Updated : 03/04/2021 03:39 IST

ప్రతి శుక్రవారం... పర్యావరణ మంత్రం!

రేపటి తరం కోసం ఈ క్షణం నుంచే ఆలోచిద్దాం.. అంటున్నారు ఫ్రైడేస్‌ ఫర్‌ ఫ్యూచర్‌(ఎఫ్‌ఎఫ్‌ఎఫ్‌)సంస్థకు చెందిన విశాఖపట్నం సభ్యులు. ఓపక్క చదువుకుంటూనే మరోపక్క ప్రజల్లో మార్పును తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారీ అమ్మాయిలు..  స్వీడన్‌ పర్యావరణవేత్త గ్రెటాథంబర్గ్‌ పిలుపుని అందుకుని పర్యావరణ పరిరక్షణ కోసం తమ వంతుగా అడుగులు వేస్తున్నారు నవీన వంగర, దీపశ్రీ... ఓయింద్రిలా భట్టాచార్య..
ప్రతి శుక్రవారం.. మహావిశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) కార్యాలయం గేటు ముందు నిల్చుని పెరుగుతున్న కాలుష్యంపై నిరసన వ్యక్తం చేస్తోంది దీపశ్రీ. ఇలా ఒక వారం.. రెండు వారాలు కాదు ఏకంగా 71 వారాలుగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నిస్తోందా అమ్మాయి. ‘భావితరాలకు స్వచ్ఛమైన విశాఖపట్నాన్ని అందించాలనేది నాకల. అందుకే పనిదినమైనా శుక్రవారాన్నే ఎంచుకున్నా’ అనే దీప... జంతువులు విడుదల చేసే వ్యర్థాలు కూడా భూతాపానికి కారణమవుతాయి. అందుకే ఆహారంలో మాంసం, పాలు, పాల  ఉత్పత్తులకు బదులుగా కొబ్బరిపాలు, సోయాబీన్‌ పనీర్‌, పనసకాయతో చేసిన ఉత్పత్తులను ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చని సలహా ఇస్తోంది. ‘గార్డియన్స్‌ ఆఫ్‌ గాయా (భూసంరక్షకులు)’ అనే ప్రత్యేక బృందాన్ని ఏర్పరిచి ప్రజల్లోకి ఈ విషయాలను తీసుకెళ్తోంది.


ఓయింద్రిలా భట్టాచార్య.. ఉండేది విశాఖ కలెక్టరేట్‌ పక్కనే ఉన్న అఫీషియల్‌ కాలనీలో. 200 కుటుంబాలున్న కాలనీని ఎంతో ఆదర్శవంతంగా తీర్చిదిద్దింది ఓయింద్రిలా. ఆమె ఆధ్వర్యంలో ఆ కాలనీ ప్రజలంతా కొన్ని నియమాలు తప్పకుండా పాటిస్తున్నారు. అంతా వస్త్రంతో చేసిన బ్యాగులనే వాడుతున్నారు. ప్లాస్టిక్‌ని నిషేధించారు. కాలనీ వాళ్లందరూ ఓ సొసైటీగా ఏర్పడి ఏకంగా పార్కునే ఏర్పాటు చేసుకున్నారు.  ‘గతంలో మా కాలనీలో చెట్లు ఉండేవే కావు. ఇప్పుడు ప్రతీ ఇంటికీ ఓ చెట్టుంది. మా కాలనీని ఓ ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దాలనుకున్నాం. చెట్లని తొలగించాల్సి వస్తే వాటిని వేరే చోట్ల పెంచేందుకు జీవీఎంసీ అధికారులతో మాట్లాడాం’ అంటోంది ఓయింద్రిలా.


నవీన వంగర.. ప్రస్తుతం గుజరాత్‌లోని వడోదరలో ‘ది మహారాజా సయాజీరావు యూనివర్సిటీ ఆఫ్‌ బరోడా’లో ఎన్విరాన్‌మెంట్‌ స్టడీస్‌ చదువుతోంది. ‘ఫ్రైడ్‌ ఫర్‌ ఫ్యూచర్‌’ సంస్థలో సుమారు వెయ్యిమంది వలంటీర్లకి ఆన్‌లైన్‌ శిక్షణ అందించింది నవీన. ‘పర్యావరణాన్ని రక్షించుకునే విధంగా ప్రజలకు చక్కని పరిష్కారాలని చూపించాలనేది మా లక్ష్యం. నెలరోజుల ముందే మా ప్రణాళిక ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో తీరప్రాంతమెక్కువ. కానీ సముద్రజీవులు ప్లాస్టిక్‌ కాలుష్యానికి బలవుతున్నాయి. అందుకే ప్లాస్టిక్‌ని ఎలా వాడాలి, ఎలా భద్రపరచాలి... ఇందులో ప్రజలు, అధికారుల పాత్రపై అవగాహన కల్పిస్తున్నాం అంటోంది’ నవీన.


- హిదాయతుల్లా బిజాపూర్‌, విశాఖపట్నం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని