ఉల్లాసాన్నిచ్చే  వర్ణాలు...

వర్ణాలు మానసిక స్థితిపై మంచి ప్రభావం చూపిస్తాయని పలు అధ్యయనాలు తేల్చిచెప్పాయి.  అటువంటి రంగులను గోడలకు వేయిస్తే... గదికి మాత్రమే కాదు, మనసుల్లో సానుకూలత నిండిన ఆలోచనలతోపాటు ఉల్లాసాన్ని అందిస్తాయంటున్నారు నిపుణులు...

Updated : 15 Aug 2021 04:38 IST

వర్ణాలు మానసిక స్థితిపై మంచి ప్రభావం చూపిస్తాయని పలు అధ్యయనాలు తేల్చిచెప్పాయి.  అటువంటి రంగులను గోడలకు వేయిస్తే... గదికి మాత్రమే కాదు, మనసుల్లో సానుకూలత నిండిన ఆలోచనలతోపాటు ఉల్లాసాన్ని అందిస్తాయంటున్నారు నిపుణులు. ఏ వర్ణం ఎలాంటి ప్రభావం చూపిస్తుందో కూడా చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం. ఇంటిని, మనసుల్ని రంగులమయం చేసుకుందాం....

పసుపు
సానుకూలత నిండిన వర్ణం. హాలు గోడలకు వేస్తే పసుపు మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. కుటుంబం సభ్యుల మధ్య అనుబంధాల్ని పెంచుతుంది. ఆత్మగౌరవాన్ని, మానసిక శక్తిని పెంపొందిస్తుంది. పిల్లల గదిలో లేత పసుపు వేస్తే వారి జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి.

ఎరుపు
భోజనాల గది, హాలు, వంట గదికి సరైన ఎంపిక ఎరుపు. చాలా శక్తివంతమైనది. అలసటగా ఉన్నప్పుడు ఈ రంగు వేసిన గదిలోకి అడుగు పెడితే ఉత్సాహం కలుగుతుంది. తోడుగా లేత వర్ణాలను మ్యాచింగ్‌గా వేస్తే గది అందం రెట్టింపు అవుతుంది. భావోద్వేగాలు ప్రతిఫలించేలా ఉండే ఎరుపు... ఫర్నిచర్‌కు ప్రత్యేకతను తెచ్చిపెడుతుంది.

ఊదా
ఎరుపు, నీలం కలిసే ఊదా రంగు సానుకూలతను నింపుతుంది. మానసిక ప్రశాంతతతోపాటు యోగా, మెడిటేషన్‌ వంటి వాటికి ఏకాగ్రతను తెస్తుంది. పూజ, లివింగ్‌ రూంలకు ఈ వర్ణాన్ని ఎంచుకోవచ్చు. ఈ రంగునద్దిన గదిలో ఆత్మపరిశీలన చేసుకోవాలనిపించే వాతావరణం ఉంటుంది. ఇది పడకగదికి సరైన ఎంపిక. విశ్రాంతితోపాటు మంచి నిద్రను తెచ్చిపెడుతుంది. రాయల్‌ కలర్‌గా పిలిచే ఊదా రంగు ఇంటికి కొత్తదనాన్నీ ఇస్తుంది.

ఆకుపచ్చ
గదిని తాజాదనంతో నింపే ప్రత్యేకత ఆకుపచ్చ వర్ణానికి ఉంది. ఒత్తిడిని దూరం చేసి, ప్రశాంతంగా మార్చే శక్తి ఇందులో ఉంది. వరండా, వంటిల్లు, స్నానాల గదికి ఈ రంగును ఎంచుకోవచ్చు. ప్రతికూల ఆలోచనలను దూరం చేస్తుంది.

గులాబీ
ప్రేమకు ప్రతిరూపం ఈ వర్ణం. ప్రశాంతత, సామరస్యాన్ని చెంతకు తేగలిగే శక్తి గులాబీకి ఉంది. ఈ రంగును అమ్మాయిలు మరింత ఎక్కువగా ఇష్టపడతారు. నిత్యం సంతోషంగా ఉంచి, ప్రశాంతతను అందిస్తుంది. పడక గదికి గులాబీని ఎంచుకుంటే కంటినిండా నిద్ర పోవచ్చు. దీనికి లేతవర్ణంలో ఫర్నిచర్‌ను ఎంపిక చేసుకుంటే గది మరింత ఆకర్షణీయంగా మారుతుంది.

తెలుపు
తెల్లటి గదిలో ఏ ఫర్నిచర్‌ అయినా ఇట్టే కలిసిపోతుంది. ప్రశాంతతతోపాటు మనసు స్వచ్ఛంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. సానుకూలతను నింపుతుంది.

నీలం
పడక గది, స్నానాల గదికి ఈ రంగును ఎంపిక చేసుకోవాలి. సముద్రం, ఆకాశాన్ని గుర్తుకు తెస్తూ, ఆరోగ్యానికి ప్రతీకగా నిలిచే ఈ వర్ణం ఒత్తిడి, ఆందోళనలను దూరం చేస్తుంది. కుంగు బాటుకు గురిచేసే భావోద్వేగాలను అదుపులో ఉంచుతుంది. ఉత్సాహాన్ని నింపుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్