సులువుగా మెరిపించేయండి!
ఉద్యోగినులకు వారాంతాలు వచ్చాయంటే ఇంటి శుభ్రతపై దృష్టిపెట్టేవారే ఎక్కువ. ఇదేమో ఓ పట్టాన తెమలదు. దీంతో మామూలు రోజులకంటే ఆరోజు ఇంకాస్త ఎక్కువ కష్టపడ్డట్టే ఉంటుంది. మరేంటి పరిష్కారం? దానికీ కిటుకులు పాటిస్తే సరి!
ఉద్యోగినులకు వారాంతాలు వచ్చాయంటే ఇంటి శుభ్రతపై దృష్టిపెట్టేవారే ఎక్కువ. ఇదేమో ఓ పట్టాన తెమలదు. దీంతో మామూలు రోజులకంటే ఆరోజు ఇంకాస్త ఎక్కువ కష్టపడ్డట్టే ఉంటుంది. మరేంటి పరిష్కారం? దానికీ కిటుకులు పాటిస్తే సరి!
* ఉదయం లేచాక ఏమేం చేయాలో నిర్ణయించుకుందా మనుకోవద్దు. ప్రణాళిక ముందు రోజు రాత్రే మొదలవ్వాలి. రోజులో ఎక్కువ సమయం గడిపేది వంటగదే! కాబట్టి ముందు ఇక్కడి నుంచే ప్రారంభిస్తే సరి. స్టవ్ మీది ప్లేట్లు ముందే తీసి ఓ బేసిన్‌లో వేడినీళ్లు పోసి, దానిలో కొంత వంటసోడా, సర్ఫు వేసి నానబెట్టండి. పొద్దున్నే చిటికెలో శుభ్రం చేసుకోవచ్చు. మరుసటి రోజు ఏమేం వండాలో నిర్ణయించేసుకుని కావాల్సినవి ముందే సిద్ధం చేసుకుంటే.. ఎక్కువ సమయం మిగిలిన భావన వస్తుంది.
* కాళ్లు తుడిచే పట్టాలనీ రాత్రిపూటే నాన బెట్టేసుకోవచ్చు. సోఫా కవర్లు, మార్చాల్సిన దుప్పట్లనూ అప్పుడే పక్కన పెట్టేసుకుంటే ఉదయాన్నే నేరుగా వాషింగ్ మెషిన్‌లో పడేయడమో, ఉతికేసుకోవడమో చేయొచ్చు.
* క్రిస్టల్, వెండి వాటిని షోకేసుల్లోంచి తీసేయండి. వాటిని శుభ్రం చేయడానికీ ఎక్కువ సమయం పడుతుంది. వాటిని పేపర్/ వస్త్రంలో చుట్టి లోనపెట్టేస్తే రంగు మారవు. ఇతర వాటిని వేటినైనా గోరు వెచ్చని నీటిలో అమ్మోనియా వేసి తుడిస్తే తళతళలాడతాయి.
* స్నానాల గదిని కడగడం పెద్ద పనిగా తోస్తుంది. అందుకే త్వరగా చేయాలనిపించదు. వాడే రసాయనాల ఉత్పత్తులే ఇందుకు కారణం. బదులుగా వెనిగర్, నిమ్మకాయ, బ్లీచ్, బేకింగ్ సోడాలను ఉపయోగించండి. మురికీ త్వరగా పోతుంది, శ్రమా తక్కువ.
* ఇదంతా వారాంతం వరకూ పోగవుతోంది అనుకున్నారా! అయితే ఓ పని చేయండి. రోజూ ఇల్లు ఊడుస్తాం కదా! చీపురుతోపాటే ఓ డస్టర్‌నీ చేతిలో పట్టుకోండి. దుమ్ము కనిపించగానే దాంతో తుడిచేస్తే వారాంతంలో ఈ పని తగ్గుతుంది. సింకు పక్కనే ఓ పొడి గుడ్డను ఏర్పాటు చేసుకుంటే వాడటం పూర్తవగానే ట్యాపులు, పక్కన తుడిచేస్తే నీటి మరకల బెడద ఉండదు. కాస్త తగ్గినా.. పని తగ్గినట్టేగా!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.