్జిగా నియమితులయ్యారు ఇల్లుటూరి హారిక.

Updated : 03 Oct 2023 07:33 IST

సమాజంలో న్యాయం నిలబడాలి.. కులమతాలు, వర్గ విభేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి న్యాయం అందాలనే ఆలోచన తండ్రిది... ఆయన కోరికల్ని తన ఆశయంగా మార్చుకోవాలన్న తపన తనయది. అందుకోసమే పట్టుదలగా చదివారామె. చిన్న వయసులోనే జూనియర్‌ సివిల్‌ జడ్జిగా నియమితులయ్యారు ఇల్లుటూరి హారిక.

‘సంకల్పం గట్టిదైతే సాధ్యం కానిది ఏమీ లేదని’ చెప్పే తండ్రి మాటలే స్ఫూర్తిగా లక్ష్య సాధనకు ప్రయత్నించారు హారిక. ఆమె లక్ష్మయ్య, స్వరూప దంపతుల ముగ్గురు కుమార్తెల్లో ఒకరు. దర్జీ పనిచేసి కుటుంబాన్ని పోషించేవారామె తండ్రి. ఆ సమయంలో ఇంటి పక్కనే ఓ కోర్టు ఉండేది. అక్కడికి వచ్చే న్యాయవాదులు, న్యాయమూర్తులను చూసి తన కూతుళ్లలో ఒకరిని న్యాయమూర్తిని చేయాలనుకున్నారాయన.. ఈలోగా సింగరేణి సంస్థలో బదిలీ ఫిల్లర్‌ కార్మికుడిగా ఉద్యోగం దొరికింది. దాంతో 20ఏళ్లపాటు గోదావరిఖనిలో పనిచేశారు. తర్వాత ఇల్లెందు ఏరియాలో వంట కార్మికుడిగా నియమించడంతో తిరిగి స్వస్థలానికి చేరారు. పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చిన ఆయన వారు బాగా చదువుకోవాలని తపన పడేవారు. తండ్రి ఆలోచనకు తగ్గట్టుగానే వారిలో హారిక చిన్నతనం నుంచీ చదువుల్లో చురుకు. ఆమె విద్యంతా గోదావరిఖని, కొత్తగూడెంలో జరిగింది. ఆపై బీఏ ఎల్‌ఎల్‌బీ కాకతీయ యూనివర్సిటీలో, ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు.

మొదటి న్యాయమూర్తి..  గిరిజన ప్రాంతమైన ఇల్లెందు చరిత్రలో ఇప్పటివరకు న్యాయమూర్తిగా ఇక్కడివారెవరూ ఎంపిక కాలేదు. హారిక ఈ ఘనత సాధించారు. 2022లో జేసీజే నోటిఫికేషన్‌ రావటంతో రాత్రీపగలూ శ్రమించారు. వేలమంది రాసిన ఈ పరీక్షలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి హారిక న్యాయమూర్తిగా ఎంపికయ్యారు.వరంగల్‌ థర్డ్‌ అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికై తండ్రి కోరిక నెరవేర్చారు. ‘లక్ష్యం ఎంచుకుంటేనే సాధించగలం. తల్లిదండ్రుల కలల్ని సాకారం చేయాల్సింది మనమే. ఇందుకోసం ఓటమి గురించి ఆలోచించకుండా ఓపిగ్గా ప్రయత్నించాలం’టారు హారిక.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని