ఆహ్లాదానికి ఆహ్వానం...

ఇంటిని చూసి... ఇల్లాలిని చూడమంటారు పెద్దలు. ఎందుకంటే... కుటుంబ సంతోషం, ఆరోగ్యం ఆ ఇంటి పరిశుభ్రతపైనే ఆధారపడి ఉంటాయి. ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే మొక్కల పెంపకం మార్గం. దాని ద్వారా ఆహ్లాదాన్నీ నింపుకోవచ్చు. మరి మీరూ దీనికి ఆహ్వానం పలుకుతారా...

Published : 25 Feb 2022 00:24 IST

ఇంటిని చూసి... ఇల్లాలిని చూడమంటారు పెద్దలు. ఎందుకంటే... కుటుంబ సంతోషం, ఆరోగ్యం ఆ ఇంటి పరిశుభ్రతపైనే ఆధారపడి ఉంటాయి. ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే మొక్కల పెంపకం మార్గం. దాని ద్వారా ఆహ్లాదాన్నీ నింపుకోవచ్చు. మరి మీరూ దీనికి ఆహ్వానం పలుకుతారా...

వరండాలో వేలాడేలా... గదికి అందాన్ని పెంచి, మనసును సానుకూలంగా మార్చగలిగే శక్తి మొక్కలకుంది. మెదడును ఇవి సమన్వయం చేసి, మానసికారోగ్యాన్ని పెంపొందించగలవని పలు అధ్యయనాలు కూడా తేల్చి చెప్పాయి. ఇండోర్‌ మొక్కల పెంపకంలో భాగంగా మొదట వరండాలో ఫెర్న్‌, మనీప్లాంట్‌ వంటి తీగజాతి మొక్కలను వేలాడే తొట్టెల్లో పెంచాలి. ఓ పక్కగా చిన్న చిన్న తొట్టెలను ఒకే ట్రేలో ఉండేలా సర్ది వాటిలో జెరానియమ్స్‌, చామంతివంటి వాటిని పెంచితే పూలెక్కువగా పూసే ఈ జాతి మొక్కలు మనసును ఉత్సాహంగా ఉంచుతాయి.

బాల్కనీలో... ఎండ పడే ప్రాంతాన్ని ఎంచుకొని వర్టికల్‌ గార్డెన్‌ను ఏర్పాటు చేసుకోవాలి. చోటుతో పనిలేకుండా గోడపై అమర్చే మొక్కలను ఎంచుకుని వాటిని వరుసగా స్టాండ్స్‌లో సర్దితే చాలు. గోడ పక్కగా తొట్టెల్లో మందార, చామంతి, గులాబీ వంటి మొక్కలను పెంచుకోవాలి. ముందుగదిలో సోఫా పక్కగా ఉంచే రంగురంగుల ఆకులతో ఉన్న క్రోటన్స్‌ గదిలో ఆకర్షణీయంగా కనిపించడమే కాదు.. వాతావరణంలోని కాలుష్యాన్నీ దూరం చేస్తాయి. బాల్కనీలో పెంచే మొక్కలకు రోజూ బియ్యం కడిగే నీటిలో కూరగాయల వ్యర్థాలను వేసి నాలుగైదు గంటలు నాననిచ్చి పోస్తే ఆరోగ్యంగా పెరుగుతాయి.  

గదుల్లో... కిటికీవైపు టేబుల్‌పై చిన్న గాజు కూజాలో నీటిని నింపి ఒక మనీప్లాంట్‌ ఉంచాలి. భోజనాల బల్ల మీద వేగంగా పెరగని మొక్కజాతిని లేదా టెస్ట్‌ట్యూబ్‌ ప్లాంట్స్‌ను ఎంచుకుంటే అందంగా ఉంటుంది, నిత్యం నీటిని అందించాల్సిన అవసరమూ ఉండదు. ప్రస్తుతం మార్కెట్‌లో లభ్యమవుతున్న ఆకర్షణీయమైన చిన్నచిన్న తొట్టెల్లో మొక్కలు గదికే అందాన్ని తెస్తాయి. వంటింటి కిటికీ లేదా బయటివైపు చిన్నచిన్న ట్రేల్లో రోజూ వినియోగపడే కొత్తి మీర, మెంతికూర, పుదీనా వంటివి పెంచితే చాలు. మొలక వచ్చిన ఉల్లిని అదే తొట్టెలో ఉంచితే ఉల్లికాడలు పెరుగుతాయి. వంట రుచిని పెంచడానికి వీటిని వినియోగించుకోవచ్చు.

పిల్లలతో... చిన్నారులకూ మొక్కల పెంపకంపై ఆసక్తి కలిగించాలి. వీరి కోసం ప్రత్యేకంగా చిన్నచిన్న తొట్టెలు, మట్టితో సహా కిట్స్‌ లభ్యమవుతున్నాయి. తేలికగా పెరిగే మొక్కల విత్తనాలను వాళ్లతోనే నాటించి ఆ బాధ్యత వారికే అప్పజెప్పితే చాలు. పచ్చదనంపై శ్రద్ధ పెరిగి వారికి ఇదొక అభిరుచిగానూ మారుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని