కృత్రిమ మేధా సంచలనం.. మీరా మురాఠి!

మహిళా సీఈఓలు కొత్తేమీ కాదు.. చిన్నవయసులో నాయకత్వ హోదా అందుకున్న వారికీ కొదవలేదు. అయినా ఈ సీఈఓ.. గురించి మాత్రం నెట్టింట తెగ వెదుకుతున్నారు. 34ఏళ్ల మీరా మురాఠి..

Updated : 21 Nov 2023 03:19 IST

మహిళా సీఈఓలు కొత్తేమీ కాదు.. చిన్నవయసులో నాయకత్వ హోదా అందుకున్న వారికీ కొదవలేదు. అయినా ఈ సీఈఓ.. గురించి మాత్రం నెట్టింట తెగ వెదుకుతున్నారు. 34ఏళ్ల మీరా మురాఠి.. ఈ నయా నాయకురాలి ప్రత్యేకతేంటి?

చాట్‌ జీపీటీ, డ్రైవర్‌ లేని కారు.. మానవ జీవితాన్ని సుగమం చేయడానికి రూపొందిన ఈ టెక్నాలజీలు మనల్ని మామూలుగా ఆశ్చర్యంలో ముంచెత్తలేదు కదూ! వీటి అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు.. మీరా మురాఠి. చాట్‌జీపీటీ మాతృసంస్థ ఓపెన్‌ ఏఐకు నాయకత్వం వహించే అవకాశాన్నీ అందుకున్నారు. కేవలం అయిదేళ్లలో ఈ స్థాయికి చేరుకొని అందరి దృష్టినీ ఆకర్షించారు. మీరా పుట్టింది అల్బేనియాలో. గణితం అంటే ఇష్టం. కానీ తను పుట్టిన దేశంలో ఆ సబ్జెక్టుకి అంత ఆదరణ లేదని టీనేజీలోనే కెనడాకి మారారు. మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదువుతున్నప్పుడే హైబ్రిడ్‌ కారుని తయారు చేసి, సంస్థలను ఆకర్షించారు. తర్వాత గోల్డ్‌మన్‌శాక్స్‌, ఓ ఏరోస్పేస్‌ సంస్థలో పనిచేసి టెస్లాకి మారారు. సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కారు ‘మోడల్‌ ఎక్స్‌’కు సీనియర్‌ ప్రొడక్ట్‌ మేనేజర్‌ తను. దీనిపై పనిచేస్తున్నప్పుడే మీరాను ఏఐ ఆకర్షించింది.

ఓ వర్చువల్‌ రియాలిటీ సంస్థకు మారాక దీనిపై ప్రయోగాలు చేయాలనుకున్నారు. ‘చేసేదేదైనా మానవాళికి ప్రయోజనం చేకూరా’లంటారీమె. కృత్రిమ మేధతో ఎన్నో పనులను సులభతరం చేయొచ్చని నమ్మాక ‘ఓపెన్‌ ఏఐ’కి మారారు. సూపర్‌ కంప్యూటింగ్‌ పరిశోధనాత్మక బృందంలో భాగమైన మీరా.. గత ఏడాది చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ బాధ్యతలు అందుకున్నారు. చాట్‌ జీపీటీ, డాల్‌- ఈ, కోడెక్స్‌ వంటి ప్రాజెక్టుల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు. టెక్నాలజీ వల్ల వచ్చే ప్రమాదాలు, అభివృద్ధిలో పాటించాల్సిన విలువలపైనా అవగాహన కల్పిస్తున్నారు. మైక్రోసాఫ్ట్‌తో కలిసి పనిచేయడంలోనే కాదు.. సంస్థ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ పాలసీ రూపకల్పనలోనూ ప్రధాన పాత్ర పోషించారు. ‘బృందాలను నడిపించడంలో దిట్ట’ అంటూ మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్యనాదెళ్ల వంటివారి నుంచి కితాబులూ అందుకున్నారు. అందుకే తాత్కాలికమే అయినా సంస్థలో చేరిన కొన్నేళ్లలోనే సీఈఓ బాధ్యతలను అందుకున్నారు. అందరి చేతా ఔరా అనిపించుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్