నేనెవరిని ప్రేమించాలి?

ఇంటర్‌ చదువుతున్నా. తొలిఏడాదిలోనే ఒకబ్బాయిని ఇష్టపడ్డా. కానీ అతను వేరేవాళ్లని ఇష్టపడుతున్నాడని పక్కకు తప్పుకొన్నా. ఇంతలో మరొక అబ్బాయి నన్ను ప్రేమిస్తున్నా అన్నాడు. మంచివాడని ఒప్పుకొన్నా. తీరా నేను ప్రేమించిన అబ్బాయికీ నేనంటేనే ఇష్టమట. ఇప్పుడు ఈ ఇద్దరిలో నేనెవరిని ప్రేమించాలి?

Published : 21 Jun 2024 15:07 IST

ఇంటర్‌ చదువుతున్నా. తొలిఏడాదిలోనే ఒకబ్బాయిని ఇష్టపడ్డా. కానీ అతను వేరేవాళ్లని ఇష్టపడుతున్నాడని పక్కకు తప్పుకొన్నా. ఇంతలో మరొక అబ్బాయి నన్ను ప్రేమిస్తున్నా అన్నాడు. మంచివాడని ఒప్పుకొన్నా. తీరా నేను ప్రేమించిన అబ్బాయికీ నేనంటేనే ఇష్టమట. ఇప్పుడు ఈ ఇద్దరిలో నేనెవరిని ప్రేమించాలి?

ఓ సోదరి

ఇంటర్‌ చదువుతున్నావంటే ఇంకా చిన్నమ్మాయివే! ఈ లేత వయసులో దృష్టి పెట్టాల్సింది ప్రేమ మీద కాదు... చదువు మీద. స్కూల్‌ నుంచి కాలేజీకి వచ్చేసరికి చాలామంది పిల్లలు పెద్దవాళ్లం అయిపోయాం, రెక్కలు విప్పిన పక్షిలా స్వేచ్ఛగా ఉండాలనుకుంటారు. ఈ క్రమంలో తప్పటడుగులు వేస్తుంటారు. ఇప్పుడు నువ్వు చేస్తోందీ అదే! ‘ప్రేమ’ అనే పదానికి సరైన అర్థం తెలుసుకునే వయసు కాదు నీది. వ్యక్తి రూపం నచ్చో, బాగా చదువుతారనో, మాట్లాడతారనో ఆకర్షణకు గురై అదే ప్రేమ అనుకుంటారు. అవతలి వ్యక్తి కాదంటే జీవితమే లేదని కుంగిపోతారు. ముందు ప్రేమ అన్న నీ ఆలోచనే సరైనది కాదు. ఆ వ్యక్తి ఎందుకు నచ్చారని నీకు నువ్వే ప్రశ్న వేసుకో. అవే లేకపోతే నచ్చేవారా అన్నదీ ఆలోచించుకో. ఇక మరో విషయం... నిన్ను ప్రేమించట్లేదు అనగానే తప్పుకొన్నా అన్నావు. మంచి నిర్ణయం. కానీ మరో అబ్బాయి ప్రేమ ప్రతిపాదన తేగానే ఒప్పుకొన్నావు. నిజానికి ఒకరిపై ఇష్టం మరొకరిపైకి అంత త్వరగా వెళ్లిపోతుందా? పోదు. నువ్వు ఎవరో ఒకరి ఆలంబన కావాలనుకుంటున్నావు. లేదా ఇప్పుడు కాలేజీల్లో బాయ్‌ఫ్రెండ్‌ ఉండటం తప్పనిసరి అన్న భావన పెరిగింది. అలా ఎవరినో చూసైనా అనుసరిస్తుండొచ్చు. నువ్వు ఇష్టపడ్డ అబ్బాయి కూడా ఎవరినో ఇష్టపడి మళ్లీ నువ్వంటే ప్రేమ అనడమేంటి? నువ్వే ఆలోచించు... ముగ్గురిలో జీవితానికి సంబంధించిన పరిపక్వత కనిపిస్తోందా? ఇదంతా ఆకర్షణే. మున్ముందు నువ్వు చూడాల్సిన జీవితం చాలా ఉంది. ఈక్రమంలో ఎదురయ్యే అనుభవాలే ఇవన్నీ. బాగా చదువుకుని జీవితంలో స్థిరపడు. అప్పుడు అభిరుచులు మారడమే కాదు... జీవితంపై స్పష్టతా వస్తుంది. అప్పుడు నీకు నచ్చిన, నిన్ను మెచ్చిన అబ్బాయిని ఎంపిక చేసుకోవచ్చు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్