Updated : 23/10/2021 05:32 IST

కష్టాల ‘సాము’లో ఆరితేరి!

అండగా నిలవాల్సిన వయసులో నాన్న దూరమయ్యాడు. అయినా కుంగిపోలేదు. ఆయనిచ్చిన ప్రోత్సాహాన్నే ఆసరాగా చేసుకుంది. ప్రతిష్ఠాత్మక ఎన్‌.ఐ.టి.లో ఎం.టెక్‌. చదువుకుంటూనే కుటుంబానికీ అండగా మారింది. అంతేనా! సమాజానికీ సాయమందిస్తూ వెన్నెల నీలకంఠ ఆదర్శంగా నిలుస్తోంది. విశాఖలో జరిగిన జాతీయ కర్రసాము, కత్తిసాము, శిలంబం పోటీల్లో కర్ర, కత్తిసాము, డబుల్‌ కర్రసాముల్లో పతకాలను కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా ‘వసుంధర’తో తన కథను పంచుకుందిలా...!

మాది కర్ణాటకలోని ముడిపు గ్రామం. నిరుపేద కుటుంబం. నాన్న నీలకంఠ క్షవర దుకాణం నిర్వహించేవారు. అమ్మ సుమతి. నాకిద్దరు తమ్ముళ్లు. మార్షల్‌ ఆర్ట్స్‌వైపు నాన్న ప్రోత్సహించారు. పదేళ్ల వయసున్నప్పటి నుంచే సాధన మొదలుపెట్టా. జూడో, మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌, కరాటేల్లో బ్లాక్‌ బెల్ట్‌లు సాధించా. యోగా, స్కేటింగ్‌, బాక్సింగ్‌, ఆర్చరీ మొదలైన వాటిపైనా దృష్టిపెట్టా. వీటిల్లో రాష్ట్ర, జాతీయ పోటీల్లో పతకాలూ సాధించా. నాన్న మూడేళ్ల క్రితం అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించారు. నాకదో షాక్‌. కానీ కుంగిపోలేదు. చిన్నప్పటి నుంచీ ఆయనిచ్చిన ప్రోత్సాహాన్ని గుర్తు తెచ్చుకుని ఇంటికి అండగా నిలవాలనుకున్నా. తమ్ముళ్లు పాఠశాల స్థాయిలోనే ఉన్నారు. మరో దారి లేక అమ్మ కూలికి వెళ్లడం మొదలుపెట్టింది. నేను చదువును కొనసాగిస్తూనే కుటుంబానికీ అండగా నిలుస్తున్నా. బీటెక్‌ 79 శాతం పైగా మార్కులతో పూర్తిచేశా. ప్రస్తుతం ఎన్‌ఐటీ, మంగళూరులో ఎంటెక్‌ చేస్తున్నా. ఇక్కడి రామకృష్ణ మఠం ఆధ్వర్యంలోని తపోవనంలో పిల్లలు, యువతకు జూడో, మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌, కరాటే, స్కేటింగ్‌, బాక్సింగ్‌, ఆర్చరీ, యోగాలలో శిక్షణనిస్తున్నా. అందుకు సంస్థ కొంత మొత్తం చెల్లిస్తోంది. ఫీజు, అద్దెకు ఉంచుకుని మిగిలినవి ఇంటికి పంపిస్తా.

ఉదయం నాలుగు గంటల నుంచి నా దినచర్య మొదలవుతుంది. యోగా, తర్వాత మార్షల్‌ ఆర్ట్స్‌ తరగతులు నిర్వహిస్తా. ఆపై కళాశాల తరగతులకు హాజరవుతా. సాయంత్రం కాలేజీ అయ్యాక 8 గంటల వరకు మళ్లీ శిక్షణ ఇస్తా. అది అయ్యాక నా చదువు. ఇదే నా దినచర్య. అలాగని నా సాధనను పక్కన పెట్టలేదు. రోజూ దానికీ సమయాన్ని కేటాయిస్తా. కొత్త టెక్నిక్‌లను ప్రయత్నిస్తా. మార్షల్‌ ఆర్ట్స్‌లో నాకు చాలామంది గురువులు ఉన్నారు. వారి నుంచి ఎప్పటికప్పుడు సూచనలు తీసుకుంటా. అయిదేళ్ల నుంచి కత్తిసాము, కర్రసాములను సాధన చేస్తున్నా. మా పూర్వీకుల మూలాలు తమిళనాడులో ఉన్నాయి. అందుకే వీటిపైౖ మక్కువ ఏర్పడిందేమో అనిపిస్తుంటుంది.

ప్రతి విషయాన్నీ ఓ పాఠంగా తీసుకుంటా. అలా నాన్న ప్రోత్సాహమే నన్ను నడిపిస్తోంది! అందుకే అమ్మాయిలు, యువతులకు ప్రత్యేక శిక్షణనిస్తా. అమ్మాయిలను చిన్నప్పటి నుంచి సున్నితంగా పెంచుతారు. హఠాత్తుగా ఏదైనా అనుకోని పరిస్థితి ఎదురైతే ఇబ్బంది పడేది వాళ్లే. అందుకే వాళ్లకు ఉపయోగపడేలా త్వరగా స్పందించి ఎదుర్కోవడం, తిప్పికొట్టడం వంటి వాటిని నేర్పిస్తుంటా. ఇవి శారీరకంగానే కాదు.. మానసికంగానూ దృఢంగా మారుస్తాయి. నేర్చుకునేటప్పుడు, సాధన చేసేటప్పుడు గాయాలు సహజం. కానీ చిన్న వాటికే భయపడితే భవిష్యత్‌లో కష్టమని వాళ్లకి, వాళ్ల అమ్మానాన్నలకి వివరిస్తా. అమ్మాయిల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచడమే సమాజానికి నావంతు సాయంగా భావిస్తా. నా కుటుంబాన్ని ఆర్థికంగా నిలబెట్టాలన్నది లక్ష్యం. అందుకే ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలపై దృష్టిపెట్టా. పరిశోధనపైనా ఆసక్తి ఉంది. రిసెర్చర్‌గా స్థిరపడాలనుకుంటున్నా.

- ఎం.వి.కూర్మరాజు, ఈటీవీ, విశాఖపట్నం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని