Updated : 29/09/2021 02:31 IST

ఇరుకైన ఇంటిని కూడా ఇంపుగా...

అమలకు ఇంటిని సర్దినప్పుడల్లా అసంతృప్తే. ఇల్లు ఇరుకుగా ఉండటంతో అవసరమైన సౌకర్యాలకు కూడా దూరమవుతున్నాం అనుకుంటుంది. అయితే రెండు మూడు పనులకు పనికొచ్చేలా తేలికైన ఫర్నిచర్‌ను ఎంపిక చేసుకుంటే సౌకర్యమే కాదు అందమూ అంటున్నారు ఇంటీరియర్‌ డిజైనర్లు. 

స్థలాభావం... హాలు చిన్నది కావడంతో సోఫాకు మాత్రమే చోటు ఉంటుంది. ఇంట్లో అతిథి కోసం వేరే గది కూడా ఉండకపోవచ్చు. ఇటువంటి సందర్భంలో ట్రాన్స్‌ఫార్మర్‌ సోఫాను ఎంచుకోవచ్చు. దీన్ని ఫోల్డ్‌ చేస్తే సోఫాగా కనిపిస్తుంది. అవసరమైనప్పుడు చిన్న మంచంలా మార్చుకోవచ్చు.

అవసరానికి... ఆఫీస్‌ పని చేసుకోవడానికి ఇంట్లో ప్రత్యేకంగా స్థలం ఉండకపోవచ్చు. పడకగదిని ఆఫీస్‌రూంగా మార్చుకోవడానికి ఇప్పుడు కొత్త రకం ఫర్నిచర్‌ వచ్చింది. అదే డెస్క్‌ బెడ్‌ లేదా బెడ్‌ విత్‌ డెస్క్‌. కంప్యూటర్‌, టేబుల్‌ ల్యాంప్‌ వంటివన్నీ ఉంచుకునేలా టేబుల్‌ ఉంటుంది. ఆఫీస్‌ పని తర్వాత దీన్ని బెడ్‌గా మార్చేసుకోవచ్చు.

గోడలో... రీడింగ్‌ రూం చిన్నగా ఉన్నప్పుడు గోడలో ఆఫీస్‌టేబుల్‌ ఇమిడిపోయేలా చేసుకోవచ్చు. ఇదే ఆటో ఓపెనింగ్‌ ఫోల్డింగ్‌ టేబుల్‌. అవసరమైనప్పుడు దీన్ని బల్లగా మార్చుకోవచ్చు. ఎదురుగా ఓ కుర్చీ వేసుకుని ల్యాప్‌టాప్‌ ఉంచితే చాలు. హాయిగా పని పూర్తి చేసుకోవచ్చు.

పుస్తకపఠనం... ప్రశాంతంగా కూర్చుని పుస్తకం చదవాలనుకున్న వారికి ఈ ఫోల్డింగ్‌ బంక్‌ బెడ్స్‌ చాలా సౌకర్యంగా ఉంటాయి.

సాగే భోజనాల బల్ల... ఇంటిల్లిపాదీ కూర్చుని భోజనం చేయడానికి పెద్ద డైనింగ్‌ టేబుల్‌ వేయాలనుకుంటే గది ఇరుకుగా అనిపిస్తుంది. అటువంటప్పుడు పెడెస్టల్‌ ఎక్స్‌టెండింగ్‌ టేబుల్‌ సౌకర్యంగా ఉంటుంది. ఇది మామూలప్పుడు నాలుగు కుర్చీలతో టేబుల్‌ ఉంటుంది. కావాల్సినప్పుడు దాన్నే ఎనిమిదిమందికి సరిపోయేలా పెంచుకోవచ్చు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని