Updated : 05/02/2022 04:00 IST

దుర్వాసనలు దూరమిలా!

గృహిణులు ఎక్కువ సమయం గడిపేది వంటింట్లోనే. ఇది శుభ్రంగా ఉన్నప్పుడే అందరికీ ఆరోగ్యం సొంతమవుతుంది. మరి అంతటి ప్రాధాన్యం ఉన్న ఈ వంటగదిలో ఒక్కోసారి దుర్వాసన వస్తుంది. అలాంటి సమయంలో ఇల్లాలు ఇబ్బందులు పడకుండా ఈ చిట్కాలను పాటిస్తే సరి.

* గిన్నెలను శుభ్రం చేసిన వెంటనే అరల్లోనో, అల్మారాలోనో సర్దేయొద్దు. ఇలా చేస్తే గిన్నెలు, అవి పెట్టిన ప్రాంతంలోనూ దుర్వాసన వస్తుంది.  ఇలా కాకుండా ఉండాలంటే... గిన్నెల నుంచి నీళ్లు పూర్తిగా పోనివ్వాలి. ఆ తర్వాత శుభ్రమైన కాటన్‌ వస్త్రంతో పాత్రలను తుడిచి అవి ఆరాకే సర్దుకోవాలి.

* ఎప్పుడూ మూసి ఉండటం వల్ల కప్‌ బోర్డుల నుంచి కూడా అప్పుడప్పుడూ ఇలాంటి వాసనలు రావడం సహజమే. కాబట్టి రోజులో ఓ పావుగంట కప్‌ బోర్డు తలుపులు తెరిచి ఉంచాలి. అప్పుడే దుర్వాసన దూరమవుతుంది. వేపాకులను అరల్లో అక్కడక్కడా పెట్టాలి. ఇలా చేస్తే పురుగులు, క్రిములు చేరవు.

* వంటింటిని శుభ్రం చేసిన తర్వాత కూడా దుర్వాసన వస్తోంటే కాసిన్ని నీళ్లలో వంటసోడా కలిపి వంటబండా, తలుపులు, కిటికీలను తుడిస్తే సరి. అంతేకాదు ఓ గిన్నెలో కాస్తంత వంటసోడా వేసి అల్మారాలో మూలన పెట్టినా వాసన పోతుంది.

* బకెట్‌ నీళ్లలో కొద్దిగా వెనిగర్‌ కలపాలి. ఈ నీటిలో వస్త్రాన్ని ముంచి వంటగదిని తుడిచి చూడండి మార్పు మీకే తెలుస్తుంది. ఇవన్నీ కాదనుకుంటే రూమ్‌ ఫ్రెష్‌నర్‌ను స్ప్రే చేస్తే సరి.

* ఎసెన్షియల్‌ ఆయిల్‌లో ముంచిన చిన్న చిన్న వస్త్రాలను గ్యాస్‌ బండ, పాత్రలుండే అరల మూలల్లో పెట్టి కిచెన్‌ డోర్‌ వేసేయాలి. ఉదయానికల్లా దుర్వాసన మాయమై సువాసనలను వెదజల్లుతుంది. ఎన్ని పనులున్నా రోజూ వంటగదిని తప్పకుండా శుభ్రం చేయాలి. ముందుగా తడి వస్త్రంతో, ఆ తర్వాత పొడి వస్త్రంతో గదినంతటిని తుడవాలి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని