వడాపావ్‌తో... రోజుకి రూ.నలభై వేలు!

స్ట్రీట్‌ ఫుడ్‌ రుచి చూసేవారందరికీ ‘వడాపావ్‌’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పేదవాడి ఆహారంగానూ దీనికి పేరు. తక్కువ ధర, కడుపు నిండుతుందని మహారాష్ట్రలో దీనిపై ఆధారపడే వారే ఎక్కువ. అలాంటి వంటకంతో ఒకమ్మాయి నెలకి లక్షల్లో సంపాదిస్తోందని తెలుసా?

Published : 26 Jun 2024 00:55 IST

ట్రెండింగ్‌

స్ట్రీట్‌ ఫుడ్‌ రుచి చూసేవారందరికీ ‘వడాపావ్‌’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పేదవాడి ఆహారంగానూ దీనికి పేరు. తక్కువ ధర, కడుపు నిండుతుందని మహారాష్ట్రలో దీనిపై ఆధారపడే వారే ఎక్కువ. అలాంటి వంటకంతో ఒకమ్మాయి నెలకి లక్షల్లో సంపాదిస్తోందని తెలుసా?

చంద్రికా గెరా దీక్షిత్‌... ఇలా చెబితే తెలియదేమో కానీ ‘వడపావ్‌ గర్ల్‌’ అనండి... దేశమంతా గుర్తుపట్టేస్తుంది. అంతలా గుర్తింపు తెచ్చుకుంది చంద్రిక. ఈమెది దిల్లీ. ‘హల్దిరామ్స్‌’లో ఉద్యోగి తను. కొడుకు డెంగ్యూ బారినపడితే చూసుకోవడానికి ఉద్యోగం మానేయక తప్పలేదు. భర్త బైక్‌ టాక్సీ నడుపుతాడు. మళ్లీ ఉద్యోగం కొనసాగిద్దామంటే వేళ కాని వేళలతో పిల్లాడిని చూసుకోవడం ఇబ్బంది అయ్యింది. అప్పుడు తనకు ఇష్టమైన వంటనే ఉపాధిగా మలుచుకోవాలి అనుకుంది చంద్రిక. దిల్లీ అంటే ఛోలే బటూరే, పరాఠా. మిగతావాళ్లతో పోలిస్తే భిన్నంగా ఉండాలని వడాపావ్‌ని ఎంచుకుంది. దాన్ని తయారుచేసే ఓ బండిని పెట్టుకుంది. తన చేతిరుచికి అందరూ ఫిదా అవుతోంటే త్వరలోనే గుర్తింపు తెచ్చుకుందీమె. అలా అలా ఆమె గురించి ఓ ఫుడ్‌ బ్లాగర్‌కి తెలిసింది. అతనితో చంద్రిక తన కథను పంచుకున్న వీడియో కాస్తా సోషల్‌మీడియాలో వైరలైంది. అలా దేశమంతా ఈమె గురించి తెలిసింది. అడపాదడపా వార్తల్లోకీ ఎక్కుతూ తాజాగా హిందీ బిగ్‌బాస్‌ షోలో పాల్గొనే అవకాశం దక్కింది. అప్పటిదాకా స్వయంకృషితో ఎదిగిన అమ్మాయిగా చంద్రికకు పేరుండేది. తీరా తన సంపాదన గురించి తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు. షోలో తోటివారితో మాటల్లో సందర్భంగా ‘రోజుకు రూ.40వేలు సంపాదిస్తా’నని చెప్పింది చంద్రిక. అది విని తోటివారే కాదు... నెట్టింటా ఆశ్చర్యపోతున్నారు. పైగా ‘ఫోన్, ఆన్‌లైన్‌ సినిమాలు పక్కన పెట్టి, మీరూ ప్రయత్నించండి... సాధించగలరు’ అని సలహానీ ఇచ్చింది. ఈ వీడియో చూశాక ‘ఉద్యోగాల పేరుతో కష్టపడటం కంటే... ఆసక్తి ఉన్నదేదో గ్రహించుకొని అది చేయడం నయమేమో! అప్పుడు మనమూ ఆమెలా విజయం సాధించచ్చు’ అంటున్నవారూ చాలామందే. మరి 
మీరేమంటారు? 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్