అరవడానికి... ఆరు లక్షలు!

చుట్టూ ఎత్తైన చెట్లు... ఎటు చూసినా పచ్చదనం. ఓ మహిళా బృందమంతా అక్కడకు చేరుకుంది. ఏ పిక్నిక్‌కో, ట్రెకింగ్‌కో అనుకుంటున్నారా? అలాంటిదే... కాకపోతే వాళ్లక్కడ చేసేది ఆడిపాడటం కాదు. అరవడం, అక్కడున్న వస్తువులను పగలకొట్టడం.

Published : 01 Jun 2024 15:17 IST

చుట్టూ ఎత్తైన చెట్లు... ఎటు చూసినా పచ్చదనం. ఓ మహిళా బృందమంతా అక్కడకు చేరుకుంది. ఏ పిక్నిక్‌కో, ట్రెకింగ్‌కో అనుకుంటున్నారా? అలాంటిదే... కాకపోతే వాళ్లక్కడ చేసేది ఆడిపాడటం కాదు. అరవడం, అక్కడున్న వస్తువులను పగలకొట్టడం. ఏమిటిది అని ఆశ్చర్యపోతున్నారా? దీన్ని ‘రేజ్‌ రిచ్యువల్‌’ అంటారు. విదేశాల్లో దీనికి బాగా ఆదరణ ఏర్పడుతోంది. ఇంతకీ ఇదేమిటంటే...

‘ఆడపిల్లలా ఆ ఏడుపేంటి?’... అబ్బాయిలు కంటతడి పెట్టినప్పుడు చాలామంది చెప్పే మాటే ఇది. కానీ ఆ బాధను లోపల అణచిపెట్టలేక మానసికంగా ఎంత ఇబ్బంది పడతారో తెలుసా? ఇక మహిళల విషయానికొస్తే ఆ పరిస్థితి మరీ దారుణం. అమ్మాయి ఏడవకూడదు, కోపాన్ని చూపకూడదు, పెద్దగా మాట్లాడకూడదు... ఇవన్నీ లోపల గూడుకట్టుకొని పోయి మనసు భారమైపోతుంది. రానురానూ అన్నింటిపై అనాసక్తి, తీవ్ర ఒత్తిడి, అసహనాలకు లోనవుతుంటారు. కొందరు ఇవన్నీ గుర్తించుకుని యోగ, ధ్యానంపై దృష్టిపెడుతున్నా... మౌనంగా ఆ భారాన్ని మోసేవారే ఎక్కువ. దీనికి పరిష్కారంగా వచ్చిందే ఈ ‘రేజ్‌ రిచ్యువల్‌’. దీన్ని మియా బంధూకీ అనే అమెరికన్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ ప్రారంభించారు.

దీనిలో కొంతమంది మహిళలు బృందంగా ఏర్పడతారు. ఓ అటవీ ప్రాంతాన్ని ఎంచుకుని అక్కడికి వెళతారు. మనసులోని భారమంతా దిగేలా గట్టిగా అరుస్తారు. అక్కడున్న వస్తువులను విరగ్గొడతారు. దీనికోసం ప్రత్యేకంగా ఎండిన కర్రలను ఏర్పాటు చేస్తారట. పూర్తిగా కోపమంతా దిగేదాకా ఇలా కొడతారు. పూర్తయ్యాక లోలోపల దాగున్న కోపమంతా బయటికొచ్చినట్లు ప్రశాంతంగా భావిస్తున్నవారే ఎక్కువట. అందుకే వీటికి ప్రాధాన్యం పెరుగుతోంది. అయితే, ఇవి ఉచితం కాదండోయ్‌. డబ్బులు కట్టాలి. ఒక్కరోజు, రెండురోజుల ప్యాకేజీలు ఉంటాయి. వీటికి రూ.3 లక్షల నుంచి 6 లక్షల వరకూ ఖర్చు అవుతోందట. ‘ఇంతకట్టి అక్కడిదాకా ఎందుకు? ఇంట్లోనే ప్రయత్నించొచ్చుగా అనుకుంటున్నారేమో... ఇంట్లో అయితే వేరేవాళ్లకి అసౌకర్యం. పైగా వస్తువులూ పాడవుతాయి. పోలీసు కేసులు సరేసరి. అదే ఇలాంటి ప్రశాంతమైన ప్రదేశాలైతే ఎవరికీ ఇబ్బంది ఉండదు. మనసుకీ హాయి’ అనీ చెబుతున్నారట. పైగా మానసిక నిపుణులూ ఈ విధానంలో కోపం, బాధ తగ్గి ఆనందం పెరుగుతుందని చెబుతున్నారట. అందుకే ఇంత ఖర్చుకీ ఆడవాళ్లు వెనకాడట్లేదు. మరి ఈ విధానం మీకెలా అనిపించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్